Skip to content
తెలంగాణ › వార్తలు

Revanth Reddy vs Rajagopal Reddy: సీఎం రేవంత్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. మునుగోడుకు నిధులు ఇవ్వకపోతే మరో కురుక్షేత్రమే… వీడియో ఇదిగో..

Krishna Rao 18 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Revanth Reddy vs Rajagopal Reddy: సీఎం రేవంత్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. మునుగోడుకు నిధులు ఇవ్వకపోతే మరో కురుక్షేత్రమే… వీడియో ఇదిగో..

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని అడిగితే ‘పండబెట్టి తొక్కుతా’ అంటారా? అంటూ సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యావు.. మరో రెండేళ్లు మాత్రమే ఉంటావు.. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మునుగోడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. కొడంగల్‌తో పాటు వెనుకబడిన నియోజకవర్గాలకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామంటున్నారని, మరి మునుగోడు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మునుగోడు అత్యధిక ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకు సాగడం లేదని, చెరువులు, కుంటల అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు అవసరమని చెప్పారు. చౌటుప్పల్‌లో ఆసుపత్రి ప్రారంభం కూడా కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని నిధులు అడగడం తప్పా? అని ప్రశ్నించారు.

నన్ను తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా?

ముఖ్యమంత్రి తనతో మాట్లాడిన తీరును ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పండబెట్టి తొక్కుతా’ అంటున్నావు.. నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగితే సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఇలాంటి భాష ఉపయోగించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా? అని నిలదీశారు.

నాకు పదవులు అవసరం లేదు.. ప్రజలకు అన్యాయం చేయొద్దు

తనకు మంత్రి పదవులు, ఇతర రాజకీయ పదవులపై ఆశ లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనను ఎన్నుకున్న మునుగోడు ప్రజలకు అన్యాయం జరగకూడదన్నదే తన ఆలోచన అని చెప్పారు. ఇతర నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు మునుగోడుకు నిధులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి విధేయుడినేనని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు.

అదే సమయంలో మునుగోడుకు నిధులు ఆపితే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. కొడంగల్‌తో పాటు మునుగోడు, ములుగు, హైదరాబాద్ సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి హితవు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సూచనలు చేస్తూ.. తెలంగాణ ప్రజలందరినీ సమానంగా చూడాలని, పక్షపాతం, వివక్ష చూపకూడదని అన్నారు. ముఖ్యమంత్రి అంటే తండ్రి పాత్ర పోషించాల్సిన వ్యక్తి అని, అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని వ్యాఖ్యానించారు.

‘ముఖ్యమంత్రి గారూ.. నీకు అదృష్టం కలిసి వచ్చి సీఎం అయ్యావు. మరో రెండేళ్లు ఉన్నా మంచిగా ఉండు. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకో’ అంటూ వ్యాఖ్యానించారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదని, ప్రజల సొమ్మును కాపాడటమే తన లక్ష్యమని చెప్పారు. మునుగోడు అభివృద్ధి కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు: Telangana