Birthright Citizenship: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ మరోసారి కఠిన నిర్ణయం.. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ
US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
అమెరికా అధ్యక్షుడు Donald Trump జన్మహక్కు ఆధారంగా అమెరికా పౌరసత్వం (Birthright Citizenship) పొందే విధానాన్ని పరిమితం చేయాలనే తన ప్రయత్నాలను మరోసారి ముందుకు తీసుకెళ్లారు. తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు స్వయంచాలకంగా పౌరసత్వం లభించే విధానంపై పరిమితులు విధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Birthright Citizenship: అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) నిబంధనలను కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిశ్చయంతో మరో అడుగు ముందేశారు. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు గతంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసిన కొన్ని వారాల వ్యవధిలోనే.. ఈ నిబంధనలకు కఠిన పరిమితులు విధిస్తూ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై గురువారం సంతకం చేశారు. గతంలో జారీ చేసిన విస్తృత ఆదేశాలతో పోలిస్తే ఇవి కొంత నిర్దిష్ట విభాగాలకు పరిమితమైనప్పటికీ.. రాజ్యాంగ నిబంధనలను సవాలు చేసేలా ఉన్నాయంటూ వీటిపై కూడా న్యాయపరమైన వివాదాలు చెలరేగే అవకాశం ఉందని చట్ట నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ జారీ చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికా భూభాగంపై జన్మించిన పిల్లలకు స్వయంచాలక పౌరసత్వం లభించకుండా కఠిన పరిమితులు విధించారు. ఇద్దరు తల్లిదండ్రులు అమెరికా పౌరులు కానప్పుడు.. వారిలో ఒకరిని విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ‘శత్రు దేశస్థుడు’గా గుర్తిస్తే వారి పిల్లలకు పౌరసత్వం వర్తించదు. దీంతోపాటు దౌత్యపరమైన మినహాయింపులు పొందే విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు, రాయబార కార్యాలయ సిబ్బంది పిల్లలకు, కేవలం పౌరసత్వం పొందడమే లక్ష్యంగా చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు లేదా సరోగసీ కేసులకు, ఫెడరల్ చట్టం ద్వారా పౌరసత్వం కల్పించని యూఎస్ టెరిటరీలలో జన్మించిన పిల్లలకు కూడా పౌరసత్వ హక్కు లభించదని స్పష్టం చేశారు.
ఇక రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పూర్తిగా ‘బర్త్ టూరిజం’ (Birth Tourism) వ్యాపారాన్ని అరికట్టడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. కేవలం బిడ్డకు అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో పర్యాటకులుగా లేదా తాత్కాలిక వీసాలపై దేశంలోకి వచ్చే వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ ఏజెన్సీలకు పూర్తి అధికారాలు ఇచ్చారు. ఇలాంటి పర్యటనలను ప్రోత్సహించే సంస్థలు, వ్యక్తులపై నిఘా పెంచడంతో పాటు.. బర్త్ టూరిజం కోసమే వచ్చే విదేశీయులకు వీసాలు నిరాకరించడం, వారి ప్రయాణ అనుమతులు రద్దు చేయడం, దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని ఆజ్ఞాపించారు.
వాస్తవానికి 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం పొందే హక్కు ఉంటుందని జూన్ 30న ‘ట్రంప్ వర్సెస్ బార్బరా’ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు అక్రమంగా ఉన్నా లేదా తాత్కాలిక వీసాపై ఉన్నా పిల్లలకు జన్మహక్కు పౌరసత్వం వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్.. సుప్రీంకోర్టు నిర్ణయం దురదృష్టకరమని, జన్మహక్కు పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చారిత్రకంగా దౌత్యవేత్తల పిల్లలకు మాత్రమే మినహాయింపులు ఉండేవి కాబట్టి.. ఇప్పుడు తాము జారీ చేసిన కొత్త ఉత్తర్వులు చట్టబద్ధమైన మినహాయింపుల పరిధిలోనే ఉన్నాయని వైట్‌హౌస్ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
ఈ పరిణామంపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU) వంటి మానవ హక్కుల సంస్థలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా మార్చలేరని, కోర్టు తీర్పును అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను మళ్లీ న్యాయస్థానాల్లోనే సవాలు చేస్తామని హెచ్చరించాయి. దాంతో ఈ కొత్త ఆదేశాల అమలుపై కూడా త్వరలోనే న్యాయపోరాటం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..