CJP Protest: జంతర్ మంతర్ వద్ద CJP ధర్నాకు నో పర్మిషన్.. 10 రోజుల నిబంధనపై పోలీసుల స్పష్టత ఇదే..
ఢిల్లీలో మరో నిరసన.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు మాజీ పోలీసులు పిలుపు
CJP Protest: కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని , ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10, 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ‘ఛలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా న్యూఢిల్లీ ప్రాంతంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 ప్రకారం ముందస్తు నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం సాధ్యపడదని పోలీసులు తేల్చి చెప్పారు.
శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ పోలీస్ జాయింట్ సీపీ నూపూర్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఏదైనా భారీ నిరసన ప్రదర్శనకు కనీసం 10 రోజుల ముందే అనుమతి కోరాల్సి ఉండగా, సిజెపి ప్రతినిధులు అక్టోబర్ 7న, కేవలం మూడు రోజుల ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం వల్ల అనుమతి నిరాకరించినట్లు ఆమె వివరించారు. దీంతో పాటు గతంలో జరిగిన ఆందోళనల సమయంలో సదరు నిర్వాహకులు పోలీసుల నిబంధనలను పాటించకపోవడం , అంగీకార పత్రాలను ఉల్లంఘించడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
మరోవైపు సీజేపీ ఆందోళన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. దాదాపు 20,000 మందికి పైగా పోలీస్ , పారామిలిటరీ బలగాలను న్యూఢిల్లీ వ్యాప్తంగా మోహరించారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందన్న నివేదికల ఆధారంగా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, కేంద్రీయ సచివాలయం, మండి హౌస్ సహా ఢిల్లీలోని 57 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయాలని పోలీసు శాఖ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ని ఆదేశించింది. వీటితో పాటు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చే పలు రైళ్లను నిలిపివేయడం, అలాగే నగరవ్యాప్తంగా మద్యంపాన షాపులను మూసివేయించడం వంటి కఠిన ఆంక్షలు విధించారు.
ఢిల్లీ పోలీసుల నిర్ణయంపై సీజేపీ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తుగా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రసాదించిన నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరని, పోలీసుల అనుమతులతో సంబంధం లేకుండా తమ ఆందోళనను కొనసాగిస్తామని సిజెపీ నేతలు స్పష్టం చేశారు. పర్యవసానంగా, శనివారం జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.