Skip to content
బిజినెస్ › వార్తలు

LTCG Tax in India: ఎల్‌టీసీజీ ట్యాక్స్‌పై కేంద్రం తాజా అప్‌డేట్.. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిపిన సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్..

jagan 16 Nov 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
LTCG Tax in India: ఎల్‌టీసీజీ ట్యాక్స్‌పై కేంద్రం తాజా అప్‌డేట్.. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిపిన సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్..

LTCG Tax in India

LTCG Tax in India: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) విధానంలో మార్పులు చేయాలన్న ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ స్పష్టం చేశారు. వచ్చే 2027-28 కేంద్ర బడ్జెట్ కంటే ముందుగా ఈ అంశంపై తుది నిర్ణయం ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా పరిశ్రమల సంఘాలు, మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన వివిధ సూచనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

సోమవారం ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో పన్ను చెల్లింపుదారుల లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా రవి అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ పెట్టుబడులపై ఎల్‌టీసీజీ పన్ను విధానాన్ని మరింత సరళీకరించాలని, పన్ను రేట్లు , మినహాయింపుల నిబంధనల్లో మార్పులు చేయాలని పెట్టుబడిదారులు, పరిశ్రమ వర్గాలు కొంతకాలంగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 2027-28 కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు, ఆదాయపు పన్ను రిఫండ్ల జారీ ప్రక్రియలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని రవి అగర్వాల్ తెలిపారు. గత ఏడాది రిఫండ్ల చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈసారి ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, గడువులను వేగవంతం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు సకాలంలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయపు పన్ను రిఫండ్ల మొత్తం ఏకంగా 25 శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు. రిటర్నుల పరిశీలన, రిఫండ్ల జారీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తగ్గించేందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందని వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు అంచనాల కంటే కొంత తక్కువగా ఉన్నాయని సీబీడీటీ ఛైర్మన్ అంగీకరించారు. అయినప్పటికీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.26.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు: business news