కాలజ్ఞానులు సైతం పసిగట్టని మోదీ ఘోర వైఫల్యం!
MODI
ఎం కోటేశ్వరరావు
ఒక పోతులూరి వీరబ్రహ్మం, ఒక నోస్ట్రోడామస్, మరొక బాబా వంగా, భృగు మహర్షి, గురు పద్మసంభవ ఇలా ఎందరో కాలజ్ఞానులు, జ్యోతిష్కులకు సైతం అందని పరిణామాలు మనదేశంలో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి రోహింగ్యాలు, ఇతర ముస్లింలు లక్షలమంది దేశంలో తిష్టవేశారని కాషాయ దళాలు పెద్ద ఎత్తున సమర్ధవంతంగా ప్రచారం చేశాయి. వారిలో ఎందరు ఓటర్లుగా ఉన్నారో ఎన్నికల సంఘం తేల్చలేకపోవటం దాని అసమర్ధతా! వింతల్లో వింత మాదిరి ఉత్తరప్రదేశ్‌లో కోటి ఇరవైఏడు లక్షల మంది హిందువుల ఓట్లు తొలగించారని హిందూత్వ ప్రముఖుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చెప్పారు. పన్నెండు సంవత్సరాల ఏలుబడి తరువాత జ్ఞానోదయం అయినట్లు తాను ఇచ్చిన రాయితీలను పూర్తిగా మింగినా ఇంకా ఆకలి తీరని ప్రైవేటు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కొత్తగా ఉపాధి కల్పించటం లేదని, పనిచేస్తున్నవారికి వేతనాలు పెంచలేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇలా అధికారంలో ఉన్నవారే ప్రతిపక్షాల మాదిరి మాట్లాడటం మోదీ బాబా మహిమ అనుకుందామా! కలి యుగాంతం ఉంటు దో ఉండదో గానీ అధికారంలో ఉన్న కాషాయ దళాల అంతాన్ని ఈ పరిణామాలు సూచించటం లేదూ! గత పన్నెండు సంవత్సరాలుగా నిర్మిం చిన పేకమేడను తన చేతులతోనే నరేంద్రమోదీ పడగొట్టారు. వేషం, భాష, నినాదాలు, అంకెల గారడీ, తిమ్మిని బమ్మిని చేసే మాయలను ఎలా ప్రదర్శించాలో జనాన్ని ఎలా బురిడీ కొట్టించాలో ప్రశాంత కిషోర్ వంటి వారు వ్యూహాలను రూపొందించారు. వాటిని ఎంతో పకడ్బందీగా అమలు జరిపిన ఆర్ఎస్ఎస్ యంత్రాంగం, వాట్సాప్ యూనివర్జిటీల పండితుల ప్రచారాన్ని మోదీ ఒక్క ప్రసంగంతో తుత్తునియలు చేశారు. భక్తులను ఉలిక్కి పడేట్లు చేశారు. ఇన్నేండ్లుగా మోదీ అభివృద్ధి బండారం గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు ఎంతచెప్పినా జనం నమ్మరని, స్వయంగా మోదీయే చెబుతారని, అయినా గుడ్డిగా నమ్మే జనాలు ఇంకా ఉంటారని కూడా కాలజ్ఞానులు చెప్పలేకపోయా రు.
దేశీయులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించలేదని కూడా మోదీ చెప్పారు. మహాత్మాగాంధీ సలహాతో స్వదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో 1927 ఏప్రిల్ ఏడున భారత పారిశ్రామిక, వాణిజ్య వర్గాల సమాఖ్య
(ఫిక్కీ)ఏర్పడింది. ఆ సంస్థ నూరవ వార్షిక సమావేశం లో 2026 నవంబరు 19న మోదీ మాట్లాడారు. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రధాని లేదా అధ్యక్ష పదవిలో ఉన్నవారు కూడా తమ వైఫల్యాలను ఇలా స్వయంగా చెప్పలేదు. ఎందుకిలా వెల్లడించారన్నది పెద్ద పశ్న. అభివృద్ధి చెందిన గుజరాత్ నమూనాను దేశమంతటా అమలు చేస్తా అన్నారు. ఎవరికి ఏ ఉద్యోగం కావాలంటే దాన్ని పొందేందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తా అన్నారు. అవేవీ లేవు, చివరికి అంతా మీరే చేశారంటూ మోదీ కార్పొరేట్లపై చేసిన వైఫల్య ప్రకటన బిజెపిలో ముసలం గా మారుతుందా! సరిగ్గా అంతకు వారం రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో భారత పరిశ్రమల సంఘాల సమాఖ్య (సిఐఐ) సమావేశాల సందర్భంగా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా మాట్లాడారు. బ్లూమ్‌బెర్గ్ అనే మీడియా సంస్థ చంద్రబాబుతో మాట్లాడినపుడు “ఏడుశాతం వృద్ధి రేటు అంటున్నారు కదా ఆ మేరకు జనజీవితాల్లో మెరుగుదల కనిపిస్తోందా” అని అడిగింది.“అది కనిపిస్తోంది, కానీ చాలదు, మేం చేయాల్సిందంతా చేస్తున్నాం, అయితే వారి ఆశలు ఎక్కువగా ఉన్నాయి.” అంటే జనం గొంతెమ్మకోరికలు కోరుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారా! దేశాన్ని అమెరికా, ఐరోపా మాదిరి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెడతామని చెబుతున్నదీ వారే. జనాల ఆకాంక్షలను నరేంద్రమోదీ తప్ప మరొకరు నెరవేర్చలేరు అంటూ తన సహజధోరణిలో భజన చేశారు.(2026నవంబరు 13, టెలిగ్రాఫ్). విభజిత ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, వ్యాపారా ల గురించి తొలి ఐదు సంవత్సరాల్లో చేసిన హడావుడిని తిరిగి గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నారు. మోదీ చెప్పిన అంశాలు ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపేమీ కాదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మా దగ్గర వేతనాలు తక్కువ గనుక రండి, అవకాశాన్ని వినియోగించుకోండి అని నిత్యం చంద్రబాబు,లోకేష్ చెబుతున్నది వాస్తవం కాదా ?
జనజీవితాలు అతలాకుతలం అవుతున్న కారణంగానే అనేక దేశాల్లో ముఖ్యంగా ధనిక ఐరోపాలో జనాలు రోడ్లెక్కుతున్నారు. ఈ విషయం మోదీకి బాగా తెలుసు. ఎన్నో ఆశలతో ఉన్న జనాన్ని ప్రైవేటు రంగం కైలాసానికి తీసుకుపోతుందని చెప్పారు. మోదీ తొలిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆ రంగం పెట్టుబడి తగ్గింది లేదా గిడసబారింది. ఆర్థిక పరిభాషలో గ్రాస్ ఫిక్స్డ్ కాపిటల్ ఫార్మేషన్(జిఎఫ్‌సిఎఫ్) అంటే దీర్ఘకాలిక ఆస్తులపై పెట్టిన నికర పెట్టుబడి అని అర్ధం. ఇది జిడిపిలో ఒక ముఖ్య భాగం. మోదీ అధికారానికి వచ్చినప్పటి నుంచి 2022 వరకు వివరాలను చూసే అది అంతకు ముందు 38శాతం ఉండగా మోదీ ఏలుబడిలో 30శాతానికి పడిపోయింది. రూపాయల్లో చూస్తే 2014 రు.32.78లక్షల కోట్ల నుంచి 2025 నాటికి రు.68.29 లక్షల కోట్లకు పెరిగింది. ఇది రెట్టింపుకు పైగా పెరిగినట్లు చెప్పటానికి పనికి వస్తుంది, కానీ ఈ సంవత్సరాలలో ప్రపంచ బ్యాంకు పేర్కొన్న వివరాల ప్రకారం 30.25 మరియు వాస్తవ జిడిపి శాతాలు 32గా ఉన్నాయి. జిఎఫ్‌సిఎఫ్ శాతం పెరిగితే పరిస్థితి బాగున్నట్లు తగ్గితే దిగజారినట్లు. విదేశీ పెట్టుబడులు తెస్తానని, రాయితీలతో దేశీయంగా ఆ మొత్తాలను పెంచుతానని చెప్పిన మాటలు ఏమైనట్లు ? విదేశీ, స్వదేశీయులు పన్నెండేళ్లలో ఇచ్చిన రాయితీలను దిగమింగారు తప్ప వాటిని తిరిగి పెట్టుబడులుగా పెట్టలేదు. మన పారిశ్రామికవేత్తలు విదేశాలల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కనుకనే కొత్త ఫ్యాక్టరీలు నిర్మించటం లేదు, ఉపాధి కల్పించటం లేదు. ఒకవేళ పెట్టినా పాతవాటిని మూసివేసి కొత్తవాటికి కార్పొరేట్ పన్ను 30 నుంచి 15 శాతానికి తగ్గించిన కారణంగా సదరు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు, కొత్త పరిశ్రమలన్నీ ఉపాధిని పెద్దగా చూపేవి కాదు. జిడిపిలో ప్రైవేటు పెట్టుబడులు 12 శాతానికి అటూఇటూగా ఉన్నాయి తప్ప పెరగటం లేదు.యుపిఏ కాలంలో 2007 గరిష్టంగా 16 శాతం ఉన్నాయి. ఆర్థిక రంగం దిగజారుడును కాస్త ఆపేందుకు ప్రభుత్వం కొన్ని రంగాలలో పెట్టుబడులు పెడుతున్నది. జాతీయ రహదారుల వంటి మౌలిక సదుపాయాల రంగంలో 2015ఆర్ధిక సంవత్సరంలో ప్రభు త్వం రెండు లక్షల కోట్లు పెట్టుబడులు పెడితే 2026
నాటికి రు.10.7లక్షల కోట్లకు పెరిగాయి. వాటిని తమ ఘనతగా ఇన్నేండ్లూ చెబుతున్నారు.ప్రైవేటు రంగం చేత ఎందుకు పెట్టుబడులు పెట్టించలేకపోయారు. చైనా స్థానాన్ని భర్తీ చేయటంలో ఎందుకు చేతులెత్తేశారు?
ప్రత్యక్ష పన్నుల రాయితీల కారణంగా పదేండ్లలో తొమ్మిది లక్షల కోట్ల మేరకు కార్పొరేట్లకు దక్కాయి. వారిపై విధించే పన్నును 30 నుంచి 22శాతానికి తగ్గించారు. కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి 15శాతమే అన్నారు. దీంతో 2019 నుంచి మరో పదిలక్షల కోట్లు ఖజానా రాబడి కోల్పోయింది. ఇంతగా మేపినా మీకు ఇంకా ఆకలి తీరలేదా, ఇంకా ఏం కావాలో చెప్పండి అని మోదీ కార్పొరేట్ పెద్దల ముందు బేలగా మాట్లాడారు. కార్పొరేట్లు కూడా బిజెపిని తక్కువగా మేపలేదు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఎన్నికల బాండ్లపేరుతో ఆ పార్టీ కి రు.8,770 కోట్లు ముట్టచెప్పినట్లు ఎడిఆర్ సంస్థ వెల్లడించింది. ఇది అధికారిక మొత్తమే, అనధికారికంగా ఎంత ఉంటుందో ఊహించుకోవాల్సిందే. మీకది మాకిది అన్నట్లుగా పంచుకున్నారు గనుకనే మోదీ ఇంతకాలం నోరుమెదపలేదు. ఇప్పుడెందుకు అంటే జనాలకు నిజా లు తెలిసి ఎక్కడ నిలదీస్తారో అని భయపడటమే కారణం గా కనిపిస్తోంది. కార్పొరేట్లకు ఎంత దోచిపెట్టిందీ మూసిపెట్టేందుకు బడ్జెట్ పత్రాలలో కోల్పోయిన రాబడి అంచనాలను ప్రకటించటమే మానుకున్నారు. ఎంతటి పారదర్శకత! ప్రశ్నించే మెదళ్లు పరిమితమైగానీ పన్నెండేండ్లు అధికారాన్ని వెలగబెట్టిన వారు చెప్పాల్సిన మాటలేనా ఇవి!
కష్టజీవుల నిజవేతనాలు పడిపోవటం లేదా పెరుగుదల లేని స్థితి దేశంలోని సంక్షోభానికి నిదర్శనం. ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో జనం ఉన్నారంటూ 80కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను ఇస్తున్న తన ప్రభుత్వం దారిద్య్రాన్ని నిర్మూలించిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగాలి. ఉదాహరణకు 2014లో రోజుకు వంద రూపాయల వేతనం వచ్చింది. దాంతో ఒక కిలో వంట నూనె కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడు 2026లో రు.182.85 పైసలు ఇస్తేనే అదే కిలో నూనె వస్తుంది. మోదీ పాలనలో 2014 నుంచి 2023 మధ్య కాలంలో వార్షిక నిజవేతనాల పెరుగుదల శాతాలలో ఇలా ఉంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేతన పెరుగుదల ఇంతగా దిగజారినప్పటికీ తన ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించిందని నరేంద్రమోదీ ప్రపంచ బ్యాంకు లెక్కలను ఉటంకిస్తున్నారు. పదేండ్లుగా ఆర్థిక వృద్ధి రేటు 6 లేదా ఏడు శాతం మధ్య ఉన్నప్పటికీ కష్టజీవుల వేతనాలు, రాబడి దానికి అనుగుణంగా పెరగలేదు. ఈ పరిస్థితి ఆర్థికరంగ తీవ్ర వైఫల్యానికి నిదర్శనం. రాబోయే రోజు ల్లో జనాలు వీటి గురించి ప్రశ్నిస్తారు, అందుకే ముందుగానే నెపాన్ని ప్రైవేటు రంగం మీద నెట్టేందుకు వేసిన పెద్ద ఎత్తుగడలో భాగమే మోడీ ప్రసంగం. ఇలాంటి అతితెలివితేటలను గ్రహించలేని స్థితిలో మన జనాలు ఉన్నారని మోదీకి ఉపన్యాసాలు రాసిచ్చే అధికారగణం, కాషాయ మేథావులు భావిస్తున్నారా!