Cyclone Akvan: తీరం దాటేలోపే బలహీనపడనున్న ‘అక్వాన్’ తుపాను.. ఉత్తరాంధ్ర జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు.. మధ్య, దక్షిణ కోస్తాకు తప్పిన గండం..
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. 19 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్.. ఏపీకి భారీ వర్ష సూచన...
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ (Cyclone Akvan) కదలికల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే సమయానికి దీని తీవ్రత తగ్గి క్రమంగా బలహీనపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. గురువారం వేకువజామున 5:30 గంటల సమయానికి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం, కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 530 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.
ఈ వాతావరణ వ్యవస్థ మరింతగా ఉత్తర-వాయవ్య దిశగా పయనించి శుక్రవారం (నవంబర్ 20) మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం , ఒడిశాలోని పూరీ మధ్య, గోపాల్‌పూర్‌కు తూర్పునకు సమీపంలో తీరం దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అయితే, తాజా ఉపగ్రహ అంచనాల ప్రకారం తీరం దాటే ముందే ఈ తుపాను బలహీనపడుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది.
తుపాను దిశ ఉత్తరం వైపు మళ్లడంతో దీని ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైనే తీవ్రంగా ఉండనుంది. దీనివల్ల మధ్య , దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు పెను ముప్పు తప్పినట్లేనని వాతావరణ అధికారులు వెల్లడించారు. గురువారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ , ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు వచ్చే 24 నుంచి 36 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు, చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తుపాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో ముందస్తు సహాయక చర్యలపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, వచ్చే 48 గంటల పాటు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 13 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను ప్రభావిత జిల్లాల్లో రంగంలోకి దించారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా , మండల కేంద్రాల్లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.