Skip to content
జాతీయం › వార్తలు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మినహాయింపు అంటే.. జవాబుదారీతనం లేకపోవడం కాదు

Prajapaksham 29 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మినహాయింపు అంటే.. జవాబుదారీతనం లేకపోవడం కాదు

EC

కపిల్ సిబల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు

భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు వంటి ఉన్నత రాజ్యాంగ పదవులలో ఉండే వారికి, వారి పదవీకాలంలో క్రిమినల్‌ విచారణల నుంచి రక్షణ లభిస్తుంది(ఆర్టికల్‌ 361). భారత ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులపై ఎలాంటి క్రిమినల్‌ విచారణలు ప్రారంభించబడవు. అయితే, రాజ్యాంగంలోని 61, 124(4), 218 అధికరణలో పేర్కొన విధానంలో ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల న్యాయమూర్తులను పదవి నుండి తొలగించవచ్చు. భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) విషయానికి వస్తే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి)ని తొలగించే విధానం ఉన్నత న్యాయవ్యవస్థ న్యాయమూర్తులకు వర్తించే విధానాన్ని పోలి ఉన్నప్పటికీ, ఇసిఐ సభ్యులకు క్రిమినల్‌ విచారణల నుండి రాజ్యాంగం ఎటువంటి రక్షణను కల్పించలేదు. అయితే, 1991 నాటి పాత చట్టం స్థానంలో తీసుకువచ్చిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) చట్టం 2023’ ద్వారా సిఇసి, ఎన్నికల కమిషనర్లకు వారి పదవీకాలానికే పరిమితం కాకుండా, క్రిమినల్‌ విచారణలు ప్రారంభించకుండా భారత ప్రభుత్వం మినహాయింపును కల్పించింది.
అలాంటి మినహాయింపుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వహించాలనే తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించే సమయంలో వారు అన్ని బాహ్య ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందాలి. ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్న రెండవ కారణం ఏమిటంటే, ఈ అధికార పార్టీ తమ పక్షపాత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పదవిని ఉపయోగించుకోవాలంటే అలాంటి మినహాయింపు అవసరమని గ్రహించింది. తద్వారా ఆ పదవిలో ఉన్నవారి చర్యలపై ఎలాంటి క్రిమినల్‌ విచారణ జరపబడదని వారికి హామీ ఇచ్చింది.
బహుశా ఇదే, ఇప్పుడు ప్రజాగ్రహానికి దారితీసే రీతిలో వ్యవహరించేలా సిఇసికి మరింత ధైర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు.
భారతదేశంలోని మరే ఇతర రాజ్యాంగ అధికార సంస్థకు ఇలాంటి అపరిమితమైన రక్షణ అందుబాటులో లేనప్పుడు సిఇసి, ఇసిలకు సంపూర్ణ, జీవితకాల రక్షణ కల్పించడం రాజ్యాంగ ఉద్దేశ్యానికి అతీతమైనది. వాస్తవానికి, ఇది సుప్రీంకోర్టులో సవాలు చేయబడిన ఒక అంశం. 2023 చట్టం ప్రకారం, ఎన్నికల సంఘాలు ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఏకగ్రీవమయ్యేందుకు కుదరని పక్షంలో, మెజారిటీ నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయి. ఇటీవల ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్‌ కథనం ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని ఫలితంగా లక్షలాది మంది ఓటర్లను అనధికారికంగా తొలగించడం, చేర్చడం జరుగుతోందని వెల్లడైంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్‌(ఇసి)లు వ్యతిరేకించిన ఒక ప్రక్రియ ద్వారా ఇది జరిగిందని సమాచారం.
ఇద్దరు ఇసిలు లేవనెత్తిన అత్యంత తీవ్రమైన అభ్యంతరం ఏమిటంటే, ఎన్నికల సంఘం ఏకీకృత పోర్టల్‌ అయిన ECINET నియంత్రణను కేంద్రీకృతం చేయడం, ఓటర్ల తొలగింపును ERONET ద్వారా ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఇఆర్‌ఒ), డిప్యూటీ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు (డిఇఆర్‌ఒలు), అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్ల (ఎఇఆర్‌ఒలు) స్థాయిలో కాకుండా, స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే చేయడం. ECINETను కేంద్రీకృతం చేయడం క్షేత్రస్థాయిలో అందుబాటును పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. గోవాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఎఇఆర్‌ఒకు ECINETను ఉపయోగించే వెసులుబాటు లభించకపోవడంతో, అర్హులైన 97 మంది ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చలేకపోయారు.
ఫారం 6ను సవరించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ, వాస్తవానికి ఓటర్లు తమ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేని ఫారం 6ను సిఇసి ఏకపక్షంగా మార్చిందనేది ఇద్దరు ఇసిలు లేవనెత్తిన రెండవ అభ్యంతరం.
మూడవ అభ్యంతరం పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను మరింతగా తొలగించడం కోసం లక్షలాది అప్పీళ్లను దాఖలు చేయడానికి ఇచ్చిన అధికారానికి సంబంధించింది. ఈ అప్పీళ్ల వివరాలు ఇప్పటికీ బహిరంగం కాలేదు. పశ్చిమ బెంగాల్‌లోని ట్రిబ్యునల్స్‌ తొలగించిన పేర్లను పరిమితంగా పరిశీలించగా, దాదాపు 93 శాతం ఓటర్లను తప్పుగా తొలగించినట్లు స్పష్టమైంది. స్పష్టంగా, నిర్దిష్ట పేర్లను తొలగించడానికి సిఇసి స్థాయిలో ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు. సిఇసి తీసుకున్న ఇటువంటి ఏకపక్ష చర్యలు, ఆయన అనుసరిస్తున్న పద్ధతులు అధికార పార్టీ ఎన్నికల్లో గెలవడానికి స్పష్టంగా ఉద్దేశించినవేననే ప్రజల్లో అనుమానాలను రేకెత్తించాయి.
మరో సమస్య ఏమిటంటే, గతంలో ఓటు వేసి ఉండి, 2002 ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, కేవలం కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం నింపాలని ఆదేశించడం. ఫారం ఒక నిబంధన ఏమిటంటే, నమోదు కోరుకునే వ్యక్తి తాను ఇంతకు ముందెన్నడూ ఓటు వేయలేదని ప్రకటించాలి. గతంలో ఓటు వేసి, ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్న అలాంటి ఓటర్లను, తాము ఇంతకు ముందెన్నడూ ఓటు వేయలేదని తప్పుడు ప్రకటన చేసేలా ఆదేశించడం జరుగుతుంది.
ఈ సమస్యలు సిఇసి సమగ్రతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ కారణంగా, భారత యువత ఆయన తక్షణ రాజీనామాను కోరింది. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనంలో బహిర్గతమైన నేపథ్యంలో కమిషన్‌ పనితీరుపై తలెత్తిన సందేహాలను కమిషన్‌ తప్పక నివృత్తి చేయాలని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు సైతం బహిరంగ ప్రకటనలలో పేర్కొన్నాయి. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2026 సెప్టెంబర్‌ 26న కమిషన్‌ జారీ చేసిన ప్రకటన. అందులో, ‘ఇండియన్‌ ఎక్‌ చేసిన ఆరోపణలను, దాని పరిశోధనలను అంగీకరించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే, కమిషన్‌ ఇప్పుడు తన పనితీరును మార్చుకుంటుందని సూచిస్తున్నట్లుగా ఉంది. ఆరోపిత తేడాలను పరిష్కరించడానికి, నోటీసులు అందుకున్న వ్యక్తుల ఇళ్ల వద్దకు బూత్‌-స్థాయి అధికారులు (బిఎల్‌ఒ) వెళ్లి, పత్రాలను సేకరించి, ఇఆర్‌ఒ నిర్ణయం కోసం వాటిని ECINETలో అప్‌లోడ్‌ చేస్తారు. అలాంటి వ్యక్తులను ఇఆర్‌ఒ లేదా ఎఇఆర్‌ఒ ముందు విచారణకు పిలవరు. అది కేవలం అసాధారణ సందర్భాలలో మాత్రమే జరుగుతుంది. ఆన్‌లైన్‌ విచారణకు సౌకర్యాన్ని బలోపేతం చేస్తారు. అంతేకాకుండా, క్షేత్రస్థాయి అధికారులకు ECINET అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు అటువంటి వెసులుబాటు అందుబాటులో లేదనే వాస్తవాన్ని ఇది స్పష్టంగా అంగీకరించడమే. లేకపోతే, ఇద్దరు ఇసిలు నమోదు చేసిన ఆరోపణను కచ్చితంగా ఖండించి ఉండేవారు.
సిఇసి రాజీనామా అనే అవమానం నుంచి ఆయనను కాపాడటానికి, భారత ప్రభుత్వం ఇద్దరు ఇసిలను ఈ ప్రకటనలో చేరేలా ఒప్పించగలిగినట్లు కనిపిస్తోంది. ఇలాంటి కుతంత్రాలు సిఇసి ప్రవర్తనను సమర్థించలేవు. రాజీనామా కేవలం ఆమోదయోగ్యమైనదే కాదు, అవసరం కూడా. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ ,ఇతర ప్రాంతాలలో సిఇసి ఆదేశాల మేరకు ఎన్నికలు అక్రమాలు జరిగాయా అనే ప్రజల సందేహాలను తొలగించడానికి సెప్టెంబర్‌ 26 ప్రకటన సరిపోదు.
(సౌజన్యం : ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)