Skip to content
జాతీయం వార్తలు

రైళ్లలో భిక్షాటన చేస్తే రూ.2 వేలు జరిమానా.. 1989 రైల్వే చట్టంలో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఏంటంటే..

Prajapaksham 22 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
రైళ్లలో భిక్షాటన చేస్తే రూ.2 వేలు జరిమానా.. 1989 రైల్వే చట్టంలో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఏంటంటే..

Indian Railways Introduces New Penalty Rules 2026; ₹2,000 Fine for Smoking, Hawking and Begging

రైళ్లు ,రైల్వేస్టేషన్ల పరిధిలో నిబంధనలను ఉల్లంఘించే వారికి, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారికి రైల్వే రక్షక దళం (RPF) ఇకపై భారీ జరిమానాలు విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించింది. దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల భద్రతను, క్రమశిక్షణను మరింత మెరుగుపరచడం ,అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జన విశ్వాస్‌’ పేరిట పాత 1989 రైల్వే చట్టంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఈ నూతన నిబంధనలకు సంబంధించిన రైల్వే ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను ఆదివారం కాజీపేట ఆర్పీఎఫ్‌ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ (CI) ఛటర్జీ, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) వెంకట్‌రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ప్రయాణికులు తెలుసుకోవాల్సిన పలు కీలక విషయాలను, సవరించిన జరిమానాల వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఈ కొత్త చట్టం ప్రకారం, రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణించినా, తాము తీసుకున్న టికెట్ అనుమతించిన దూరానికి మించి ప్రయాణాన్ని కొనసాగించినా, లేదా ఇతరుల పేరు మీద ఉన్న రిజర్వేషన్ టికెట్‌పై ప్రయాణించడానికి ప్రయత్నించినా అటువంటి వారికి ప్రయాణ ఛార్జీలతో పాటు అదనంగా రూ. 500 చొప్పున పెనాల్టీ విధిస్తారు. అలాగే రైల్వే ప్రాంగణంలో లేదా రైళ్లలో అనధికారికంగా తినుబండారాలు అమ్మే హాకర్లకు, భిక్షాటన చేసే వారికి రూ. 2,000 వరకు జరిమానా ఉంటుంది. విధుల్లో ఉన్న రైల్వే ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగిస్తే రూ. 1,000 నుండి రూ. 2,000 వరకు, అలాగే రైల్వే నిషిద్ధ ప్రాంగణంలోకి అనధికారికంగా ప్రవేశిస్తే రూ. 500 జరిమానాగా నిర్ణయించారు.

మరికొన్ని కఠినమైన నిబంధనలను పరిశీలిస్తే, సాధారణ టికెట్లతో రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో అనధికారికంగా ప్రయాణిస్తే రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఇతరుల రిజర్వ్‌డ్‌ సీటు లేదా బెర్తును ఆక్రమించుకుని, దానిని ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ. 1,000 పెనాల్టీ పడుతుంది. రైల్వే ట్రాఫిక్‌ సంకేతాలను ఉల్లంఘించిన వారికి రూ. 500, మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వ్‌డ్‌ కోచ్‌లలోకి పురుషులు ప్రవేశిస్తే అత్యంత కఠినంగా రూ. 2,500 జరిమానా విధిస్తారు. వీటితో పాటు రైళ్లలోకి బాణసంచా, గ్యాస్ సిలిండర్లు వంటి ప్రమాదకర వస్తువులను తెస్తే రూ. 10,000 వరకు భారీ జరిమానా ఉంటుంది. రైల్వే ప్రాంగణంలో లేదా నడుస్తున్న రైళ్లలో ధూమపానం (Smoking) చేస్తూ దొరికిపోతే రూ. 2,000 చొప్పున జరిమానా వేస్తారు.

ఈ చట్ట సవరణలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఈ పెనాల్టీ రుసుములన్నింటినీ ఆర్పీఎఫ్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అక్కడికక్కడే (On the spot) వసూలుచేసి, దానికి సంబంధించిన అధికారిక రశీదును ప్రయాణికుడికి అందజేస్తారు. ఒకవేళ ఏ ప్రయాణికుడైనా నిర్దేశిత జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, వారిని వెంటనే స్థానిక రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించి, చట్టప్రకారం కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరుస్తారు. గతంలో ఆర్పీఎఫ్‌ దళాలకు నేరుగా ఇలాంటి జరిమానాలు వసూలుచేసే చట్టపరమైన అధికారం ఉండేది కాదని, కానీ ప్రయాణికుల రక్షణ దృష్ట్యా మారిన నూతన చట్టాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచే ఆర్పీఎఫ్ అధికారులకు ఈ ప్రత్యేక వసూలు అధికారాన్ని కల్పించినట్లు కాజీపేట రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *