యూకే ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్లకు పైగా టోకరా
యూకే ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్లకు పైగా టోకరా
27 మంది బాధితులు.. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో టియర్-2 వర్క్ వీసాలు, ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌లు ఇప్పిస్తామని నమ్మించి 27 మంది నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేసిన అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు.
యూకేలో స్థిరపడే అవకాశం కల్పిస్తామని ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసి, చివరకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సైదాబాద్‌కు చెందిన మహ్మద్ అయూబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు ప్రకారం.. 2022లో యూకేలో నివసిస్తున్న మహ్మద్ షాహెద్‌ను తన బంధువు ద్వారా పరిచయం చేశారు. యూకేలో హెల్త్‌కేర్, ఐటీ, పేరోల్, నిర్మాణ రంగాలతో పాటు పలు విభాగాల్లో టియర్-2 వర్క్ వీసాలు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వారి మాటలు నమ్మిన మహ్మద్ అయూబ్ తన సోదరుడు ముక్తాబా, బంధువులు, స్నేహితులు సహా మొత్తం 27 మంది అభ్యర్థుల నుంచి డబ్బులు సేకరించి నిందితులకు అందజేశాడు.
2023 ఫిబ్రవరి నుంచి 2025 వరకు నగదు, ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలు, విదేశీ బ్యాంకు ఖాతాల ద్వారా రూ.5.05 కోట్లకు పైగా చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుల నమ్మకం పొందేందుకు ముగ్గురికి యూకే వీసాలు ఇప్పించినప్పటికీ, అక్కడికి వెళ్లిన తర్వాత హామీ ఇచ్చిన ఉద్యోగాలు కల్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నెలల తరబడి వివిధ కారణాలు చెబుతూ వేచి పెట్టి, చివరకు స్పాన్సర్‌షిప్ రద్దయిందని చెప్పడంతో వారు తీవ్ర ఆర్థిక నష్టంతో తిరిగి భారత్‌కు రావాల్సి వచ్చిందని తెలిపారు.
వీసా ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తికాకపోతే మూడు నెలల్లో డబ్బు తిరిగి ఇస్తామని చెప్పినా, ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
వీసా అపాయింట్‌మెంట్లు, వైద్య పరీక్షలు, స్పాన్సర్ ఆమోదం, యూకే అధికారుల అనుమతులు ఆలస్యం అవుతున్నాయని చెబుతూ బాధితులను నమ్మించిన నిందితులు, చివరకు 2026 మార్చిలో డబ్బులు తిరిగి ఇవ్వబోమని స్పష్టంగా చెప్పి, చట్టపరంగా ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చని సవాల్ చేసినట్లు ఫిర్యాదులో వెల్లడైంది.
ఈ మోసానికి యూకేలో ఉన్న మహ్మద్ షాహెద్ ప్రధాన సూత్రధారి కాగా, అతని భార్య అఫ్గా జబీన్, సోదరుడు సాదిక్ మహ్మద్, బంధువులు రిఫా తన్జీన్, నస్రీన్ బేగం, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ నసీరుద్దీన్ అలియాస్ అదీమ్ తదితరులు డబ్బుల సేకరణ, బ్యాంకు ఖాతాల వినియోగం, బాధితులతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే ఇమ్రాన్, శామ్ అనే వ్యక్తుల పాత్రపైనా దర్యాప్తు చేయాలని బాధితుడు కోరాడు.
ఫిర్యాదు ఆధారంగా బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ చాట్స్, ఆడియో రికార్డులు, వీసా పత్రాలు, విదేశీ ఖాతాల వివరాలను సేకరిస్తూ నిందితులపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఇతర బాధితులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.