Skip to content
జాతీయం › వార్తలు

మనుస్మృతి అడుగుజాడల్లో రాజ్యాంగాన్ని మారుస్తారా?

Prajapaksham 08 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మనుస్మృతి అడుగుజాడల్లో రాజ్యాంగాన్ని మారుస్తారా?

Ambedkar

సునీల్‌ ముఖోపాధ్యాయ్‌, రచయిత, జర్నలిస్టు

గత లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన తరువాత, భారత రాజ్యాంగ ప్రతిని తన తలపై ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు, ఆయనకు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉండవచ్చని కొందరు భావించారు. భారత రాజ్యాంగం సామ్యవాద, ప్రజాస్వా మ్య, సమాఖ్య, లౌకిక స్వభావాన్ని మార్చాలని భారత ప్రజలు కోరుకోవడం లేదని ఆయన బహుశా గ్రహించి ఉంటారని వారు అనుకున్నారు. అణగారిన వర్గాలకు అంటే షెడ్యూల్డ్ కులాలు, తెగలతో సహా అన్ని వెనుకబడిన కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ను ఆయన గౌరవిస్తారని భావించారు. మోదీ విషయంలో సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించాలని కొందరు నాకు సలహా కూడా ఇచ్చారు. కానీ త్వరలోనే అసలు విషయం బయటపడింది. ప్రధానంగా రాజ్యాంగా న్ని మార్చేందుకు, ప్రతిపక్ష ప్రాంతీ య పార్టీల ఎంపిలను తమ వైపు తిప్పుకోవడం, పార్లమెంటు ఉభయ సభలలో (లోక్సభ, రాజ్యసభ) మూడింట రెండు వంతుల ఎంపిల మద్దతును కూడగట్టుకోవడం అనే వ్యూహం పట్ల మోదీ, ఆయన బృందం ఆసక్తి చూపారు.

రాజ్యాంగ పీఠిక నుండి ‘లౌకికవాదం’, ‘సామ్యవాదం’ అనే పదాలను తొలగించాలని గతంలో భారతీయ జనతా పార్టీకి చెందిన అనేకమంది నాయకులు అన్నారు. ఇప్పటికీ అంటూనే ఉన్నారు. అసలు రాజ్యాంగ పీఠికలో ఈ రెండు పదాలు లేవని, అవి తర్వాత చేర్చబడ్డాయని వారి వాదన. అది నిజమే; బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆధ్వర్యం లో రూపొందించిన రాజ్యాంగం అసలు పీఠికలో ఈ రెండు పదాలు లేవు. ఎందుకంటే, భారతదేశం ఒక లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రజాస్వామ్య దేశంగా ఉంటుందనే భావనను రాజ్యాంగంలోని నిబంధనలు, ఉప-నిబంధనలు అప్పటికే ప్రతిబింబించేలా ఉన్నాయి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు ఈ రాజ్యాం గ విలువలపై తీవ్రమైన దాడులు చేయడం ప్రారంభించినప్పుడు, 1976లో భారత రాజ్యాంగంలో పీఠిక ‘లౌకిక’ ‘సామ్యవాద’ అనే పదాలను చేర్చారు.
మోదీ, ఆయన మద్దతుదారులలో మార్పు వచ్చింద ని భావించిన వారు ఒక సాధారణ సత్యాన్ని విస్మరించారు. బిజెపి అనేది రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రాజకీయ విభాగం. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది కఠినమైన క్రమశిక్షణతో కూడిన, అంటే కచ్చితమైన నియంత్ర ణ కలిగిన క్యాడర్‌- ఆధారిత సంస్థ. కాబట్టి, ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి తన వ్యూహాలను మార్చుకున్నప్పటికీ, సంస్థాగత, సైద్ధాంతిక అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ విధానా లు, ఆదేశాలను పాటించాల్సిన అనివార్యత దానికి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల బిజెపి నాయకులు బహిరంగంగానే తమ విధేయతను ప్రకటిస్తారు. ఈ రెండు సంస్థల నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉండవచ్చు కానీ, భావజాలపరంగా అందరూ ఏకతాటిపైనే ఉంటారు.
హిందూ మితవాద సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌లో ‘గురూజీ’గా పిలువబడే మాధవ సదాశివరావు గోల్వాల్కర్‌, 1939లో ప్రచురితమైన తన ‘We, or Our Nationhood defined’ (మనం, లేదా మన జాతీయత నిర్వచనం) అనే పుస్తకం ద్వారా ఈ సంస్థకు భావజాల పునాదిని వేశారు. వీరు జర్మనీకి చెందిన ఫాసిస్ట్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఆరాధించేవారు. గోల్వాల్కర్‌ ఇలా రాశారు: ‘జాతి, దాని సంస్కృతి స్వచ్ఛతను కాపాడుకోవటానికి, సెమిటిక్‌ జాతులైన యూదులను దేశం నుండి తొలగించడం ద్వారా జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ అత్యున్నత స్థాయి జాత్యాభిమానా న్ని ప్రదర్శించింది. మూలస్థాయిలోనే భిన్నత్వాలు కలిగిన జాతులు, సంస్కృతులు ఒకే మాదిరిగా కలిసిపోవ డం ఎంత అసాధ్యమో చెప్పేందుకు, హిందుస్థాన్‌లోని మనకు అది చూసి నేర్చుకొని, ప్రయోజనం పొందడానికి ఒక మంచి పాఠం’ (పేజీ 35). ఆయన ‘సెమిటిక్‌ జాతి’ అనే పదాన్ని చాలా ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించారు. ఎందుకంటే ఇందులో కేవలం యూదులే కాకుం డా ముస్లిం, అరబ్‌ జాతులు కూడా ఉంటాయి. వాస్తవం ఏమిటంటే, దేశ విభజనకు ముందు, తర్వాత కూడా, మన జనాభాలో గణనీయమైన భాగం ముస్లింలే ఉన్నారు.
గోల్వాల్కర్‌కు హిట్లర్‌ స్ఫూర్తి
హిట్లర్‌ బోధనల నుండి ప్రేరణ పొందిన గోల్వాల్కర్‌, శతాబ్దాల క్రితమే హిందుస్థాన్‌లో (అంటే హిందూ మెజారిటీ కలిగిన భారతదేశంలో) శాశ్వతంగా స్థిరపడిన ముస్లింల భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా ఆ పుస్తకంలో స్పష్టంగా వివరించారు. ఆయన ఇలా రాశారు: ‘హిందుస్థాన్‌లోని విదేశీ జాతులు తప్పనిసరిగా హిందూ సంస్కృతిని, భాషను స్వీకరించాలి. హిందూ మతాన్ని గౌరవించడం, ఆరాధించడం నేర్చుకోవాలి, హిందూ జాతి, సంస్కృతిని (అంటే హిందూ దేశాన్ని) కీర్తించడం తప్ప వేరే ఆలోచనలు కలిగి ఉండకూడదు. హిందూ జాతిలో కలిసిపోవడానికి తమ ప్రత్యేక ఉనికిని వదులుకోవాలి. లేదా వారు దేశంలోనే ఉంటూ హిందూ దేశానికి పూర్తిగా లోబడి ఉండాలి. వారు ఏమీ ఆశించకూడదు, ఎలాంటి ప్రత్యేక హక్కులకు లేదా ప్రాధాన్యతకు అర్హులు కారు, కనీసం పౌర హక్కులకు కూడా కాదు. వారు అనుసరించేందుకు వేరే మార్గం లేదు, ఉండకూడదు కూడా. మనది ఒక ప్రాచీన దేశం;‘మన దేశంలో నివసించేందుకు ఎంచుకున్న విదేశీ జాతులతో, ప్రాచీన దేశాలు వ్యవహరించాల్సిన విధంగానే మనం వ్యవహరిద్దాం (అదే గ్రంథం, పేజీలు 47- కాబట్టి, ఈ దేశంలోని ముస్లింలు పాకిస్తాన్‌ లేదా బంగ్లాదేశ్‌కు వలస వెళ్ళిపోవాలని మోదీ గారి మద్దతుదారులు చెప్పడం వారి కొత్త నినాదం కాదు. వాస్తవానికి వారు తమ గురూజీ నేర్పిన దానినే పునరావృతం చేస్తున్నారు. అలాగే, 1946 జులై 14న నాగ్‌పూర్‌లో జరిగిన ఒక సభలో గోల్వాల్కర్‌ మాట్లాడుతూ, కాషాయ జెండా భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. “అది దైవ స్వరూపం. ఒక రోజు దేశమంతా ఈ జెండా ముందు తలవంచుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము.” (గోల్వాల్కర్‌, ‘సంగ్రహ రచనావళి’, హిందీ ఎడిషన్‌, సంపుటి 1, పేజీ 98) 1947 ఆగస్టు 14న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు భారత ప్రజలు చొరవ తీసుకున్న అదే రోజున, ఆర్‌ఎస్‌ఎస్‌ అధికారిక ఆంగ్ల పత్రిక ‘ఆర్గనైజర్‌’ ఇలా రాసింది: ‘అదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన వారు త్రివర్ణ పతాకాన్ని మాకు అప్పగించాలనుకోవచ్చు. కానీ హిందువులు దానిని ఎప్పటికీ అంగీకరించరు; దానిని గౌరవించరు. ‘మూడు’ అనే సంఖ్య అశుభమైనది. ఒకవేళ ఏదైనా జెండాలో మూడు రంగులు ఉంటే, అది కచ్చితంగా మానసికంగా చెడు ప్రభావాన్ని చూపుతుంది, దేశానికి కీడు కలిగిస్తుంది.’ విప్లవకారుడి నుండి హిందుత్వ ప్రవక్తగా మారిన వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అప్పటికే ఇలా అన్నారు: ‘మనుస్మృతి నేటి హిందూ ధర్మశాస్త్రం (హిందూ కోడ్‌).
‘నిజానికి, భారత రాజ్యాంగం అన్ని మతాలు, వర్గాలు, లింగాలు, జాతులకు సమాన హక్కులను నొక్కిచెప్పింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం ‘మనుస్మృతి’ ఆధారిత రాజ్యాంగాన్ని కోరుకుంది. భారత రాజ్యాంగ పరిషత్‌ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఖరారు చేసింది. నాలుగు రోజుల తర్వాత, నవంబర్‌ 30న ‘ఆర్గనైజర్‌’ పత్రిక సంపాదకీయంలో ఆగ్రహంతో ఇలా రాసింది: “ప్రాచీన భారతదేశంలో రూపొందించిన విశిష్టమైన రాజ్యాంగ నియమాల ప్రస్తావన మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. స్పార్టాకు చెందిన లైకర్గస్‌ లేదా పర్షియా కు చెందిన సోలోన్‌ కంటే చాలా కాలం ముందే మనుస్మృతి రచించబడింది. మనుస్మృతిలో పేర్కొన్న నియమాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్నాయి, స్వచ్ఛందంగా అనుసరించబడుతున్నాయి”.
ఈ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదు. మనుస్మృతి లో పేర్కొన్న కుల వ్యవస్థ విభజనలు గానీ, లేదా అత్యల్ప నేరానికి కూడా శూద్రుల నాలుకను లేదా చేతిని నరికేసే నిబంధనలు గానీ ప్రపంచంలోని ఏ నాగరిక దేశంలోనైనా ఆచరణలో ఉన్నాయా? ఏ నాగరిక దేశంలోనైనా కుల ఆధారిత వివక్ష ఉందా? అదృష్టవశాత్తూ, భారత శిక్షాస్మృతి (ఐపిసి) కూడా ఏ నేరానికీ అటువంటి అమానుషమైన శిక్షలను గుర్తించదు. మనువు ప్రకారం, లోక కల్యాణం కోసం బ్రాహ్మణు లు బ్రహ్మ దేవుని ముఖం నుండి, క్షత్రియులు ఆయన చేతుల నుండి, వైశ్యులు ఆయన తొడల నుండి, శూద్రులు ఆయన పాదాల నుండి ఉద్భవించారు. విశ్వాన్ని రక్షించటానికి, సృష్టికర్త వారిలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు బాధ్యతలను కేటాయించారు. బ్రాహ్మణులు వేదాలను పఠించడం, బోధించడం, ఇతరుల శ్రేయస్సు కోసం దానధర్మాలు స్వీకరించడం/ఇవ్వడం వంటివి చేస్తారు.
క్షత్రియులు ప్రజలను రక్షిస్తారు. వైశ్యులు పశుపోషణ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇక శూద్రుల పని ఏమిటంటే, పై మూడు వర్ణాల వారికి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకుసేవ చేయడం. పై వర్ణాల వారికి వేదాలను అధ్యయనం చేసే, విద్యను అభ్యసించే హక్కు ఉన్నప్పటికీ, శూద్రులకు ఆ హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా శూద్రుడికి ఏదైనా జ్ఞానాన్ని బోధిస్తే, బోధకుడు, విద్యార్థి ఇద్దరూ నరకానికి వెళ్తారు. (ఇంకా ఉంది)