Bilkis Bano Case: నాకు తెలియకుండానే దోషులకు బెయిల్.. ఆనాటి భయాలు మళ్లీ వెంటాడుతున్నాయి.. బిల్కిస్ బానో సంచలన ప్రకటన..
డిజిటల్ అరెస్టుల నివారణకు చర్యలు తీసుకోండి.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు..
Bilkis Bano Case: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురై, తన కుటుంబంలోని 14 మందిని కోల్పోయిన బిల్కిస్ బానో ఈ కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియాల శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ జస్టిస్ సుంద్రేశ్, జస్టిస్ వరాలేలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 28న ఉత్తర్వులు ఇవ్వగా, సోమవారం వారికి బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో మంగళవారం బిల్కిస్ బానో ఒక భావోద్వేగపూరిత ప్రకటన విడుదల చేస్తూ, బాధితురాలైన తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేయడాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని బిల్కిస్ తన ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ ఒకసారి తనకు తెలియకుండానే దోషులను విడుదల చేశారని, ఇప్పుడు రెండోసారి కూడా కోర్టు తనకు సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందని ఆమె ఆవేదన చెందారు. ఈ పరిణామంతో 2002 నాటి భయానక జ్ఞాపకాలు, భయాలు మళ్లీ తనను వెంటాడుతున్నాయని, దశాబ్దాలుగా తాను పోరాడి సాధించుకున్న న్యాయం ఇప్పుడు మళ్లీ సడలిపోతున్నట్లు అనిపిస్తోందని వాపోయారు.
తన భద్రతతో పాటు తన కుటుంబం, పిల్లల భవిష్యత్తు పట్ల తీవ్ర భయాందోళన కలుగుతోందని బిల్కిస్ బానో అన్నారు. బాధితురాలిగా ఉన్న తన అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే కోర్టు ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఈ పరిణామాల వల్ల న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుందన్న భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, ఇద్దరు దోషులకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టులోనే న్యాయపరంగా సవాల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.