Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Editorial: ద్రవ్యోల్బణ నియంత్రణకు కొత్త ఆర్థిక విధానం అవసరం

Prajapaksham 14 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: ద్రవ్యోల్బణ నియంత్రణకు కొత్త ఆర్థిక విధానం అవసరం

RBI

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరిగినప్పుడు సాధారణంగా వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని, రుణాల ద్వారా జరిగే ఖర్చును తగ్గిస్తారు. తద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గి ధరల ఒత్తిడి సడలుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ప్రజల్లో కొనుగోలు ఆసక్తి పెరగడంకాదు. ఉత్పత్తి, రవాణా, ఇంధనం, ముడిసరుకుల సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు. ఇలాంటి సమస్యలకు వడ్డీ రేట్ల పెంపు పరిష్కారం చూపలేదు. పైగా ఆర్థిక కార్యకలాపాలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది.


ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. రష్యా- యుద్ధం ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువుల సరఫరాపై ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు రవాణా మార్గాల భద్రతపై అనిశ్చితిని పెంచాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైన సముద్ర మార్గాలు, జలసంధులు రాజకీయ ఆధిపత్య పోరులో సాధనాలుగా మారుతున్నాయి. సరఫరా గొలుసులను కొన్ని దేశాలు వ్యూహాత్మక ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయి. ఫలితంగా ఒక ప్రాంతంలో మొదలైన సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాల మార్కెట్లకు వ్యాపిస్తోంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే ఆహార పదార్థాలు, పారిశ్రామిక ఉత్పత్తులు సహా దాదాపు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కేవలం వడ్డీ రేట్లతో నియంత్రించాలనే ఆలోచన పూర్తి ఫలితాలను అందించలేకపోతున్నది.


వడ్డీ రేట్లు పెంచినంత మాత్రాన యుద్ధం ఆగదు. చమురు ఉత్పత్తి పెరగదు. ఓడల రాకపోకలకు అంతరాయం తొలగదు. ఎరువుల కొరత తీరదు. పంట దిగుబడులు పెరగవు. అయితే అధిక వడ్డీ రేట్లు గృహ రుణాలు, వ్యవసాయ రుణాలు, పరిశ్రమల పెట్టుబడులు, చిన్న వ్యాపారాల నిర్వహణ ఖర్చులను పెంచుతాయి. ఫలితంగా కొత్త పెట్టుబడులు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలు క్షీణిస్తాయి. ఉత్పత్తి సామర్థ్యం మరింత బలహీనపడవచ్చు. అంటే సరఫరా సమస్యతో పెరిగిన ధరలను నియంత్రించే ప్రయత్నంలోనే ఉత్పత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలా? వృద్ధిని కాపాడాలా? అన్నది ఆర్థిక విధాన రూపకర్తల ముందున్న సంక్లిష్టమైన ప్రశ్న. వాస్తవానికి ఈ రెండూ పరస్పర విరుద్ధ లక్ష్యాలుకావు. ధరల స్థిరత్వం లేకుండా ఆర్థిక వృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో ఉత్పత్తి, ఉపాధి, పెట్టుబడులను దెబ్బతీసి ధరలను తగ్గించే ప్రయత్నం కూడా దీర్ఘకాలిక పరిష్కారం కాదు. అందుకే ద్రవ్య విధానం, ఆర్థిక విధానం, వ్యవసాయ విధానం, వాణిజ్య విధానం పరస్పరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ద్రవ్యోల్బణ నియంత్రణకు కేంద్ర బ్యాంకుల బాధ్యతను తక్కువ అంచనా వేయలేం. ధరల పెరుగుదల ప్రజల అంచనాల్లో శాశ్వతంగా స్థిరపడకుండా చూడటం వాటి ప్రధాన కర్తవ్యం. అయితే ప్రతి ద్రవ్యోల్బణానికీ ఒకే ఔషధం పనిచేయదు. ప్రజల ఆదాయాలు పెరిగి వినియోగం అధికమైనప్పుడు వడ్డీ రేట్ల పెంపు కొంతవరకు ఫలితాన్నిస్తుంది. కానీ పంట దిగుబడి తగ్గడం, ఇంధన ధరలు పెరగడం, దిగుమతుల సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలకు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాలి. అవసరమైన వస్తువుల దిగుమతులను సులభతరం చేయడం, నిల్వలను విడుదల చేయడం, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ఉత్పత్తిదారులకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలు తక్షణ ఉపశమనాన్ని అందించగలవు.


ద్రవ్యోల్బణ లక్ష్యాల విషయంలోనూ ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. చాలా దేశాలు 2022 నుంచి తమ నిర్దేశిత ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించలేకపోతున్నాయి. విధానాల వైఫల్యంతోపాటు, దేశాల నియంత్రణ పరిధికి బయట ఉన్న అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇందుకు కారణం. అందువల్ల ద్రవ్యోల్బణ లక్ష్యాలను పూర్తిగా వదిలేయడం ఎంత ప్రమాదకరమో, వాటిని కఠినమైన గడులుగా భావించి ప్రతి పరిస్థితిలోనూ వడ్డీ రేట్లతోనే సాధించాలని ప్రయత్నించడం కూడా అంతే ప్రమాదకరం. లక్ష్యాల పట్ల నిబద్ధత కొనసాగుతూనే, అసాధారణ సరఫరా సంక్షోభాల సమయంలో తగిన వెసులుబాటు కల్పించాలి. అయితే ఆ వెసులుబాటు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ముసుగుగా మారకూడదు. ధరల పెరుగుదలకు కారణాలు, తీసుకుంటున్న చర్యలు, లక్ష్యాలను చేరుకునే అంచనా కాలం గురించి కేంద్ర బ్యాంకులు పారదర్శకంగా వివరించాలి. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఈ సమస్య మరింత ప్రధానం. ఆహార ద్రవ్యోల్బణం సామాన్య కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఆదాయంలో పెద్ద భాగాన్ని ఆహార అవసరాలకే ఖర్చు చేసే పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని కేవలం గ్రామీణ ఉపాధి రంగంగా కాకుండా దేశ ఆర్థిక భద్రతకు కీలకమైన రంగం గా పరిగణించాలి. వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా తీర్చిదిద్దాలంటే ప్రకటనలు సరిపోవు. సాగునీటి వసతులు, విత్తనాల నాణ్యత, ఎరువుల లభ్యత, పంటల నిల్వ సామర్థ్యం, శీతల గిడ్డంగులు, రవాణా, మార్కెట్‌ అనుసంధానం వంటి అంశాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. పంట కోత తర్వాత సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడంతో ప్రతి ఏటా పెద్ద మొత్తంలో ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మరోవైపు వినియోగదారుడు అధిక ధర చెల్లిస్తున్నాడు. ఈ మధ్యవర్తిత్వ లోపాలను సరిదిద్దకుండా ఆహార ద్రవ్యోల్బణాన్ని శాశ్వతంగా నియంత్రించడం సాధ్యం కాదు. కృత్రిమ మేధ, వలసలపై ఆంక్షలు సేవారంగ ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సేవారంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో ఉద్యోగాల సృష్టి మందగిస్తే యువత ఆదాయాలు, వినియోగ సామర్థ్యం దెబ్బతింటాయి. అందువల్ల వ్యవసాయంతోపాటు తయారీ రంగం, ఆహార ప్రాసెసింగ్‌, గ్రామీణ పరిశ్రమలు, ఆధునిక సేవారంగాల్లోనూ ఉపాధి అవకాశాలను విస్తరించాలి. సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాలి.


ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థను కేవలం వడ్డీ రేట్లతో నడపలేం. కేంద్ర బ్యాంకులు ధరల స్థిరత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వాలు సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. కీలక దిగుమతులపై అతిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ వనరులను అభివృద్ధి చేయాలి. అంతర్జాతీయ వాణిజ్య మార్గా ల్లో ఏర్పడే అంతరాయాలను ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. సరఫరా సంక్షోభాలు దీర్ఘకాలం కొనసాగనున్నాయనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక విధానాలు కూడా మారాలి. వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం అనే పరిమిత చర్చ నుంచి బయటకు వచ్చి ఉత్పత్తి, పంపిణీ, ఆహార భద్రత, ఉపాధి, ప్రజల కొనుగోలు శక్తిని ఒకే సమగ్ర విధానంలో చూడాలి. ధరల స్థిరత్వానికి నిజమైన పునాది బలమైన ఉత్పత్తి వ్యవస్థ,
సమర్థమైన సరఫరా గొలుసు, బాధ్యతాయుతమైన ప్రభుత్వ విధానాలే.

ట్యాగ్‌లు: editorial