Skip to content
బిజినెస్ › వార్తలు

Railway Ticket Insurance: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే కాదు.. రైల్వే కౌంటర్ టికెట్లకూ ఇన్సూరెన్స్ కవరేజ్..

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Railway Ticket Insurance: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే కాదు.. రైల్వే కౌంటర్ టికెట్లకూ ఇన్సూరెన్స్ కవరేజ్..

Indian Railways

Railway Ticket Insurance: భారతీయ రైల్వే కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసే కోట్లాది మంది సామాన్య ప్రయాణికులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీపి కబురు అందించింది. ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్‌లలో ఈ-టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న “ఐచ్ఛిక ప్రయాణ బీమా” (Optional Travel Insurance) సౌకర్యాన్ని, ఇకపై నేరుగా రైల్వే స్టేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా విధిగా విస్తరించాలని భారతీయ రైల్వేలను ఆదేశించింది.

జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఈనెల అక్టోబర్ 27వ తేదీలోగా ఈ నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైల్వే బోర్డుకు స్పష్టమైన గడువు విధించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే రైల్వే బోర్డు ఉన్నతాధికారులే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది.

రైలు ప్రయాణంలో ఆన్‌లైన్ ద్వారా ఈ-టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో సమానంగా కౌంటర్ టికెట్లు తీసుకునే ప్రయాణికుల రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ టికెట్లకూ ప్రయాణ బీమాను విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే మే 11న కోర్టుకు తెలిపినప్పటికీ, క్షేత్రస్థాయి అమలులో ఆశించిన పురోగతి కనిపించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ ఈ-టికెట్ ప్రయాణికులకు కేవలం 45 పైసల (రూ. 0.45) స్వల్ప ప్రీమియంకే పలు రక్షణలు కల్పిస్తోంది. రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి గురైనా రూ. 10 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ. 7.5 లక్షలు, తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైతే చికిత్స ఖర్చులకు రూ. 2 లక్షలు, మృతదేహం తరలింపు ఖర్చులకు రూ. 10,000 వరకు పరిహారం అందించే నిబంధనలు అమలులో ఉన్నాయి.

ఈ నూతన ఆదేశాల ప్రకారం కౌంటర్ టికెట్ల బీమా విధానంలో వయస్సు, ప్రీమియం చెల్లింపు పద్ధతి , క్లెయిమ్ ప్రక్రియలపై రైల్వే శాఖ త్వరలోనే తుది మార్గదర్శకాలను విడుదల చేయనుంది. సాధారణంగా రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం, లేదా ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిపోవడం వంటి దురదృష్టకర సంఘటనల సమయంలో ఈ బీమా రక్షణ వర్తిస్తుంది.

బెర్త్ లేదా సీటు లేకుండా ప్రయాణించే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ పథకం వర్తించకపోగా.. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సీటు ఉన్నా లేకపోయినా నిబంధనల ప్రకారం కవరేజీ లభిస్తుంది. కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే ఈ బీమా రుసుమును ఎలా జమ చేయాలి, ఎస్‌ఎంఎస్‌ లేదా ప్రింటెడ్ స్లిప్ ద్వారా పాలసీ వివరాలు ఎలా అందజేయాలనే అంశంపై రైల్వే శాఖ త్వరితగతిన కసరత్తు పూర్తి చేసి అక్టోబర్ 27 నాటికి అమల్లోకి తేనుంది.