Skip to content
జాతీయం › వార్తలు

రాజ్యాంగ భావనలకు వ్యతిరేకమైన ఆర్‌ఎస్‌ఎస్‌ క్రీడ

Prajapaksham 09 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
రాజ్యాంగ భావనలకు వ్యతిరేకమైన ఆర్‌ఎస్‌ఎస్‌ క్రీడ

Editorial On RSS Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి భాగవత్‌ సుభాషితాలు

సునీల్‌ ముఖోపాధ్యాయ్‌, రచయిత, జర్నలిస్టు

(నిన్నటి తరువాయి)

భారత ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమై ఉండగా 2004 జనవరి 23న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గోవధను నిషేధిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ కోసం స్పష్టంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సాధ్వి ఉమా భారతి చొరవచూపించారు. గోవధను మహాపాపంగా పరిగణించే మనుస్మృతి, దానిని పాల్పడి న వారికి కఠిన శిక్షను విధిస్తుందని ఆ ఆర్డినెన్స్‌ పేర్కొంది. తద్వారా, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక ప్రభుత్వం చట్టం ద్వారా మనుస్మృతిని అమలు చేసింది.
ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కూటమి ఇప్పుడు మహిళా శక్తిని గొప్పగా చెప్పుకుంటోంది. అయితే, 2023లో పార్లమెంటులో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికీ, బిజెపి ప్రభుత్వం దాని అమలును లోక్‌సభలో సీట్ల పునర్విభజనతో ముడిపెట్టి జాప్యం చేస్తోంది. తద్వారా మొత్తం ప్రక్రియను గందరగోళానికి గురిచేస్తోంది. వారు మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల కేటాయింపును నిలిపివేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపిలకు ఇది సహజమే. వారు విశ్వసించే మనుస్మృతి ప్రకారం, మహిళలకు సమాన హక్కుల మాట అటుంచి, కనీసం ఎటువంటి హక్కులూ గుర్తించబడవు. మహిళల విషయంలో మను నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మహిళలు తమ కుటుంబంలోని పురుషుడి ఆధీనంలోనే ఉండాలి. వారు ఏదైనా ఇంద్రియ సుఖాలను అనుభవించాలన్నా, పురుషుడి నియంత్రణలోనే ఉండాలి. స్త్రీ బాల్యంలో తండ్రి ఆధీనంలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, వృద్ధాప్యంలో కుమారుని ఆధీనంలో ఉండాలి. మనుస్మృతిలో మహిళల గురించి చెప్పబడిన మరింత భయంకరమైన విషయం ఏమిటంటే, స్త్రీ ఎప్పటికీ స్వతంత్రంగా
ఉండటానికి అర్హురాలు కారు.
అటువంటి ప్రబోధం కంటే తీవ్రమైన, ప్రమాదకరమైన ముగింపు ఇంకేముంటుంది? మనువు కాలంలో స్త్రీలను అణచివేయడం సాధ్యమైతే, ఈ రోజు కూడా అది సాధ్యమేనా? ప్రాచీన కాలంలో ఖానా, లీలావతి వంటి మహిళా పండితులు మనకు ఉండేవారు. ఆధునిక కాలంలో మహిళా ప్రధానమంత్రులు లేదా దేశాధినేతల సంఖ్య తక్కువ కాదు. మన ఉపఖండంలోనే, భారతదేశానికి ఇందిరా గాంధీ, పాకిస్తాన్‌కు బెనజీర్‌ భుట్టో, శ్రీలంకకు సిరిమావో బండారనాయకే, చంద్రికా బండారనాయకే, డాక్టర్‌ హరిణి అమరసూరియ (ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు), బంగ్లాదేశ్‌కు షేక్‌ హసీనా ప్రధానమంత్రులుగా లేదా దేశాధినేతలుగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, మహిళా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, కార్పొరేట్‌ డైరెక్టర్లు మొదలైన వారి సంఖ్య నిష్పత్తిలో తక్కువగా ఉండవచ్చు, కానీ అది ఏమాత్రం తక్కువ కాదు. నెహ్రూ మంత్రివర్గంలోని న్యాయశాఖ మంత్రి, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, ‘హిందూ కోడ్‌ బిల్లు’ను రూపొందించారు. మహిళలు ఆస్తి హక్కులతో సహా వివిధ హక్కులను అనుభవించే విధంగా హిందూ పర్సనల్‌ లాను సంస్కరించడమే ఈ బిల్లు లక్ష్యం. దీనికి వ్యతిరేకంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‘హిందూ కోడ్‌ బిల్లు’ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేసింది. మహిళలకు ఈ హక్కులు ఇవ్వడం ద్వారా ‘పురుషులలో తీవ్రమైన మానసిక ప్రతిచర్య’ ఏర్పడుతుందని, ‘వారిలో మానసిక అనారోగ్యం, బాధలు తలెత్తుతాయని’ గోల్వాల్కర్‌ ప్రకటించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కే ఎందుకీ మినహాయింపు
భారతదేశంలో రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన, వాణిజ్య లేదా మరే ఇతర సంస్థనైనా ఏర్పాటు చేయాలంటే, నిర్దిష్ట నిబంధనలను పాటించడం, సంస్థను రిజిస్టర్‌ చేసుకోవడం, సంబంధిత ప్రభుత్వ శాఖకు ఆడిట్‌ చేయబడిన ఆదాయ-వ్యయ నివేదికలను సమర్పించడం తప్పనిసరి. కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే ఈ నిబంధనల నుండి మినహాయింపు ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం గానీ లేదా వామపక్షాల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం గానీ, రాజ్యాంగం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఈ సంస్థను ఎన్నడూ ఒత్తిడి చేయలేదు. ప్రస్తుతం, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: స్వామి వివేకానంద స్థాపించిన హిందూ మతపరమైన సంస్థ ‘రామకృష్ణ మిషన్‌’ 1860లోనే రిజిస్ట్రేషన్‌ చేయబడింది. మన దేశంలోని క్రైస్తవ, ఇతర మతపరమైన సంస్థలన్నీ కూడా నమోదై ఉన్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ రోజువారీ కార్యకలాపాల కోసం, అలాగే ఢిల్లీ, అనేక ఇతర నగరాల్లో భారీ భవనాలతో కూడిన కార్యాలయాల నిర్మాణం కోసం చేసిన ఖర్చులపై ఎప్పుడైనా ఆడిట్‌ జరిగిందా? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఎటువంటి రాజ్యాంగ పదవిలో లేనప్పటికీ, ప్రభుత్వం వారికి ప్రత్యేక భద్రతా సదుపాయాలను ఎందుకు కల్పిస్తోంది? భారత ప్రజలు ఈ ప్రశ్నలను అడగకూడదా?
భారతదేశపు ప్రాచీన సంస్కృతి, విలువలు, స్వాతంత్య్ర పోరాట అనుభవాల ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. కాబట్టి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌ల ముందు తలవంచే, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని కలలు కనే మనువాద ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ రాజ్యాంగాన్ని పాటించడం నిజంగా కష్టం. గోల్వాల్కర్‌ స్వయంగా ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’ లో ఇలా రాశారు : మన దేశం అనే భావన ప్రాంతీయ జాతీయవాదం, సామూహిక ముప్పు అనే ఆలోచన ఆధారంగా సృష్టించబడింది. ఈ భావనలు మనల్ని నిజమైన హిందూ అసిత్వాన్ని సానుకూల, స్ఫూర్తిదాయక సారం నుంచి దూరం చేసి, ‘స్వాతంత్య్ర ఉద్యమాలను’ ఆచరణాత్మకంగా బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలుగా మార్చాయి. బ్రిటిష్‌ వారిని వ్యతిరేకించడాన్ని దేశభక్తి, జాతీయవాదంతో సమానం చేశారు. ఈ ప్రతీఘాత దృక్పథం వినాశకరమైన ప్రభావం మొత్తం స్వాతంత్య్ర పోరాటం పై, నాయకులపై, సామాన్య ప్రజలపై ఒకే మాదిరిగా పడింది. (పే. 138)
సార్వజనీన ఓటుహక్కుకు, సమాఖ్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకుడినని గర్వంగా చెబుతారు. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బ్రిటిష్‌ వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తనను తాను ‘భారత జాతీయవాది’గా కాకుండా ‘హిందూ జాతీయవాది’గా అభివర్ణించుకున్నారు. ఎందుకు?
సార్వజనీన ఓటు హక్కు, సమాఖ్య వ్యవస్థ మన రాజ్యాంగంలోని రెండు మౌలిక అంశాలు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ రెండింటినీ వ్యతిరేకిస్తుంది. భారత రాజ్యాంగ పరిషత్తు రాజకీయ సమానత్వాన్ని, అంటే ఒక వ్యక్తికి ఒక ఓటును నిర్ణయించినప్పుడు, 1949 నవంబర్‌ 30న ‘ఆర్గనైజర్‌’ పత్రిక సంపాదకీయం ఇలా పేర్కొంది ‘వయోజనులందరికీ ఓటు హక్కు ఇవ్వడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేసింది.
సామాన్య ప్రజలకు రాజకీయాల గురించి ఆలోచించి, వివేకవంతంగా ఓటు వేయాల్సిన తలనొప్పి ఉండేది కాదు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, మనం సార్వత్రిక వయోజన ఓటు హక్కు పట్ల అతిగా ఉత్సాహం చూపలేము. తీవ్రమైన ఆర్థిక అసమానతలు ఉన్న దేశంలో, రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని వర్తింపజేయడం రాజకీయ అస్థిరతకు
దారితీసే ప్రమాదం ఉంది.’
1961లో జాతీయ సమగ్రత మండలి మొదటి సమావేశంలో తన ప్రసంగంలో గోల్వాల్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సమాఖ్య వ్యవస్థను వ్యతిరేకిస్తుందని కూడా స్పష్టం చేశారు. ఆయన ఉద్దేశ్యంలో ‘ నేడు ప్రభుత్వ సమాఖ్య స్వరూపం వేర్పాటువాద ధోరణులకు కారణం కావడమే కాకుండా వాటిని పోషిస్తోంది. ఎందుకంటే మనం ఒకే జాతి అనే సత్యాన్ని అది అంగీకరించకుండా, దానికి బదులుగా దానిని నాశనం చేస్తోంది. రాజ్యాంగాన్ని ప్రక్షాళన చేసి, కేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థను స్థాపించడానికి దానిని సమూలంగా పెకిలించివేయాలి.’ అని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని తిరగరాయాలి ః గోల్వాల్కర్‌
గోల్వాల్కర్‌ తన ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’లో ఇలా రాశారు. అత్యంత ముఖ్యమైన, ప్రభావశీలమైన చర్య ఏమిటంటే, మన రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణం గురించిన అన్ని చర్చలను మన మనస్సుల నుండి పూర్తిగా తుడిచివేయడం, భారతదేశంలో అన్ని స్వయం పరిపాలిత లేదా పాక్షిక స్వయం పరిపాలిత రాజ్యాలను ఒకే దేశం కిందకు తీసుకురావడం, ‘ఒకే దేశం, ఒకే రాజ్యం, ఒకే శాసనసభ, ఒకే కార్యనిర్వాహక వర్గం’ అనే వ్యవస్థను ప్రకటించడం. తద్వారా విభజనవాద, ప్రాంతీయ, సంకుచిత, భాషా ఆధారిత, లేదా ఏ విధమైన అహంకారానికైనా మన బలమైన ఐక్యతకు హాని చేసే అవకాశం ఉండదు. అందువల్ల, మన రాజ్యాంగాన్ని పునఃపరిశీలించి,తిరిగి రాయాలి.(పే. 227)
కాబట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలోని బిజెపి, ఇతర సంస్థలు రాజ్యాంగాన్ని మార్చే క్రీడలో ఎందుకు పాలుపంచుకుంటున్నాయో అర్థం చేసుకోవడం కష్టం కాదు. వారు ఎన్నికలు, పరిపాలన, న్యాయవ్యవస్థ, విద్య, ప్రాథమికంగా అన్నిటినీ నియంత్రణలోకి తీసుకుని, ఆచరణాత్మకంగా ఒక నియంతృత్వాన్ని స్థాపించాలనుకుంటున్నారు.
అందుకే, దేశంలోని ప్రగతిశీల ప్రజలందరికీ, శ్రామిక వర్గ ప్రజలందరికీ, అన్ని మతాలు, వర్గాలు, తెగలు, కులాలు, తరగతుల ప్రజల కు మను అనుచరుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడే పోరాటం అత్యంత ఆవశ్యకమైంది. రాజ్యాంగం మనగడ సాగించకపోతే, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కూడా ఉండవు. మహిళలు హక్కులు లేని మను యుగానికి తిరిగి వెళ్లవలసి వస్తుంది.
మైనారిటీలను దేశం నుంచి వెలివేస్తారు లేదా ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించవలసి వస్తుంది. దళితులు, ఆదివాసులు ప్రస్తుతం అనుభవిస్తున్న రాజ్యాంగ ప్రయోజనాలన్నింటినీ కోల్పోతారు. మంచి నాగరిక, ప్రజాస్వామ్య భారతదేశం దీనిని కోరుకోదు, ఎందుకంటే ఇది భారతదేశ సంస్కృతికి విరుద్ధం.
ప్రజలు పదే పదే వెనక్కి చూస్తూ ఉంటే ఎన్నటికీ ముందుకు సాగలేరు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా దేశాన్ని, సమాజాన్ని మను యుగానికి తిరిగి తీసుకెళ్లాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వయం
ప్రయత్నాన్ని అడ్డుకోవాలి.

మొదటి భాగం కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి

మనుస్మృతి అడుగుజాడల్లో రాజ్యాంగాన్ని మారుస్తారా?

ట్యాగ్‌లు: Modi Govt national news Today news