Skip to content
జాతీయం › వార్తలు

Climate Risk Index 2027: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్.. 30 ఏళ్లలో 436 విపత్తుల్లో 78 వేల మంది మృతి, రూ.15.8 లక్షల కోట్ల నష్టం..

jagan 19 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Climate Risk Index 2027: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్.. 30 ఏళ్లలో 436 విపత్తుల్లో 78 వేల మంది మృతి, రూ.15.8 లక్షల కోట్ల నష్టం..

Climate Risk Index 2027

Climate Risk Index 2027: ఒకవైపు మురసు, అర్ణబ్ వంటి వరుస తుపానులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తుండగా, మరోవైపు కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ప్రకృతి విపత్తులు దేశాన్ని ఎంతగా వణికిస్తున్నాయో కళ్లకు కట్టేలా తాజాగా ఒక అంతర్జాతీయ నివేదిక సంచలన గణాంకాలను బయటపెట్టింది. వాతావరణ మార్పుల కారణంగా గత మూడు దశాబ్దాల్లో (1996–2025) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రభావితమైన పది దేశాల్లో భారతదేశం 10వ స్థానంలో నిలిచింది. తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (COP31) వేదికగా జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘జర్మన్‌వాచ్’ (Germanwatch) విడుదల చేసిన ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2027’ (CRI) నివేదిక ఈ చేదు నిజాలను వెల్లడించింది.

జర్మన్‌వాచ్ నివేదిక ప్రకారం, 1996 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశంలో ఏకంగా 436 ప్రకృతి విపత్తులు సంభవించాయి. తుపానులు, భారీ వరదలు, తీవ్రమైన వడగాలుల కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 120 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమయ్యారు. ఈ విపత్తుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 178 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15.8 లక్షల కోట్లు) మేర భారీ నష్టం వాటిల్లినట్లు నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా 1999 ఒడిశా సూపర్ సైక్లోన్, 2013 ఉత్తరాఖండ్ వరదలు, 2020లో అంఫాన్ తుపాను వంటివి దేశానికి తీరని ఆర్థిక, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఇక ఒక్క 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక సూచీలో భారత్ 12వ స్థానంలో నిలవడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా గత 30 ఏళ్లలో వాతావరణ మార్పుల వల్ల దాదాపు 10 వేల ప్రకృతి విపత్తులు, కరువులు సంభవించగా, వీటిలో 9.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 4.7 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.439 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లింది. గత మూడు దశాబ్దాల్లో అత్యధిక విపత్తులు ఎదుర్కొన్న దేశంగా కరేబియన్ దీవి దేశమైన డొమినికా మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మయన్మార్, హోండూరస్, లిబియా, హైతీ, గ్రెనడా, ఫిలిప్పీన్స్, నికరగ్వా, బహమాస్ , భారత్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భూతాపం పెరుగుతున్న కొద్దీ అసాధారణ విపత్తులు నిత్యకృత్యంగా మారుతున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే వాతావరణ అనుకూల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని నివేదిక హెచ్చరించింది.