Skip to content
జాతీయం › వార్తలు

Cancer Drug Price Regulation: క్యాన్సర్ బాధితులకు భారీ ఊరట.. 137 నిరోధక మందుల ధరలు 70 శాతం వరకు తగ్గింపు..

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Cancer Drug Price Regulation: క్యాన్సర్ బాధితులకు భారీ ఊరట.. 137 నిరోధక మందుల ధరలు 70 శాతం వరకు తగ్గింపు..

US Pharma Tariff

Cancer Drug Price Regulation: క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న లక్షలాది మంది రోగులకు , వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రకారం.. షెడ్యూల్ చేయని 137 రకాల అత్యవసర క్యాన్సర్ నిరోధక మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (TMR) విధానంలో భాగంగా ఈ మందులపై వాణిజ్య లాభాల పరిమితిని గరిష్టంగా తగ్గించడంతో, నిత్యావసర ఔషధాల ధరలు 20 శాతం నుంచి ఏకంగా 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల చికిత్స ఖర్చుల్లో ఏటా సుమారు ₹2,500 కోట్లు ఆదా కానున్నాయి.

ఔషధ విక్రయదారులు, ఆసుపత్రులు పొందుతున్న భారీ మార్జిన్లకు చెక్ పెడుతూ, ఎన్‌పిపిఎ ఈ 137 ఔషధాలపై గరిష్ట చిల్లర ధర (MRP) లో వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి నిబంధనల ప్రకారం పరిమితం చేసింది. ఈ సవరించిన నూతన ధరలు నవంబర్ 9, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. ఆ తేదీ నుంచి అన్ని ఆసుపత్రులు, వైద్య సంస్థలు, క్లినిక్‌లు , ఫార్మసీ విక్రేతలు కేవలం కొత్త సవరించిన ధరలకే మందులను విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రోగులకు పూర్తి పారదర్శకంగా సమాచారం అందుబాటులో ఉంచేందుకు వీలుగా, ప్రతి ఫార్మసీ దుకాణంలో సవరించిన ధరల పట్టికను ప్రదర్శించాలని యజమానులకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరాలు వెల్లడిస్తూ, అక్టోబర్ 8న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎన్పిపిఎ ఈ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. కొన్ని క్యాన్సర్ మందుల గరిష్ట చిల్లర ధరలు (MRP), విక్రేతలకు అందే సరఫరా ధరల (PTR) కంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం, ఆసుపత్రులు 170 శాతం నుంచి 700 శాతానికి పైగా అదనపు లాభాలు అర్జిస్తూ రోగులను దోచుకుంటున్నాయన్న ఆందోళనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో మార్జిన్‌ను 30 శాతానికి కట్టడి చేయడంతో పాటు, పారదర్శకత కోసం రోగులు నేరుగా ఎన్‌పిపిఎ అధికారిక వెబ్‌సైట్ , ‘ఫార్మా సహీ దామ్’ (Pharma Sahi Daam) యాప్‌ ద్వారా కొత్త ధరలను తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఔషధాల ఉత్పత్తికి విఘాతం కలగకుండా నిరంతర సరఫరాను కొనసాగించాలని ఫార్మా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.