Skip to content
జాతీయం వార్తలు

ఫ్యాషన్‌ టెక్నాలజీతో సాంస్కృతిక సమైక్యత

Prajapaksham 09 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఫ్యాషన్‌ టెక్నాలజీతో సాంస్కృతిక సమైక్యత

ఫ్యాషన్‌ టెక్నాలజీతో సాంస్కృతిక సమైక్యత

ప్రతి ఒక్కరు తమ ఫ్యాషన్‌ భావాలను వ్యక్తీకరించడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటారు. ఒక్కొక్కరి వస్త్రధారణ ఒక్కో విధంగా ఉంటుంది. కులాలు, మతాలు, జాతులు, దేశాలు, ప్రాంతాలను బట్టి ఫ్యాషన్లు మారుతుంటాయి. ఒక్కో జాతికి ఒక రకమైన విలక్షణ వస్త్రధారణ పద్ధతులు ఉంటాయి. ఫ్యాషన్‌ ప్రపంచం, పరిశ్రమ చాలా పెద్దది. ఫ్యాషన్‌ టెక్నాలజీ క్షణక్షణం మారుతోంది. తరాలు మారిన కొద్దీ ఫ్యాషన్లు కూడా మారుతున్నాయి, కొన్ని సందర్భాల్లో వెర్రి పోకడలు కూడా సంతరించుకుంటున్నాయి. ప్రపంచ మానవాళి దృష్టిని తమ ఫ్యాషన్ల వైపుకు మరల్చడానికి, ప్రత్యేక సౌందర్య భావాలను వ్యక్తం చేయడానికి, వారి వారి విభిన్న దుస్తులు లేదా ఉపకరణాలను ప్రదర్శించడానికి ఒక వేదికగా ప్రతి ఏటా 09 జూలై రోజున అంతర్జాతీయ ఫ్యాషన్‌ దినోత్సవం (ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ డే) పాటించడం 2016 నుంచి ఆనవాయితీగా మారింది.

ఫ్యాషన్‌ టెక్నాలజీ – ఫ్యాషన్‌ డిజైనర్స్‌:

ఫ్యాషన్‌ డిజైన్‌ అంటే దుస్తులు, కొన్ని వస్తువులను అందంగా, వినూత్నంగా తీర్చిదిద్దే కళ అని తెలుసుకోవాలి. దీనిలో అవలంబించే పద్ధతుల సమాహారాన్ని ఫ్యాషన్‌ టెక్నాలజీ అని పిలుస్తాం. మానవ అభిరుచులను బట్టి దుస్తులు, అలంకార వస్తువులను తయారు చేసే నిపుణులను ఫ్యాషన్‌ డిజైనర్స్‌ అంటాం. నేటి డిజిటల్‌ యుగంలో కంప్యూటర్‌-సహాయ ఉత్పత్తి/డిజైన్స్, 3డి ప్రింటింగ్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి పరిజ్ఞానాలు వాడబడుతున్నాయి. ఇవి ఫ్యాషన్‌ ప్రపంచ పరిశ్రమను మరింత సమర్థవంతంగా, సుస్థిరంగా, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, ఆకర్షణీయంగా మార్చడంలో సహాయపడుతున్నది.

ఆధునిక పౌర సమాజ అభిరుచులకు అద్దం పడుతున్నది నేటి ఫ్యాషన్‌ పరిశ్రమ. మారుతున్న కాలంతో పాటు ఫ్యాషన్లు కూడా అత్యంత వేగంగా మారుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్‌ దినోత్సవం ఇతివృత్తంగా ఫ్యాషన్‌ ద్వారా ఐక్యత (యూనిటీ త్రూ ఫ్యాషన్‌) అనే అంశాన్ని తీసుకొని, ఈ వేదికగా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహిస్తూ మన దేశ ఐక్యత సాధనకు కృషి జరుగుతోంది.

ఫ్యాషన్‌ టెక్నాలజీ పెరగడం శుభసూచకమే అయినప్పటికీ ఫ్యాషన్లు వెర్రితలలు వేయకూడదు, మన సాంస్కృతిక మూలాలను మరిచిపోకూడదు. మన ప్రాంత వాతావరణాన్ని, అవసరాలను, సందర్భాలను బట్టి మన వేషధారణ ఉండాలి. ఫ్యాషన్‌ పేరుతో అసహ్యకర రూపును పొందరాదని గమనించాలి.

(09 జూలై అంతర్జాతీయ ఫ్యాషన్‌ దినోత్సవం సందర్భంగా)