Editorial: బిజెపి అకాలీదళ్ పునఃసమాగమం
Editorial: బిజెపి అకాలీదళ్ పునఃసమాగమం
ఇరవైనాలుగేళ్ల అలయెన్స్ బంధాన్ని ఆరేళ్లక్రితం తెంచుకున్న బిజెపి, శిరోమణి అకాలీదళ్ 2027 అసెంబ్లీ ఎన్నికలకు మళ్లీ సంధి కుదుర్చుకుంటాయా? అంటే ‘ఔను, కావచ్చు’ అనే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల పెంపుదల పునర్విభజన (డీలిమిటేషన్) వాటితో జతచేసి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకోసం రాజ్యాంగ సవరణ సహా బిల్లుల ఆమోదం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం మెజారిటీ సమీకరణ ప్రయత్నాలు పునఃప్రారంభించిన ఈ దశలో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన చర్చలు ఈ పుకార్ల షికారుకు ప్రాతిపదిక అయినాయి.
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ఫార్ములాను గతంలో వ్యతిరేకించిన అకాలీదళ్ ఇప్పుడు దాన్ని బలపరుస్తూ, మహిళా రిజర్వేషన్‌ను తక్షణం అమలు చేయాలని, లోక్‌సభ సీట్లను అన్ని రాష్ట్రాలకూ 50 శాతం పెంచాలని కోరటంలో ఆంతర్యం ఏమిటి? అకాలీదళ్‌కు లోక్‌సభలో ఉన్న ఒకే ఒక్క సీటు (హర్‌సిమ్రాత్ కౌర్ బాదల్ (భటిండా) బిజెపికి మెజారిటీ చేకూర్చదు లేదా రాజ్యసభలో గణాంకాలు మార్చబోదు. అయితే జాతీయ రాజకీయ ఏకాభిప్రాయం కోసం బిజెపి ప్రయత్నిస్తున్నట్లు కనిపించటం, పాత చిరకాల మిత్రపార్టీని మళ్లీ దగ్గరకు తెచ్చుకోవటం ఈ చర్చల ప్రధానోద్దేశం.
మోదీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పొత్తు గూర్చి కాకపోయినా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, జాతీయ ప్రయోజనాల పేరుతో భావసారూప్య పార్టీల పునరైక్యత ఆవశ్యకత గూర్చి చర్చించి ఉంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మోదీ సమావేశాన్ని ‘హృదయంలో వచ్చిన మార్పు’గా అభివర్ణించారు. రెండు పార్టీలు మళ్లీ దగ్గరవుతున్నాయనటానికి ఇది సూచన.
బిజెపి ఏవో సైద్ధాంతిక విభేదాలతో తమ దీర్ఘకాల బంధాన్ని తెంచుకోలేదు. 2020లో మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ సహజపునాది అయిన పంజాబ్ రైతులు వీధులకెక్కి పోరాటం చేస్తున్న సందర్భంలో ఆ పునాది నిలుపుకునే ఉద్దేశంతో అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక అకాలీదళ్ మంత్రి హర్‌సిమ్రాత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. అకాలీదళ్ ఆ తర్వాత ఎన్‌డిఎతో సంబంధాలు తెంచుకుంది.
రైతులు సంవత్సరంపాటు ఢిల్లీ సరిహద్దులో డేరాలు వేసుకుని, ట్రాక్టర్లపై గుడారాలు వేసుకుని పట్టువిడవని విక్రమార్కుల్లా పరాక్రమించటంతో మోదీ వెనక్కితగ్గక తప్పలేదు. అందునా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున పశ్చిమ యుపిలో రైతుల ఆగ్రహాన్ని చల్లబరిచే వ్యూహంతో కావచ్చు, మోదీ తొలిసారి జాతికి క్షమాపణలు చెప్పి ఆ రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల మూడు చట్టాలు ఉపసంహరించుకున్నారు.
కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించి దాని పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. యుపిలో బిజెపి అధికారం నిలుపుకుంది. రైతుల డిమాండ్‌పై మోదీ చన్నీళ్లు చల్లారు. ఆ కమిటీ నివేదిక ఏమైందో తెలియదు. ఏటా కొంచెం ఎంఎస్‌పి పెంచుతూ, వ్యవసాయోత్పత్తులకు స్వామినాధన్ జాతీయ రైతు కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. రైతులు మళ్లీ ఆందోళన మొదలుపెట్టినా అది మునుపటి అంత తీవ్రంగా లేదు.
కాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారం ఆమ్ ఆద్మీపార్టీ చేతికి వచ్చింది. ఆప్ అసెంబ్లీలోని 117 సీట్లలో 92 గెలుచుకోగా, అకాలీదళ్‌కు మూడు, బిజెపికి రెండు సీట్లు దక్కాయి. అకాలీదళ్‌కు 18.38 శాతం ఓట్లు లభించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్‌కు భటిండా సీటు ఒక్కటే దక్కింది. అత్యధిక నియోజకవర్గాల్లో మూడవ, నాల్గవ స్థానం పొందింది. అలయెన్స్ రద్దు రెండు పార్టీలకూ పెద్ద నష్టం చేసింది.
తాజా పరిస్థితుల్లో ఆప్ తన పార్టీని గ్రామీణ ప్రాంతంలో సైతం పటిష్టం చేసుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌కూడా పునరుత్తేజంతో పనిచేస్తున్నది. కాబట్టి తమస్థితిని బలోపేతం చేసుకోవటానికి అలయెన్స్ పునరుద్ధరణ అకాలీ రెండింటికీ అవసరం.
తమ గ్రామీణ ఓటుకు బిజెపి పట్టణ ఓటుతోడైతే ఎన్నికల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అకాలీదళ్ నాయకత్వం భావిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకు పోవటానికి అకాలీదళ్‌తో మైత్రి అవసరాన్ని బిజెపి గుర్తిస్తున్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు అకాలీదళ్ ఎన్‌డిఎలోకి తిరిగి రాకపోయినా, ఆ దిశగా అడుగులకు మోదీ సమావేశం ప్రాతిపదిక నెలకొల్పింది.
పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన బిజెపికి మతతత్వ బంధంతో సహజమిత్రులు. ప్రకాశ్‌సింగ్ బాదల్ బ్రతికి ఉన్నంతకాలం పంజాబ్‌లో, బాబాసాహెబ్ థాక్రే జీవించి ఉండగా మహారాష్ట్రలో బిజెపి ఆ ప్రాంతీయ పార్టీలకు మిత్రపక్షంగా రెండవస్థానంలోనే ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనను చీల్చి నెం.1 స్థానంలోకి వచ్చింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం సందర్భంలో, దాని అమలును 2026 సెన్సెస్ అనంతరం డీలిమిటేషన్‌తో ముడిపెట్టిన మోదీ ప్రభుత్వం తక్షణం (2024 ఎన్నికలు) అమలులోకి తేవాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. గడచిన బడ్జెట్ సమావేశాల సందర్భంలో రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చిన బిజెపి, దానిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం పిలవటానికీ నిరాకరించింది. పర్యవసానంగా ఆ బిల్లు వీగిపోయింది.
ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొంది 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలుకు బిజెపి చూపుతున్న ఆతృత సందేహాస్పదంగా ఉంది. సంఖ్యాబలం సమీకరణకు ఆప్, టిఎంసి, శివసేన (ఉద్దవ్) ఎంపిలను చీల్చింది. అయినా సంఖ్యలు సరిపోవటం లేదు. తమిళనాడు పార్టీలతో సంప్రదిస్తున్నది. డిఎంకె తమ పాత వైఖరిని పునరుద్ఘాటించగా, పాలక కూటమి ప్రస్తుత పార్లమెంటు సీట్ల సంఖ్యతోనే మహిళా రిజర్వేషన్ అమలును కోరింది.
జన్ జీ ఆందోళనతో తలబొప్పికట్టిన మోదీ ప్రభుత్వం దాన్నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్లీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ లింకు బిల్లులపై లీకులు వదులుతున్నది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించేనా?