Skip to content
జాతీయం › వార్తలు

ఆర్ఎస్ఎస్‌తో విద్యా సంస్థల విధ్వంసం…

Krishna Rao 11 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఆర్ఎస్ఎస్‌తో విద్యా సంస్థల విధ్వంసం…

CPI Raja

విశ్వవిద్యాలయాలతో పాటు అన్ని సంస్థల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబాటు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్ర విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సల్స్) వ్యాఖ్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రధాని సిగ్గుపడాలని విమర్శించారు. అదే సమయంలో విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల్లోకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చొరబడుతోందని ఆరోపించారు.

బస్తర్‌లో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై డి.రాజా సోమవారం స్పందించారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నుంచి ‘నక్సల్ ముక్త్ భారత్’ వరకు ప్రభుత్వ నినాదాలు మారాయని, ఇప్పుడు కొత్తగా ‘దిమాగీ నక్సల్స్’ అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ దేశ అత్యున్నత పదవిలో ఉన్నారని, అలాంటి వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ‘నక్సల్ ముక్త్ భారత్’ గురించి మాట్లాడారని, అంతకుముందు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం వినిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో ప్రతిచోటా ‘దిమాగీ నక్సల్స్’ ఉన్నారంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్ చొరబాటు

దేశంలోని అన్ని సంస్థలను అధికార పార్టీ స్వాధీనం చేసుకుంటోందని డి.రాజా ఆరోపించారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరుగుతోందని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాలతో పాటు వివిధ సంస్థల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబడుతోందని, నియామకాలు జరుగుతున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. దేశంలోని సంస్థల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ‘దిమాగీ నక్సల్స్’ అనే ముద్ర వేయడాన్ని రాజా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని ఇలాంటి అసంబద్ధమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ పరిణామాలపై మోదీ దృష్టి సారించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలను కించపరచడం ప్రధాని హోదాకే అవమానం: కె.రామకృష్ణ

నక్సలిజాన్ని అంతం చేశామని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ‘దిమాగీ నక్సల్స్’ పేరుతో ప్రతిపక్షాలపై బురదజల్లడం ప్రధాని మోదీ రాజకీయ ద్వంద్వ వైఖరికి పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

దేశ ప్రజలు దీపావళి సంబరాల్లో మునిగితేలుతున్న సమయంలో సైనికుల సమక్షంలో ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడటం ప్రధాని హోదాకు తగదన్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన పదవి గౌరవాన్ని మరిచి ప్రతిపక్షాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు.

‘దిమాగీ నక్సల్స్’ పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరిపై నిర్బంధ చర్యలు ప్రయోగించేందుకు సిద్ధపడటం దుర్మార్గమని రామకృష్ణ విమర్శించారు.

లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించాలి

లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు ప్రభుత్వం ప్రకటించిన సరెండర్, పునరావాస ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కె.రామకృష్ణ కోరారు. లొంగిపోయిన నక్సలైట్లపై నిరంతరం పోలీసుల నిఘా కొనసాగించడం, వారిని ప్రజల్లో స్వేచ్ఛగా తిరగనీయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల కారణంగా కొందరు తిరిగి అడవుల బాట పట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంతోపాటు సాధారణ జీవితం గడిపే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు: rss