ఝార్ఖండ్‌లో యువతపై పోలీసు జులుం
Police atrocities on youth in Jharkhand
జులై 20న న్యూఢిల్లీలో నీట్ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజికి కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జవాబుదారీతనం’ డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతాపార్టీ పిలుపుకు స్పందించిన విద్యార్థుల ‘పార్లమెంట్ మార్చ్’ సందర్భంగా మితిమీరిన పోలీసు హింసపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సహా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాల తర్వాత అయినా పోలీసు ప్రవర్తనా శైలిలో కొంతమార్పు వస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కాని సోమవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నిరుద్యోగ యువత ‘చలో అసెంబ్లీ’ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్న తీరు ఏ పార్టీ ప్రభుత్వాధినేతగా ఉన్నా పోలీసులు పోలీసులేనని మరోమారు రుజువైంది. తమ ఉద్యోగ ప్రయత్నాలను, భవిష్యత్‌ను దెబ్బతీస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రశ్నాపత్రాల లీకేజిపట్ల ఆవేశంతో, బాధతో ఉన్న నిరుద్యోగ యువత కొంత దూకుడుగా వ్యవహరిస్తారని పోలీసులు వారి అనుభవాన్నిబట్టి సునాయాసంగానే ఊహించుకోగలరు. వారుబారికేడ్లు త్రోసుకుని వచ్చారని పోలీసులు అతిగా లాఠీలకు పనిచెబితే, బాష్పవాయువు ప్రయోగిస్తే, వాటర్ జెట్‌లతో నీరు చిమ్మితే వారికది సహజమైన నిరోధక చర్యగా అనిపించవచ్చు.
ఆందోళనకారులను బైఠాయింపునుంచి చెదరగొట్టటానికి పోలీసులు జరిపిన లాఠీచార్జిలో కనీసం ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరికి తలపైన బలమైన దెబ్బ తగిలింది. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా పోలీసుల క్రూరత్వం బిజెపికి తలవంపులు తెచ్చినందున ప్రతీకారం కోసం చూస్తున్న ఆ పార్టీ వారికి ఝార్ఖండ్ నిరుద్యోగుల ఆందోళన మంచి అవకాశంగా లభించింది. యువత ఆందోళనను తమకు తాముగా బలపరుస్తున్న బిజెపివారు వెంటనే పోలీసు చర్యను ఖండించారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిబిఐ దర్యాప్తు డిమాండ్‌ను బలపరుస్తూ, రాహుల్‌గాంధి వెంటనే జెఎంఎం ప్రభుత్వానికి తోడ్పాటు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఝార్ఖండ్‌లో జెఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే!
రాహుల్‌గాంధి ఢిల్లీలో పత్రికాగోష్టిలో మాట్లాడుతూ, “ఝార్ఖండ్ విద్యార్థులకు మా సందేశం స్పష్టం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై హింసను మేము ఖండిస్తున్నాం. అది ఎక్కడ జరిగినా మేము బలపరచం…సంభాషణ మాత్రమే పరిష్కారాలు సాధించగలదు. విద్యార్థులు చెప్పేది విని వారి సమస్యలు తక్షణం పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను”. ఢిల్లీలో జన్ జీ యువతపై పోలీసు హింసపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి ప్రకటన చేయాలని రెండు వారాలకు పైగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా సభకు రాని షా మొండివైఖరికన్నా రాహుల్ వైఖరి ఎంతో సానుకూలంగా ఉంది కదా? పోలీసు చర్యను సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గం తీవ్రంగా ఖండించింది. లాఠీలు సమస్యలు పరిష్కరించ బోమని, అందువల్ల నిరసనకారులతో తక్షణం చర్చలు జరపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.
అదలావుంచితే, ఇంతకీ ఝార్ఖండ్ నిరుద్యోగ యువత సోమవారానికి 17 రోజులుగా జైపాల్ ముండా స్టేడియంలో కొనసాగిస్తున్న బైఠాయింపు నిరసన వెనుకనున్న ఆవేదన ఏమిటి? ఝార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా నాయకుడు దేవేంద్రనాథ్ మహతో కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (జెఎస్‌ఎస్‌పి పరీక్షను రద్దు చేయాలని, రిక్రూట్‌మెంట్ క్రమంలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్నది నిరసనకారుల ముఖ్యమైన డిమాండ్. హేమంత్ సోరెన్ ప్రభుత్వం మరీ స్పందనారహితంగా లేదు. రాష్ట్ర సిఐడి దర్యాప్తు ఆదేశించింది. జులై 22న రాజీనామా చేసిన జెపిఎస్‌సి చైర్మన్ ఎల్.ఖియాంగ్టే ను సిఐడి అరెస్టు చేసింది.
మరో ముగ్గురు జెపిఎస్‌సి సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రభుత్వం విద్యార్థులతో ఆదివారం జరిపిన చర్చల్లో 14వ జెపిఎస్‌సి కంబైన్డ్ సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన ప్రాథమిక పరీక్ష సహా మూడు పరీక్షల రద్దు చేయటానికి అంగీకరించింది. ఆ మరుసటిరోజు నిరుద్యోగులు అసెంబ్లీకి ప్రదర్శన నిర్వహించారు. పాత అసెంబ్లీ కాంప్లెక్స్ ‘ధృవ’ వద్ద ఉదయం 10.30 ప్రాంతంలో ప్రారంభమైన నిరసన ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది. ప్రదర్శకులు త్రివర్ణ పతాకాలు, నినాదాల ప్లకార్డులు, భగత్‌సింగ్, అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్, ఉద్యమ కారుడు నిర్మల్ మహతో చిత్రపటాలు చేబూనారు. ప్రదర్శకులు కొత్త అసెంబ్లీ భవనం వద్దకు తోసుకుపోయే క్రమంలో పోలీసులతో ఘర్షణ తలెత్తింది.
తాము ఉద్దేశపూర్వకంగా లాఠీచార్జి చేయలేదని, గుంపులను వెనక్కి నెట్టటానికి మాత్రమే ప్రయత్నించామని సిటీ డిఎస్‌పి అంటున్నారు. బారికేడ్లు, ముళ్ల ఇనుప కంచెలు అడ్డుపెట్టటానికి తామేమన్నా టెర్రరిస్టులమా అని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. “విద్యార్థులుగా మేము తరచూ పరీక్షల రద్దు, పేపర్ లీక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచీ 26ఏళ్లుగా ఇదే సమస్య” అని నిరుద్యోగి ఒకరు వ్యక్తం చేసిన ఆక్రోశం ఈ ఆందోళనకు మూలాన్ని వెల్లడిస్తున్నది. ‘విద్యార్థులు మా కుటుంబ సభ్యులు’ అంటున్న హేమంత్ సోరెన్ ఆ విధమైన సహృదయాన్ని ఆచరణలో ప్రదర్శించి ఉంటే పరిస్థితి ఇంతదూరం రాకపోను. ఇప్పుడైనా చర్చల ద్వారా సత్వరం నిరుద్యోగ యువత సమస్యకు సంతృప్తికరమైన పరిష్కారం కనుగొంటుందని ఆశించుదాం!