Skip to content
జాతీయం వార్తలు

శిరమెత్తిన యువతరం.. నాడు నేడూ స్ఫూర్తిదాయకం

Prajapaksham 21 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
శిరమెత్తిన యువతరం.. నాడు నేడూ స్ఫూర్తిదాయకం

Police atrocities on youth in Jharkhand

డి. రాజా, సిపిఐ ప్రధాన కార్యదర్శి

విద్యార్థులు నిరసనలో ఒక్కటై నిలబడిన దృశ్యంలో ఒక స్ఫూర్తి దాయకమైన, చైతన్యవంతమైన విషయం ఉంది. వారి ప్లకార్డులపై కొత్త డిమాండ్లు ఉండొచ్చు. వారి నినాదాలు కొత్త తరానికి చెందినవి కావొచ్చు. వారు సంఘటితం అయ్యేందుకు ఉపయోగించిన టెక్నాలజీలు గతం కంటే పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. కానీ ఆ స్ఫూర్తి కొత్తది కాదు. బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి స్వతంత్ర భారతదేశంలో ప్రజా స్వామ్యం, సామాజిక న్యాయం, యువత హక్కుల కోసం జరిగిన పోరాటాల వరకు, విద్యార్థులు పదేపదే ప్రజా సమీకరణలో ముందుండి నడిపించారు. దేశం ఉన్నత భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు, వారు తమను తాము తరగతి గదులు, పరీక్షలు, క్యాంప్‌లలోని చిన్న సరిహద్దులకు ఎన్నడూ పరిమితం చేసుకోలేదు.
విద్యార్థి ప్రతిఘటన చరిత్ర. స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, అత్యంత నాటకీయంగా జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం ముఖ్యమైనది. వారు వలసవాద విద్యాసంస్థలను బహిష్కరించారు, ప్రదర్శనలు నిర్వహించారు, జాతీయవాద సాహిత్యాన్ని పంచారు. అరెస్టులు, జైలు శిక్షలను ఎదుర్కొ న్నారు. ప్రతిఘటన సందేశాన్ని పట్టణాలు, గ్రామాలకు మోసు కెళ్ళారు.. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో, వలస ప్రభుత్వం ప్రధాన నాయ కత్వాన్ని జైలులో పెట్టినప్పుడు, ఆ ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. బ్రిటిష్‌ రాజ్‌ అణచివేతలోనూ వారు ఊరేగింపులు నిర్వ హించారు. అరెస్టులను నిరసించారు. రహస్య కార్యకలా పాలలో పాల్గొన్నారు.
ఈ సంప్రదాయం ఒకే రాజకీయ స్రవంతికి పరిమితం కాలేదు. విప్లవ, సామ్యవాద, గాంధేయ, కమ్యూనిస్టు సంప్రదాయాలతో సహా, విద్యార్థులు జాతీయ ఉద్యమంలోని వివిధ స్రవంతుల పట్ల ఆకర్షితులయ్యారు. సమాజ విధి నుంచి విద్యను వేరు చేయలేమనే ఎరుక వారిలో చాలా మందిని ఏకం చేసింది. యావత్తు దేశానికి స్వేచ్ఛను నిరాకరిస్తున్న సమయంలో ఒక విద్యార్థి మౌన ప్రేక్షకునిగా ఉండలేడు.
ఇలాంటి రాజకీయ వాతావరణంలోనే 1936 ఆగస్టులో లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌) స్థాపించబ డింది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులను ఒకచోట చేర్చి, భారతదేశపు మొట్టమొదటి జాతీయ విద్యార్థి సంస్థగా అవతరించింది. గంగా ప్రసాద్‌ మెమోరియల్‌ హాల్‌లో జరిగిన వ్యవస్థాపక సమావేశానికి దేశ వ్యాప్తంగా వందలాదిమంది ప్రతినిధులు హాజరయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి జాతీయ నాయ కులు హాజరుకావడమే, స్వాతంత్య్ర పోరాటంలో విద్యార్థుల భాగస్వామ్యా నికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ప్రతిబింబించింది. ముఖ్యంగా విద్యార్థులను జాతీయ ఉద్యమంలో ఒక ముఖ్యమైన శక్తిగా నెహ్రూ గుర్తించారు.
భగత్‌ సింగ్‌ కథ ఈ సంప్రదాయానికి మరింత లోతైన అర్థాన్ని ఇస్తుంది. భగత్‌ సింగ్‌ కేవలం అత్యున్నత త్యాగం చేసిన ఒక యువ విప్లవకారుడు మాత్రమే కాదు. రాజకీయ అవగాహన లేని సాహసం సమాజాన్ని మార్చ లేదని గ్రహించిన ఒక రాజకీయ మేధావి ఆయన. ఆయన యువత భావ జాల, మేధో వికాసానికి అపారమైన ప్రాధాన్యతనిచ్చారు. విద్యార్థులు, యువతపై రాసిన తన రచనలలో, విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలనే వలసవాద వాదనను ఆయన తిరస్కరించారు. ఆయన దృష్టిలో యువజన ఉద్యమం రాజకీయ విద్య, సంఘం, సామాజిక పరివర్తనకు ఒక పాఠశాలగా మారాలి.
1931లో తన ఉరిశిక్షకు కేవలం కొన్ని వారాల ముందు రాసిన
‘టు యంగ్‌ పొలిటికల్‌ వర్కర్స్‌ (యువ రాజకీయ కార్యకర్తలకు)’ అనే పత్రం లో, భగత్‌ సింగ్‌ కార్మికులు, రైతులలో అధ్యయన కూటములు, రాజకీయ విద్య, ప్రచారం, సంఘటిత కార్యాచరణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యువత తాము వారసత్వంగా పొందిన సమాజాన్ని కేవలం వ్యతిరేకించడం కాకుండా, తాము నిర్మించాలనుకుంటున్న సమాజంపై స్పష్టతను పెంపొం దించుకోవాలని ఆయన విశ్వసించారు. అందువల్ల ఆయన అమరత్వం కేవలం అసాధారణ వ్యక్తిగత ధైర్యసాహసాల చర్య మాత్రమే కాదు. అది సమూలంగా మెరుగైన భవిష్యత్తు కోసం ఆలోచించేందుకు, సంఘటితం కావడానికి, పోరాడేందుకు తరతరాల యువ భారతీయులకు ఒక ఆకర్షణ.
స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలు విద్యార్థి ఉద్యమాల ఈ రాజకీయ స్వభావాన్ని పదేపదే నిర్ధారించాయి. విద్యార్థులు కేవలం ఫీజులు, పరీక్షలు లేదా హాస్టల్‌ సౌకర్యాల గురించే కాకుండా, ప్రజాస్వామ్యం, సమాఖ్య వాదం, భాష, సామాజిక న్యాయం, పౌర స్వేచ్ఛలు, దేశ గమనం వంటి ప్రశ్నలపై కూడా తిరుగుబాటు చేశారు. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాలలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అస్సాం ఉద్యమంలో విద్యార్థులు కీలకమైన సంస్థాగత పాత్ర పోషించారు. ఎమర్జెన్సీకి వ్యతి రేకంగా విద్యార్థులు నేతృత్వంలోని సమీకరణ, 1970వ దశాబ్దపు ప్రజా స్వామ్య ప్రతిఘటనలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. క్యాంపస్‌ సరిహద్దులకు ఆవల ఉన్న ప్రశ్నలను చేపట్టిన సుదీర్ఘ చరిత్ర వామపక్ష విద్యార్థి సంఘాలకు కూడా ఉంది. అవి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం, మతతత్వాన్ని, కుల అణచివేతను వ్యతిరేకించటం, కార్మికు లకు, రైతులకు మద్దతు ఇవ్వడం, నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడం, ప్రజాస్వామ్య హక్కు లను డిమాండ్‌ చేయడం వంటివి. అందుకే ‘విద్యార్థులు రాజకీయాల్లో ఎందుకు పాల్గొంటున్నారు?’ అని పదేపదే వచ్చే ప్రశ్న అసలు విషయాన్ని విస్మరిస్తుంది. విద్యార్థులు సమాజా నికి వెలపలి వారు కాదు. దాని రాజకీ య, ఆర్థిక నిర్ణయాలకు అత్యంత ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే వారిలో వారు కూడా ఉన్నారు. విద్య వ్యాపారీ కరణ చెందినప్పుడు, విద్యార్థులు ప్రభావితమవుతారు. పరీక్షలు కలుషిత మైనప్పుడు, వారి భవిష్యత్తు ప్రభావిత మవుతుంది. నిరుద్యోగం పెరిగినప్పుడు, వారి ఆకాంక్షలు దెబ్బతింటాయి. మత విద్వేషం తరగతి గదుల్లోకి, క్యాంపస్‌లలోకి ప్రవేశించినప్పుడు, నేర్చుకునే, ఆలోచించే వారి స్వేచ్ఛ దెబ్బ తింటుంది. ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడినప్పుడు, వారి భవిష్యత్తు ప్రభావి తమవుతుంది.
నేడు భారతదేశం అనేక రంగాలలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ విద్యారంగం పెరుగుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకల ఆరోపణలు, ఉదంతాలతో పరీక్షా వ్యవస్థలు పదేపదే కుదిపివేయబడ్డాయి. యువత ఉపాధి, సురక్షితమైన జీవనోపాధి విషయం లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మతపరమైన విభజన గణతంత్ర రాజ్య సామాజిక నిర్మాణానికి ముప్పుగా పరిణమించింది. ప్రజాస్వామ్య అసమ్మతి సైతం గౌరవించాల్సిన రాజ్యాంగ హక్కుగా కాకుండా, తరచుగా అదుపు చేయాల్సిన సమస్యగా పరిగణిస్తున్నారు. అధికారంలో ఉన్నవారి నుండి జవాబుదారీతనాన్ని రాబట్టడం నానాటికీ క్లిష్టంగా మారుతోంది.
అయినప్పటికీ, ఆశను నిరాశవాదం సులభంగా కమ్మేసిన తరుణంలో విద్యార్థులు మరోసారి ముందుకు వచ్చారు.
పరీక్షా అవకతవకలు, నీట్‌ సంక్షోభంపై ఇటీవల జరిగిన విద్యార్థి ఉద్యమం సామూహిక కార్యాచరణ శక్తిని ప్రదర్శించింది. విద్యార్థులు ఎదు ర్కొంటున్న తక్షణ అన్యాయంపై ఆగ్రహంతో ప్రారంభమైన ఈ ఉద్యమం, జవాబుదారీతనం, పారదర్శకత, సంస్కరణల కోసం విస్తృతమైన డిమాండ్‌గా రూపుదిద్దుకుంది. నికరంగా సాగిన ఈ ఉద్యమం చివరకు జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దారితీసింది. ఢిల్లీ, ఇతర ప్రాంతాలలో వారాల తరబడి జరిగిన నిరసనల అనంతరం ఆయన రాజీనామా చేశారు. ఆయన వైదొలగడమే ఈ ఉద్యమంలో ప్రధాన డిమాండ్‌గా ఉంది.
ఆ సంఘటన ప్రాముఖ్యత కేవలం ఒక మంత్రి రాజీనామాకు మాత్రమే పరిమితం కాదు. ఏ తప్పూ జరగదనే ప్రతిష్టను తరచుగా ప్రదర్శిస్తూ, విమర్శ లను అసాధారణమైన ఆత్మవిశ్వాసంతో కొట్టిపారేసే ప్రభుత్వానికి, నిరంతర విద్యార్థి ఉద్యమం ఒత్తిడితో ఒక మంత్రి రాజకీయ బాధ్యతను స్వీకరించ వల సి రావడం అనేది జవాబుదారీతనం వహించిన ఒక అరుదైన సందర్భం. ప్రజలు సంఘటితమైనప్పుడు అధికారం అజేయం కాదని ఇది నిరూపిస్తుంది.
కానీ, రాజీనామా అనేది పోరాటానికి ముగింపు కాకూడదు. అది ఒక పెద్ద ప్రజాస్వామ్య సమీక్షకు నాంది పలకాలి.
విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. పరీక్షల సమగ్రతకు ఎవరు హామీ ఇస్తారు? ప్రశ్నాపత్రాల లీకులు, అవకతవకలు, ఏకపక్ష నిర్ణయాల నుంచి విద్యార్థులను ఎవరు కాపాడతారు? ప్రభుత్వ విద్య అందరికీ అందుబాటులో, ప్రజాస్వామ్యయుతంగా ఉండేలా ఎవరు నిర్ధారి స్తారు? శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్న లక్షలాది మందికి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను ఎవరు కల్పిస్తారు? విశ్వవిద్యాలయాలను భావజాల నియంత్రణ సాధనాలుగా కాకుండా, స్వేచ్ఛా ఆలోచనలకు వేదికలుగా ఎవరు కాపాడతారు? అన్నింటికన్నా ముఖ్యంగా, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం అనే రాజ్యాంగ వాగ్దానాన్ని ఎవరు పరిరక్షిస్తారు?

ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ప్రభుత్వాల నుండి మాత్రమే రాదు. అది సమాజం నుండి, సంఘటిత ప్రజల నుండి, కార్మికులు, రైతుల నుండి, మహిళలు మరియు అణగారిన వర్గాల నుండి, మరియు ముఖ్యంగా, భారతదేశ విద్యార్థులు మరియు యువత నుండి రావాలి. అది ప్రస్తుత తరం విద్యార్థుల చారిత్రక బాధ్యత. నేడు సవాలు భిన్నంగా ఉంది. కానీ అంతర్లీన సూత్రం మాత్రం అదే. ఈ పోరాటం విదేశీ వలస శక్తికి వ్యతిరేకంగా ఇంకెంతమాత్రం కాదు. రిపబ్లిక్‌ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పునాదులను నిర్వీర్యం చేయాలని చూసే శక్తులకు, మత విభజన, నిరంకుశత్వం, అసమానత, నిరుద్యోగం, ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ, సంస్థాగత జవాబు దారీతనం క్షీణించటానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది.
కాబట్టి, విద్యార్థుల ముందున్న కర్తవ్యం కేవలం మెరుగైన పరీక్షలను డిమాండ్‌ చేయడం మాత్రమే కాదు. వారి పూర్వీకులు దేన్ని సృష్టించడానికి పోరాడినారో ఆ భారతదేశ భావనను పరిరక్షించడం వారి కర్తవ్యం.
ప్రస్తుత విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసి, విస్తృతం చేసి, ముందుకు తీసుకువెళ్లాలి. దాని తక్షణ డిమాండ్‌లను నెరవేర్చడంతో పాటు, దాని రాజకీయ చైతన్యం లోతు మరింత పెరగాలి. విద్యార్థులు తమ క్యాంపస్‌లను దాటి కార్మికులు, రైతులతో సంఘీభావం పెంచుకోవాలి, దళితులు, గిరిజనులు, వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలబడాలి. ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి. రాజ్యాంగ ప్రజాస్వామ్యం కోసం ఒక క్రియాశీల శక్తిగా మారాలి. ఇక్కడే భగత్‌ సింగ్‌ వారసత్వం ప్రత్యేకించి ప్రాసంగికత కలిగి ఉంది. ఆయన సందేశం కేవలం ఆగ్రహించటం కాదు. దానిని చదవటం, అర్థం చేసుకోవటం, సంఘటితం కావడం, కార్యాచరణ చేపట్టటం. ధైర్యాన్ని రాజకీయ స్పష్టతతో కలిపినప్పుడు యువత దేశానికి అంతరాత్మగా మారగ లదని ఆయన తరం భారతదేశానికి నేర్పింది.
తమలో ఆ ధైర్యం ఉందని నేటి విద్యార్థులు ఇప్పటికే నిరూపించారు. బెదిరింపులు ఎదురైనా వారు ఐక్యంగా నిలబడ్డారు. వారు అన్యాయాన్ని సాధారణమైనదిగా అంగీకరించడానికి నిరాకరించారు. శక్తిమంతులను జవాబుదారీగా చేయవచ్చని వారు నిరూపించారు. ఇప్పుడు వారి పోరాటం ఒక పరీక్షకు, ఒక మంత్రిత్వ శాఖకు లేదా ఒక ప్రభుత్వ నిర్ణయానికి మించి విస్తరించాలి. భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో, స్వాతంత్య్రం అనే అసంపూర్ణ కార్యం ఒక కొత్త రూపంలో మన ముందు కొస్తోంది. స్వాతంత్య్ర పోరాటం భారతదేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేసింది. మన తరం ప్రజాస్వామ్య పోరాటం భారతదేశాన్ని భయం, ద్వేషం, అసమానత, నిరంకుశత్వం నుండి విముక్తి చేయాలి.
ఒకప్పుడు బ్రిటిష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా కవాతు చేసిన విద్యార్థులు రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించడంలో సహాయపడ్డారు. నేటి విద్యార్థులు గణతంత్రాన్ని తిరిగి పొందేందుకు, ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపిరాజ్‌ను ఓడిం చేందుకు జరిగే పోరాటానికి నేతృత్వం వహించడంలో సహాయపడ గలరు.
భవిష్యత్తు ముందస్తుగా నిర్ణయించబడదు. ప్రజలు సంఘటితమైనప్పుడు, యువత ఆశను వదులుకోవడానికి నిరాకరించినప్పుడు,ఒక తరం తాము వారసత్వంగా పొందే దేశం, తమను వెనక్కుపెట్టే దేశం కాకూడదని నిర్ణయించుకున్నప్పుడు చరిత్ర సృష్టించబడుతుంది. భారతదేశానికి ఇప్పుడు ఆ తరం అవసరం. మరోసారి, విద్యార్థులే ముందు వరుసలో ఉన్నారు.