Skip to content
జాతీయం › వార్తలు

CJP Protest in Delhi: విమానంలోనే అభిజిత్ దీప్కే అరెస్టు..CJP నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. 500 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

jagan 10 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest in Delhi: విమానంలోనే అభిజిత్ దీప్కే అరెస్టు..CJP నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. 500 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

CJP Protest in Delhi

CJP Protest in Delhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు తీవ్రమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిరసనకు ముందస్తు అనుమతి నిరాకరించిన అధికారులు, రాజధానికి వస్తున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్న సుమారు 500 మంది సీజేపీ మద్దతుదారులతో పాటు క్రిమినల్ నేపథ్యం ఉన్న మరో 50 మందిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితులను అదుపు చేసేందుకు న్యూఢిల్లీని 20 ప్రత్యేక జోన్లుగా విభజించి, వివిధ స్టేడియంలలో డిటెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 20 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన పహారా కాయడమే కాకుండా, డ్రోన్ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో జూలై 20న జరిగిన సీజేపీ నిరసన హింసాత్మకంగా మారిన అనుభవాల దృష్ట్యా, ఈసారి ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 45 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.

మరోవైపు నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న సీజేపీ ప్రధాన నేతలను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ నేత అభిజీత్ దీప్కే ప్రయాణిస్తున్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే, పోలీసులు నేరుగా విమానంలోకి ప్రవేశించి ఆయనను అరెస్టు చేశారు. విమానం దిగే వరకు కూడా ఆగకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన దీప్కే, ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేసిన ఆయనను పోలీసులు గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు. దీప్కేతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా వంటి కీలక నేతలను, యూట్యూబర్ ధృవ్ రాథీని గురుగ్రామ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ పరిణామాలపై సీజేపీ నేత అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందిస్తూ సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా విమర్శలు గుప్పించారు. నిరసనకారులను అడ్డుకోవడానికి, ఢిల్లీని మూసివేయడానికి ప్రభుత్వం యత్నించడం దాని శక్తికి సంకేతం కాదని, సొంత ప్రజల ఆందోళనను చూసి ప్రధాని మోదీ భయపడిపోయారనడానికి ఇది నిదర్శనమని, ఆయన తన పరాజయాన్ని అంగీకరించారని వ్యాఖ్యానించారు. కీలక నేతల అరెస్టులు, భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఢిల్లీ సరిహద్దులు , జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.