ప్రయాణాల రద్దు వద్దు- సర్దుబాట్లే ముద్దు…బుకింగ్ డాట్ కామ్ సర్వే నివేదిక వెల్లడి
ప్రయాణాల రద్దు వద్దు- సర్దుబాట్లే ముద్దు...బుకింగ్ డాట్ కామ్ సర్వే నివేదిక వెల్లడి
వ్యక్తిగత వికాసం, శ్రేయస్సుకు పెట్టుబడి ట్రావెలింగ్
96 శాతం భారతీయుల మనోగతం ఇదే
న్యూఢిల్లీ : ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు చేయడానికి, ప్రణాళికలు వేసుకునే భారతీయ యాత్రికులు అంతరాయాలు కలిగినప్పుడు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. దాదాపు 96 శాతం ప్రయాణికులు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవడం కంటే సర్దుబాట్లు ద్వారా మార్పులు చేర్పుల రీ-షెడ్యూల్ ప్రణాళిక అమలుకే ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ ట్రావెలింగ్ ఏజన్సీ “బుకింగ్ డాట్‌కామ్” నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ప్రయాణాలు చేయడం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం, అది వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, విశ్రాంతి కలగజేస్తుంది. తిరిగి ఉత్సాహం పుంజుకుంటారు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడానికి భారతీయులు మరీ మరీ ఎక్కువగా ఇష్టపడతారు. ప్రయాణాలు చేయడానికి ముందుగా ప్రణాళిక రూపొందించుకున్న తర్వాత ఏవైనా అవాంతరాలు ఎదురైతే వారు ఏకంగా ప్రయాణాలు రద్దు చేసుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడరు. ఆ తేదీలలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. లేదా ప్రయాణ సమయాన్ని తగ్గించుకుంటారు తప్ప ప్రయాణాలు చేయడాన్ని రద్దు చేసుకోరు.
96 శాతం భారతీయ ప్రయాణికుల మనస్తత్వం ఇదే తీరుగా ఉందని “బుకింగ్ డాట్‌కామ్” తన సర్వే నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో ఈ ఆన్‌లైన్ ఏజన్సీ సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 10 దేశాలకు చెందిన 10,136 మంది ట్రావెలర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. భారతదేశం నుండి 1,015 మంది ప్రయాణికులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరంతా 21 ఏళ్ళ వయసు మొదలుకొని ఆ పైబడిన వయసుగలవారే. విభిన్న వయసులు, విభిన్న ఆలోచనలున్నవారంతా ఈ సర్వేలో పాల్గొన్నారు.
పది ఆసియా పసిఫిక్ మార్కెట్లలో మొట్టమొదటిసారి ట్రావెల్ హ్యాపీనెస్ ఇండెక్స్”ను 10 వేలమంది ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించారు. దీని ప్రకారం భారతీయులకు ప్రయాణం అంటే ఆనందం, సంతోషం కలిగిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వారు ప్రయాణాలను రద్దు చేసుకోవడానికి ఇష్టపడరు. అంతకంటే అటూ ఇటూగా సర్దుబాటు చేసుకోవడానికే ఇష్టపడతారు.
వీరిలో 28 శాతం మంది అంతరాయాలు కలిగినప్పుడు, ప్రతిపాదిత మార్గంలో ప్రతికూలత ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను ఎంచుకుంటారు. అంతరాయాలు ఎదురైనప్పుడు 19 శాతం మంది ప్రయాణం వాయిదా వేసుకుంటారు. మరో 19 శాతం మంది తమ ప్రయాణ సమయాన్ని తగ్గించుకుంటారు తప్ప ప్రయాణం మానుకునే ప్రసక్తే ఉండదు.
అదేవిధంగా ఈ సర్వే నివేదిక ప్రకారం, 99 శాతం మంది భారతీయ ప్రయాణికుల ప్రయాణాలన్నీ సానుకూలమైన భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. మరో 90 శాతం మంది ఒక యాత్రకోసం ఎదురుచూపులు చూడటం వల్ల ఎంతో మానసిక సంతృప్తి ఉంటుందని, అది కొత్త శక్తిని అందిస్తుందని సర్వేలో చెప్పారు. తమ సంపూర్ణ సంతోషాలకు, ఆనందం, శ్రేయసుకోసం ప్రయాణాలు చాలా అవసరం అని 82 మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రయాణాలవల్ల సంతోషం, ఆనందం కలుగుతుందని 55 శాతంమంది చెప్పగా, మంచి విశ్రాంతి లభిస్తుందని 46 శాతంమంది చెప్పారు.
ప్రయాణాల ద్వారా ఎన్నో భావోద్వేగాలు, ఉత్సాహం ముడిపడి ఉంటుందని 43 శాతం మంది చెప్పారు. కిక్కిరిపోయిన జనం మధ్య ప్రయాణాలు చేయడంకంటే అర్థవంతమైన అనుభవాలు యాత్రలు, ప్రయాణాలవల్ల ఉండాలని 78శాతం భారతీయ ట్రావెలర్స్ కోరుకుంటున్నారు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడంవల్ల ఎంతో సంతోషం, ఆనందం కలుగుతుందని 68శాతం మంది ట్రావెలర్స్ చెప్పారు.
తీవ్ర వాతావరణ ప్రతికూలత, ఆపరిశుభధ్రత సమస్యలపై 33 శాతంమంది ఆందోళన వ్యక్తం చేయగా, నేరాల గురించి 29 శాతం మంది భయాలు వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, ఖర్చుల గురించి 28శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, రాజకీయ అస్థిరత గురించి 24శాతం మంది మాట్లాడారు. ఇన్ని ఆందోళనలు ఉన్నాగానీ, దాదాపు 70 శాతం మందికి మాత్రం ప్రయాణమే అత్యంత ప్రాధాన్యతాంశంగా మిగిలిపోయింది.
ఎన్ని ఆందోళనలు ట్రావెలర్స్‌లో ఉన్నప్పటికీ శ్రేయస్సు, సంబంధాలు, వ్యక్తిగత అనుభవాలతో స్థాయిని పెంపొందించుకోవడానికి ట్రావెలింగ్ ఒక ప్రధాన పెట్టుబడిగా మారుతోంది. నిత్యజీవితం నుండి ఒక భిన్నమైన పరిస్థితుల్లోకి వెళ్ళి గడపడానికి ప్రయాణం చాలా ముఖ్యమైనదన్న విషయం రోజు రోజుకూ ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.
బుకింగ్ డాట్‌కామ్ దక్షిణాసియా ప్రాంతీయ అధిపతి సంతోష్ కుమార్ ఈ నివేదికపై మాట్లాడుతూ, ఎంతో ఆశాజనకమైన విషయం ట్రావెలర్స్ దృఢచిత్తమేనని చెప్పారు. ప్రత్యేకించి ఆందోళనకరమైన పరిస్థితుల్లో వెనక్కు తగ్గకుండా, తమ ప్రయాణాలు వాయిదా వేసుకోకుండా అనిశ్చితి పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా వ్యవహరించి ప్రయాణాలను ఆస్వాదించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.