Ram Mandir Donation Case: రామ మందిర విరాళాల కేసు.. SIT స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Ram Mandir Donation Case: రామ మందిర విరాళాల కేసు.. SIT స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Ram Mandir Donation Case: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన విరాళాల చోరీ ఆరోపణల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఆరోపణలపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలోని దర్యాప్తు లేదా సీబీఐ విచారణ జరపాలని.. అలాగే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయమై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) తమ దర్యాప్తు పురోగతికి సంబంధించిన సమగ్ర ‘స్టేటస్ రిపోర్ట్’ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సిట్ ఏర్పాటు, దాని నిర్మాణానికి సంబంధించిన వివరాలను కూడా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ఈ నివేదికను సీల్డ్ కవర్ ద్వారా కోర్టుకు సమర్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ నివేదిక వివరాలను ఇప్పుడే వారితో పంచుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఈ విరాళాల దుర్వినియోగ వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే.. ఆలయ పరిపాలన, దైనందిన ఆర్థిక కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా అత్యున్నత పరిపాలనా అధికారి అయిన ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ (CEO) పదవి భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రస్ట్‌లో భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టడమే ఈ సీఈవో ప్రాథమిక బాధ్యత కానుంది. ఈ నియామక ప్రక్రియను పర్యవేక్షించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక ఎంపిక కమిటీని కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 18వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఈ అత్యున్నత పదవికి నిర్దేశించిన అర్హతలు అత్యంత కఠినంగా ఉన్నాయి. అభ్యర్థి వయస్సు 50 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పెద్ద ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు లేదా విభాగాలలో అడ్మినిస్ట్రేషన్ (పరిపాలన) లేదా ఫైనాన్స్ (ఆర్థిక) రంగాలలో కనీసం 20 ఏళ్ల నిర్వాహక అనుభవం కలిగి ఉండాలి.
గతంలో పెద్ద హిందూ మతపరమైన క్షేత్రాలు లేదా ప్రముఖ ఆలయాల నిర్వహణ చూసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా హిందూ మతాచారాలను పాటించేవారై ఉండాలి. వైష్ణవ సంప్రదాయానికి చెందిన రామభక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమికంగా మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన జరిగే ఈ నియామకానికి ఎంపికైన వారు తప్పనిసరిగా అయోధ్యలోనే నివసించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం నెల రోజుల్లోగా ఈ ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.