Skip to content
జాతీయం › వార్తలు

మోదీ అభివృద్ధి : ప్రచారం, వాస్తవాలు

Prajapaksham 07 Oct 2026 0 నిమిషాల పఠనం జాతీయం
మోదీ అభివృద్ధి : ప్రచారం, వాస్తవాలు

Modi's Development: Publicity and Reality

ఎం కోటేశ్వరరావు

పన్నెండేళ్ల నరేంద్రమోదీ ఏలుబడి తీరు: ‘మంచి నీళ్ల సీసాలు, ఐస్‌ క్రీమ్‌ తయారీలో భారత్‌, భవిష్యత్‌ పరిశ్రమల నిర్మాణంలో చైనా!’
ఈ మాటలు నావి కాదు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ఆర్‌పిజి గ్రూప్‌ అధ్యక్షుడు హర్ష గోయంకా సెప్టెంబరు 22న ఎక్స్‌లో చేసిన వ్యాఖ్య అంశాలు. రానున్న ఇరవై సంవత్సరాల పరిణామాలను నిర్దేశించే భవిష్యత్‌ పరిశ్రమలను చైనా ఏర్పాటు చేస్తుండగా భారత్‌ సీసాల్లో మంచినీళ్లు, ఐస్‌క్రీమ్‌లు, తినుబండారాల తయారీ, వాటిని వెంటనే అందచేసే ప్రక్రియలో ఉన్నదని అన్నారు. ఎక్స్‌లో ఏముందంటే “పరిశ్రమల్లో ఆధిపత్యాన్ని చైనా నిర్మిస్తోంది. అది రానున్న ఇరవై సంవత్సరాలను నిర్దేశిస్తుంది. విలువైన ఖనిజాలు, అయస్కాంతాలు, బ్యాటరీలు, విద్యుత్‌ వాహనాలు, రోబోటిక్స్‌, సెమికండక్టర్లు, ఆధునిక ఉత్పాదకతలు ఉన్నాయి. జెఎల్‌ మాగ్‌ ఒక చక్కటి ఉదాహరణ. అది ఇప్పటికే అధిక సామర్ధ్యంతో పనిచేసే విలువైన ఖనిజాలతో అయస్కాంతాల తయారీలో ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు మానవ రూపంలో ఉండే రోబోల తయారీకి అవసరమైన విడి భాగాలను తయారు చేసేందుకు ముందుకు పోతున్నది. వ్యూహరచన సాధారణమే స్వంతంగా ముడిసరకులు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి మరియు మొత్తంగా అవసరమైన పని పరిస్థితి ని కల్పించటం. ఇదిలా ఉండగా ఎక్కువ మంది భారతీయ వాణిజ్యవేత్తలు సుకుమారమైన అవకాశాల కోసం ఇప్పటికీ చూస్తున్నారు. సీసాల్లో మంచినీరు, ఐస్‌క్రీమ్‌లు, తినుబండారాలు, పాకేజ్‌డ్‌ ఫుడ్‌ మరియు వాటిని వెంటనే అందచేయటం. చివరికి మన గొప్ప సాఫ్ట్‌వేర్‌ విజయం కూడా ఎక్కువగా శ్రమశక్తిని ఖర్చు తగ్గించే బేరం చేసేదిగా ఉంది. చైనా రేపటి మౌలికసదుపాయాలను నిర్మిస్తోంది. రేపు ప్రపంచాని కి అవసరమైన వాటిని మనం నిర్మిస్తున్నామా అని భారత్‌లో ఉన్న మనం మనల్ని ప్రశ్నించుకోవాలి”. గత ఏడాది 2025 ఏప్రిల్‌ మొదటి వారంలో స్టార్టప్‌ మహాకుంభ జరిగింది. ఆ సమావేశంలో సందేశమిచ్చిన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన అంశం. చైనా సెమీ కండక్టర్లు, రోబోలు, విద్యుత్‌ వాహనాల తయారీలో ముందుకు పోతుంటే మన దేశంలో స్టార్టప్స్‌
(అంకుర కంపెనీలు) ఐస్‌క్రీమ్‌లు, ఆహార సరఫరా, వేగవంతమైన వాణిజ్య కార్యకలాపాలపై కేంద్రీకరించాయన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహనదాస్‌ పాయి మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ మనదేశంలో కూడా ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన సంస్థలున్నాయని, అయితే అంకుర సంస్థలకు పెట్టుబడులు ఎక్కడ అని ప్రశ్నించారు. మన దేశంలో 2014 మధ్య ఈ సంస్థలు కేవలం 160 బిలియన్‌ డాలర్లు మాత్రమే పొందితే చైనాలో 845 బిలియన్‌ డాలర్లు వచ్చాయన్నారు. నియంత్రణ ఆటంకాలు ఉన్నాయన్నారు.
అంటే అన్నారని బిజెపి పెద్దలు రుసరుసలాడుతారు.కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేశానని 2019 ఎన్నికల్లో కోతలు కోశారు. పన్నెండేండ్ల ఏలుబడి తరువాత హర్ష గోయంకా ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు బిజెపి నేతలు సిగ్గుతో తలదించుకోవాలి కదా! తన మాటలు విధాన నిర్ణేతలకు సూటిగా తగులుతాయని తెలిసి కూడా ఇప్పుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా మాట్లాడటానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నరేంద్రమోదీ ఏలుబడి బలహీనతలు దీనికి దోహదం చేస్తున్నాయని వేరే చెప్పాలా? ఇది ఆరంభం మాత్రమే. హర్ష గోయంకా చెప్పిన మాటలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1990 దశకం నుంచి ప్రభుత్వ రంగం పెట్టుబడులను నిలిపివేసింది. ఆ సంస్కరణల ను మరింత ముందుకు తీసుకుపోతానని 2014 ఎన్నికల్లో మోదీ ప్రచారం చేయలేదా? ఫలితం, పర్యవసానాలు ఇవే కదా! దేశ భవిష్యత్‌ మొత్తాన్ని ప్రైవేటు రంగానికి వదలిపెడితే పెద్దగా కష్టపడకుండా లాభం ఇచ్చే వాటి మీదే కేంద్రీకరిస్తుంది.
మనదేశంతో ఉన్న అవసరాల రీత్యా కొన్ని సంస్థ లు, వ్యక్తులు మనల్ని ఆకాశానికి ఎత్తి నేతల్ని మునగచెట్టు ఎక్కించవచ్చు. కానీ వాస్తవాలను మూసిపెట్టలేరు. దిగుమతి చేసుకొనే వస్తువుల వినియోగం పెరిగిందంటే దాని అర్ధం మోదీ ఏలుబడిలో కొనుగోలు శక్తి పెరిగినట్లే కదా అని బిజెపి పెద్దలు అంటారు. వారి భుజాలను వారే చరుచుకుంటారు. నిజానికి మనదేశంలో 145 కోట్ల మంది వినియోగదారులున్నారని చెప్పటం పెద్ద వక్రీకరణ. వారంతా వస్తు వినియో గం చేస్తే పన్నెండేండ్లలో పారిశ్రామిక ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడి కావాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి ఎందుకు ఉంది? పదేండ్ల యుపియే పాలనా కాలంలో జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 15.3 నుంచి 17.3శాతం మధ్య ఉంది. మోదీ అధికారానికి వచ్చిన తరువాత మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులతో 25శాతానికి పెంచుతామని చెప్పినప్పటికీ గత పన్నెండు సంవత్సరాల్లో 15.6శాతానికి తగ్గింది తప్ప పెరగలేదు. ఏటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
(ఎఫ్‌డిఐ) బిలియన్‌ డాలర్లలో ఎలా వచ్చాయో చూడవచ్చు. ఈ వివరాలు(పట్టికలో) మన రిజర్వుబ్యాంక్‌, ప్రపంచ బ్యాంకు వెల్లడించినవే.
పన్నెండు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 470.45 బిలియన్‌ డాలర్లంటే సగటున ఏటా 39.20 బిలియన్‌ డాలర్లు మాత్రమే. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, పిఎల్‌ఐ స్కీములను ఎన్ని ప్రవేశపెట్టినప్పటికీ పరిస్థితి ఇది. ఇదే కాలంలో మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడి మొత్తం 250 బిలియన్‌ డాలర్లన్నది పెద్దగా ప్రచారంలో లేని అంశం. చైనాకు వచ్చిన పెట్టుబడి 2,195.17 బిలియ న్‌ డాలర్లు. అయితే 2014లో 268 బిలియన్‌ డాలర్లు కాగా, 2025లో 79.98 బిలియన్‌ డాలర్లకు తగ్గినప్పటికీ ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. చైనా నుంచి కూడా పెట్టుబడులు గత పన్నెండు సంవత్సరాల్లో సగటున ఏటా వంద బిలియన్‌ డాలర్ల వంతున బయటకు వెళుతున్నాయి. ఇక మన దేశభక్తులైన కార్పొరేట్ల సంగతి చూద్దాం. వారికి ఇస్తున్న రాయితీలు తప్ప వారి పెట్టుబడులు పెరగటం లేదు. ఈ పన్నెండు సంవత్సరాలలో ప్రైవేటు పెట్టుబడి జిడిపిలో 11 మధ్య నిలకడగా ఉంది. ఇటీవలి కాలంలో వస్తున్న పెట్టుబడుల లో అధికభాగం ఉపాధి రహిత వృద్ధి, కార్పొరేట్లకు లబ్దిచేకూర్చేవే కావటం విశేషం. అందుకే అసలు ఉపాధి దొరకని వారితో పాటు అరకొరవేతనాలతో పనిచేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నది. యుపిఏ పాలనా కాలంలో పదేండ్ల జిడిపి వృద్ధి రేటు 7.5 నుంచి 7.8శాతం, మోదీ ఏలుబడిలో 6 శాతం మధ్య ఉన్నది. మరోవైపున 2017 మధ్య ఏటా గ్రామీణ వ్యవసాయేతర కార్మికుల వేతనాలు ఇదే కాలంలో పెరిగింది 5.4, రోజువారీ కూలీలకు 5.69, వేతన జీవులకు 3.54. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెరిగింది అత్యధికులకు సున్నా లేదా అతి తక్కువగా ఉంది. వ్యవసాయ కార్మికులదీ ఇదే పరిస్థితి. దీని అర్ధం ఏమిటీ? జిడిపి పెరిగినంత మాత్రాన కష్టజీవులకు దక్కుతున్నదేమీ లేదు. అవసరాలకు అనుగుణంగా రాబడి పెరగని కారణంగా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మోదీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో రుణ భారం 26 శాతం ఉండగా 2026లో 45.5శాతానికి పెరిగింది. సగటున 2025లో రు.4.8లక్షల కోట్లు ఉంది. వేతనాలు, ఉపాధి పెరగనపుడు జిడిపిలో ఎంత వృద్ధి రేటు ఉంటే ఉపయోగం ఏమిటి?
రైల్వేల్లో 8,868 ఉద్యోగాలకు 2025 నవంబరు లో నోటిఫికేషన్‌ ఇవ్వగా కోటీ ఇరవైలక్షలకు పైగా దరఖాస్తు చేశారు, ఒక్కో ఉద్యోగానికి సగటున 1,370 మంది పోటీ పడ్డారు. కొన్నింటికి రెండువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయట. అదే ఏడాది అంతకు ముందు జైపూర్‌లో ఒక్కో ఫ్యూన్‌ ఉద్యోగానికి పిహెచ్‌డిలతో సహా విద్యావంతులు 47 మంది పోటీపడ్డారు. సంబల్‌పూర్‌లో 187 హోం గార్డు పోస్టులకు ఎనిమిదివేల మంది దరఖాస్తు చేశారు. తాజా కార్మికశక్తి సర్వే ప్రకారం 60కోట్ల మంది పనిచేసే వయస్సు ఉన్నవారి లో నిరుద్యోగులు 56శాతం ఉన్నారు, అంటే మూడు నుంచి మూడున్నర కోట్ల మంది నిరుద్యోగులున్నారు. నామమాత్రపు పని దొరుకుతున్నవారిని కూడా నిరుద్యోగులుగా పరిగణిస్తే అలాంటి వారు ఇరవై కోట్లని అంచనా. పన్నెండు కోట్ల మంది కాజువల్‌ లేబర్‌ ఉన్నట్లు అంచనా, వీరికి రోజూ పని దొరుకుతుందనే హామీ లేదు.
మన ప్రభుత్వం సేకరిస్తున్న గణాంకాల ను చూస్తే 60శాతం మంది స్వయం ఉపాధి, నెలవారీ లేదా రోజూ వేతనం పొందేవారు 20, క్యాజువల్‌ లేబర్‌ 20శాతం ఉన్నారని తేలుతున్నది తప్ప, రోజుకు నాలుగైదు గంటలు పనిచేసే పాక్షిక ఉపాధి పొందుతున్నవారెంత మంది అన్నది సేకరించటం లేదు. పకోడీల బండి పెట్టుకున్నప్పటికీ ఉపాధి కల్పించినట్లే కదా అని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాన స్రవంతి మీడియా ఎన్నడైనా ఈ సమస్య గురించి చర్చించిందా! అమెరికా, ఐరోపా దేశాల్లో ఉపాధి గురించి కచ్చితమైన లెక్కలు తీస్తున్నారు, ఎందుకంటే అక్కడ నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇటలీలో 2024 వివరాల ప్రకారం నిరుద్యోగులు ఏడు శాతం, పాక్షికంగా పని చేసేవారు 20 శాతం ఉన్నట్లు తేలింది. అదే టర్కీలో 25శాతం, మనదేశం లో పూర్తిగా పనిలేని వారు 90శాతం ఉన్నట్లు అంచనా.
ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌, అతని సహచరులు మన గ్రామీణ నిజవేతనాల పెరుగుదల 2015 నుంచి 0.1, పట్టణాల్లో 0.8 అని చెప్పారు. నెలవారీ వేతన కార్మికుల నిజవేతనాలు 2017 నుంచి గణనీయంగా పడిపోయినట్లు, కాజువల్‌ కార్మికుల వేతనా లు కాస్త పెరిగినప్పటికీ 2021 తరువాత గిడసబారినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరాలన్నీ జిడిపి వృద్ది రేటు ఎక్కువగా ఉన్నవే అయినప్పటికీ నిజవేతనాలు దానికి అనుగుణంగా పెరగలేదు. పన్నుల అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఎగుమతులు పెరిగాయి చూడండి అని మొత్తాల అంకెలను చూపుతారు. జిడిపిలో ఎగుమతులదిగుమతుల శాతాలు ఎలా ఉన్నా యో చెబితే అసలు రంగు బయటపడుతుంది. మోదీ అధికారానికి వచ్చినపుడు డాలరుకు రూపాయి విలువ 60కంటే తక్కువ, ఇప్పుడు 95 దాటింది. పది వస్తు, సేవల ఎగుమతుల ద్వారా 2014లో వంద డాలర్ల ఆదాయం వచ్చిందంటే ఆరువేలు, అదే పదింటికి 2026లో అంతే మొత్తం ఎగుమతి చేస్తే 9,500 వస్తాయి. చూశారా మేము ఎలా పెంచామో అంటారు. అనేక మంది మోదీ దేశాన్ని రక్షించాడని బిజెపి ఐటి సెల్‌, దాన్ని అనుసరించేవారు భజన చేస్తారు, అదే నిజమైతే యుపిఏ కంటే వృద్ధి రేటు ఎందుకు తగ్గినట్లు?