Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Andhra Pradesh Weather Update: ఏపీలో అక్టోబర్ 21 వరకు భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిక..

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh Weather Update: ఏపీలో అక్టోబర్ 21 వరకు భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిక..

Andhra Pradesh Rains

Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రతరం కావడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అధికారికంగా ‘ఆరెంజ్ అలర్ట్’ (Orange Alert) జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం , తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ముఖ్యంగా రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గుత్తి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పొదిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట , గొట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.

వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్లు , విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.