Skip to content
సంపాదకీయం వార్తలు

Editorial: రామాలయ నిధుల చోరీపై ఆత్మరక్షణలో హిందూత్వ శక్తులు

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
Editorial: రామాలయ నిధుల చోరీపై ఆత్మరక్షణలో హిందూత్వ శక్తులు

Editorial: రామాలయ నిధుల చోరీపై ఆత్మరక్షణలో హిందూత్వ శక్తులు

అయోధ్య బాలరామాలయంలో నిధుల దొంగతనం ఘటన షాక్‌ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి, బిజెపి నేతలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సమగ్ర విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు. అదే సమయంలో, ప్రతిపక్షాలు దీన్ని అవకాశంగా వాడుకుంటాయనే భయం వారిలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంకా వాద్రా, సమాజ్‌వాదిపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర ప్రతిపక్ష నాయకులు రామాలయ నిధుల గోల్‌మాల్‌పై ఆరోపణలు చేస్తున్నందున వారినీ విచారించాలని విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు లేఖ రాయటం ఇందుకు తాజా ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లో ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ పనిచేస్తోంది. 2027 ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తమ పరువు ప్రతిష్టలు కాపాడుకోవటానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. అది గత నెలలో సమర్పించిన తాత్కాలిక నివేదిక ప్రకారం ఎనిమిదిమంది ఉద్యోగులను అరెస్టు చేశారు. దొంగతనం, విశ్వాస ద్రోహం, క్రిమినల్‌ కుట్ర ఆరోపణలు మోపారు. రూ. 80 లక్షల నగదు, కొంత బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల నుంచి కొన్ని కోట్ల నగదు, ఆభరణాలు దొంగలించబడినట్లు ఆరోపణలుండగా, మొత్తం 40రోజుల్లో 70-సార్లు దొంగతనం ఘటనలు జరిగినట్లు సిట్‌ ఇప్పటికే నమోదు చేయగా ఇదంతా కిందిస్థాయి ఉద్యోగుల చేతివాటమేనా, పెద్దల పాత్ర లేకుండా ఈ ధనాపహరణ సాధ్యమా? పర్యవేక్షకులేమైనారు, సిసి కెమెరా ఫుటేజి ఎందుకు లేదు.

రామతీర్థ క్షేత్ర ట్రస్టు తరఫున యాజమాన్యం నిర్వహిస్తున్నవారు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఉదయించటం సమంజసం. రాముణ్ణి రాజకీయంలోకి లాగి ఆయన పేరుమీద ఓట్లు దండుకుని అధికారం చలాయిస్తున్నవారే కదా ఈ ఆలయాన్ని సొంత ఆస్తిగా చూసుకుంటున్నది? 2026 ప్రారంభంలో ధనాపహరణ సందేహాలు అంతర్గతంగా ఉత్పన్నంకాగా జూన్‌ 25న గాని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయలేదు. ఈ ఆలస్యానికి కారణమేమిటి? అందిన కానుకల మొత్తానికి బ్యాంక్‌ డిపాజిట్లకు మధ్య తేడా బయట పడటంతో అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివేదికలోని అంశాలు గోప్యంగా ఉంచారు. ట్రస్టు ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రీఆడిట్‌ను సిట్‌ ఉత్తర్వు చేసిందంటే అనుమానాల వ్రేళ్లు లోతుగా ఉన్నట్లు ఊహించుకోవచ్చు. ఇదిలావుండగా, ఆలయ నిధుల అపహరణ వెలుగులోకి వచ్చిన నెలరోజుల తర్వాత నింపాదిగా జులై 6 న తొలిసారి సమావేశమైన రామాలయ ట్రస్టుబోర్డు, తమ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌, ట్రస్టీ అనిల్‌ మిశ్రా రాజీనామాలు ఆమోదించినట్లు ప్రకటించింది. ముఖ్య కార్యనిర్వహణాధికారిని (సిఇఒ) ఎంపిక చేసేందుకు ముగ్గురితో ఒక కమిటీని నియమించింది. ఆలయంలో ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా నివారించేందుకు తీసుకోవలసిన అదనపు చర్యలు రూపొందించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేశారు.

చంపత్‌రాయ్‌ సామాన్యుడు కాదు. ఆయన విహెచ్‌పి ఉపాధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌. అనిల్‌ మిశ్రా కూడా విహెచ్‌పి ప్రముఖుడు. సుప్రీంకోర్టు ఆదేశంపై ఈ ట్రస్టును ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రామాలయ ఉద్యమాన్ని, ఆలయ నిర్మాణాన్ని ఆదినుంచీ చేబట్టిందీ ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగమైన విహెచ్‌పి. ఇంత జరిగినా ఆలయంపై తన ఆధిపత్యం కనీసం తగ్గించుకోవటానికి కూడా విహెచ్‌పి సిద్ధంగా ఉన్నట్లు లేదు. రామాలయ అడ్మినిస్ట్రేషన్‌లో మార్పులపై చర్చ జరుగుతుండగా, ఆలయంపై ప్రభుత్వ నియంత్రణను తాము అనుమతించబోమని విహెచ్‌పి జాయింట్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌ జైన్‌ సోమవారం చెప్పారు. వృత్తినిపుణుడైన సిఇఒని నియమించటానికి తమకు అభ్యంతరం లేదని, అయితే అతను సర్వీసులో ఉన్న బ్యూరోక్రాట్‌ కాకూడదని, అతను తీర్థక్షేత్ర ట్రస్టుకే జవాబుదారీగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ట్రస్టుడీడ్‌ను లేదా బైలాస్‌ను మార్చాలని ఎవరూ కోరటం లేదన్నారు. ట్రస్టు డీడ్‌ను రూపొందించింది ప్రభుత్వం అయినప్పటికీ అందులోని సమాచారాన్ని ఆర్‌టిఐ కింద వెల్లడి చేయటానికి హోంమంత్రిత్వశాఖ, సమాచార ముఖ్య కమిషనర్‌ నిరాకరించటం గమనించదగింది.

అందులో ప్రభుత్వ ప్రమేయం, వ్యయంలో వాటా లేదు. అది పూర్తిగా ప్రైవేటు ట్రస్టు. ప్రైవేటు ట్రస్టు ఆర్‌టిఐ కిందకు రాదన్నది వారి వాదన. కోట్లాది భక్తుల ఆరాధ్యుడైన రాముని ఆలయ నిర్వహణ విధివిధానాల్లో ఎందుకీ గోప్యత? ఈ రోజు (జులై 7) వరకు జరిగిన దర్యాప్తులనుబట్టి అయోధ్య రామునికి భక్తులు చెల్లించిన కానుకల్లో కోట్ల రూపాయల దొంగతనం ఆర్‌ఎస్‌ఎస్‌ వారి హస్తలాఘవం తప్ప మరెవరి ప్రమేయం లేదని తెలియజేస్తున్నది. అందువల్ల దీని రాజకీయ పర్యవసానాలు ఈ హిందూత్వ శక్తులపై ఉంటాయి. రామాలయం వారికి రాజకీయ చిహ్నం, అక్కడ ధనాపహరణం వారి ప్రతిష్టను భగపరిచింది. దాన్ని దాచిపెట్టకుండా దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పుకోవటం ద్వారా రాజకీయ నష్ట నివారణకు ప్రయత్ని స్తున్నారు. అయితే దర్యాప్తు తీరు అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వనందున అది నిష్పాక్షికంగా జరుగుతున్నట్లు అనిపించదు. అందువల్ల సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలనే ప్రతిపక్షాల డిమాండ్‌కు అభ్యంతరం ఎందుకుండాలి. అటువంటి దర్యాప్తు ప్రజల్లో విశ్వాసం నింపుతుంది కదా! దర్యాప్తు ఆదేశించటంలో జరిగిన విపరీత జాప్యం పెద్దల విషయాలు అన్నీ సర్దుబాటు చేసుకున్నాక కిందిస్థాయి ఉద్యోగులను అరెస్టు చేసినట్లు సంకేతిస్తున్నది. ఈ దర్యాప్తు పర్యవసానాలు ఎలా ఉన్నా, రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ అంశాన్ని ప్రతిపక్షాలు జనంలోకి తీసుకెళుతూనే ఉంటాయి. విహెచ్‌పి హెచ్చరికలు వారిని భయపెట్టలేవు.

ట్యాగ్‌లు: editorial