ఒత్తిడికి గురవుతున్న ప్రజాస్వామ్యం
Protest
నంటూ బెనర్జీ
కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించిన భారీ నిరసనకు ప్రతిగా, ‘లోక్తంత్ర బచావో… అరాజకతా హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకత్వాన్ని తొలగించండి) అనే నినాదంతో అధికార బిజెపి ప్రజా ర్యాలీలు నిర్వహించడం ఆసక్తికరమైన పరిణామం. పెరుగుతున్న ప్రజా తిరుగుబాట్లు భారత్‌లోనేకాదు, యూరప్‌లోని పలు దేశాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలకు సవాలుగా మారుతున్నాయి. ప్రజాదరణను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, సమాజంలో విభజనలు సృష్టించడం వంటి చర్యల తో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కొంతమంది ప్రజాకర్షక నాయకులు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మన దేశంలో, గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ హయాంలో వేగంగా పెరుగుతున్న మత జాతీయవాదం
(హిందూత్వ) భారతదేశ చారిత్రక బహుళత్వానికి సవాలుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సుమారు 20కోట్ల జనాభా కలిగిన ముస్లింలు సహా, మైనారిటీలను పక్కనపెట్టడం లేదా లక్ష్యంగా చేసుకోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ అనుసరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల సమాజంలో విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఫ్రీడమ్ హౌస్, వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ వంటి అంతర్జాతీయ ప్రజాస్వామ్య పర్యవేక్షణ సంస్థలు భారతదేశ ప్రజాస్వామ్య స్థాయిని తగ్గించాయి. గతంలో ‘స్వేచ్ఛాయుత దేశం’ లేదా ‘సంపూర్ణ ప్రజాస్వామ్యం’ గా పేర్కొన్న భారతదేశాన్ని ఇప్పుడు ‘పాక్షిక స్వేచ్ఛాయుత దేశం’ లేదా ‘ఎన్నికల నిరంకుశత్వం’ వంటి వర్గాల్లో చేర్చాయి. పత్రికా స్వేచ్ఛపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేలా న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే ప్రయత్నాలు, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు, స్వతంత్ర పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలకు అవకాశాలు తగ్గడం వంటి అంశాలను తమ అంచనాలకు మూలాలుగా ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజాకర్షక నాయకులు ఎవరూ ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తామని బహిరంగంగా ప్రకటించి అధికారంలోకి రారు. అందుకు భిన్నంగా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తామని, అందరికీ సమాన అభివృద్ధి అందిస్తామని హామీ ఇస్తూ అధికారాన్ని చేపడతారు. అయితే, అందలం ఎక్కిన తర్వాత, క్రమంగా అధికారాన్ని కేంద్రీకరించి, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే వ్యవస్థలను బలహీనపరుస్తారు. యూరప్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా ఇటువంటి ప్రజాకర్షక నాయకుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సాధారణంగా తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, క్రమబద్ధమైన చర్చలు జరపడం, సంస్థాగత, విధానపరమైన సంస్కరణ లు చేపట్టడం వంటి చర్యల ద్వారా మధ్యంతర ప్రజా తిరుగుబాట్లను ఎదుర్కొంటాయి. అయితే, ప్రజల అసంతృప్తికి మూలకారణాలను పరిష్కరిస్తూనే, శాంతిభద్రతలను కాపాడటం, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది.
ప్రజా నిరసనలు ప్రాథమిక హక్కు. పనిచేసే ప్రజాస్వామ్యానికి అవి కీలకమైన భాగం. కానీ, ఈ కీలకమైన విషయాన్ని ఎన్నికైన ప్రభుత్వాలు తరచుగా మరచిపోతుంటాయి. ప్రభుత్వాలపై తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి, పాలకులను జవాబుదారీగా నిలబెట్టడానికి, విధానపరమైన మార్పులకు ప్రజా నిరసనలు తప్పనిసరి అవుతాయి. యూరప్‌లో రాజకీ య మార్పులపై జరిగిన పరిశోధనలు, హంగరీలో విక్టర్ ఓర్బన్ పాలన వంటి చారిత్రక, సమకాలీన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, ప్రజాకర్షక పాలకులు ప్రజాస్వామ్య పర్యవేక్షణకు అవసరమైన ప్రాథమిక హక్కుల పై దాడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటున్నాయి. ఇందులో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు లేదా రాజకీయ ఒత్తిడి, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడం, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కుపై పరిమితు లు విధించడం వంటి అంశాలు ఉన్నాయి. పక్షపాత మీడియా వ్యవస్థలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, వలసలు, ఆర్థిక అనిశ్చితి, ప్రజారోగ్య సంక్షోభాల చుట్టూ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో, యూరప్ ప్రజాస్వామ్యాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇవన్నీ బహుళత్వ ప్రజాస్వామ్య విలువల సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని పరీక్షిస్తాయి. యూరోప్, భారత దేశాల్లో ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలు, విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మధ్య సారూప్యత కనిపిస్తున్నది. రెంటిలోనూ ప్రజాకర్షక నాయకు లు అనుసరించే రాజకీయ పద్ధతుల్లో అనేక పోలికలు ఉన్నాయి. ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్థులను చట్టబద్ధమైన ప్రత్యామ్నాయాలుగా కాకుండా శత్రువులుగా చూస్తున్నాయి. వారిని ‘ప్రజల శత్రువులు’ లేదా దేశ భద్రతకు ముప్పుగా చిత్రీకరిస్తున్నాయి. అటు యూరోప్‌లో, ఇటు భారత్‌లో ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ల బాహ్య రూపాన్ని కొనసాగిస్తూనే, కార్యనిర్వాహక అధికారాన్ని నియంత్రించే స్వతంత్ర సంస్థలు, న్యాయస్థానాలు, పర్యవేక్షణ సంస్థల స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయి. బలహీనపరుస్తున్నాయి. న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలకు వివిధ పౌరసమాజ సంస్థలు మద్దతు తెలిపాయి. ఈ ప్రదర్శనలు సంస్థల స్వతంత్రత, ఎన్నికల సంఘం, ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపై కొనసాగుతున్న ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో నెలకొన్న లోతైన ఆందోళనతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న చైతన్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. శాంతియుత నిరసనలు అధికారంపై కీలకమైన నియంత్రణగా పనిచేస్తాయి. ఎన్నికల రోజు వచ్చే వరకు వేచి చూడకుండా, అణగారిన వర్గాలు, మైనారిటీలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, యువత ఆధ్వర్యంలోని వీధి నిరసనలు, మారుతున్న ఎన్నికల పరిస్థితుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రభుత్వాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కార్మికవర్గంలో అసంతృప్తికి అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, అందుబాటులో లేని గృహాలు, నిరుద్యోగం, తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు ప్రధాన కారణాలు. అనేక ప్రజాస్వామ్య దేశాల్లో అధికారమంతా తమకు జవాబుదారీగా ఉందని పాలకవర్గం లేదా పెద్ద సాంకేతిక సంస్థ ల చేతుల్లోనే ఉందని పౌరులు భావిస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతోంది. అనేక దేశాల్లో స్వతంత్ర తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు, ఎన్నికల నియమాలు, పౌర హక్కులు ప్రమాదం లో పడుతున్నాయి. యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, బెల్జియం, పోర్చుగల్, గ్రీస్, అల్బేనియా వంటి దేశాల్లో యువత నేతృత్వంలో నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాలపై యువత ఒత్తిడి తెస్తోంది. బ్రెజిల్, సెర్బియా వంటి దేశాల్లో ఇటీవల జరిగిన కీలక ఎన్నికలు కూడా రాజకీయం గా విభాజితమైన ఓటర్ల వైఖరిని ప్రతిబింబించాయి. అధికారంలో ఉన్న నాయకత్వానికి, ప్రజాస్వామ్య విలువలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా సాగుతున్న రాజకీయ ప్రయత్నాలు ఈ ఎన్నిక ల్లో స్పష్టమయ్యాయి.
భారతదేశంలో ఈ పరిణామాలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఒక పెద్ద ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. ఎన్నికల జాబితాల్లో మార్పులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రంలోని అధికార ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలపై ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) అనే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అమలు చేసింది. ఈ ప్రక్రియలో 13 కోట్లకు పైగా పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. అభిజీత్ దీప్కే నాయకత్వంలోని ‘కాక్రోచ్ మూమెంట్’ వంటి విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వంలోని లద్ధాఖ్ ఉద్యమం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులు ఈ తొలగింపులపై అభ్యంతరా లు వ్యక్తం చేస్తున్నారు. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రక్రియ ద్వారా అణగారిన వర్గా లు, మైనారిటీలు, ఇతర అంచున ఉన్న ప్రజల ఓటు హక్కును అసమానంగా తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాల అధికారులు మాత్రం నకిలీ లేదా నకిలీగా నమోదైన లేదా మరణించిన ఓటర్ల పేర్లను తొలగించినట్టు చెప్తున్నారు. ఓటర్ల సమాచారాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఈ ప్రక్రియ అవసరమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రతిదాడికి దిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. ‘సర్’కు వ్యతిరేకంగా ‘ఓట్ బచావో’ (ఓటును కాపాడండి) ఉద్యమం చేయాల్సిన ప్రతిపక్షాలు, వాస్తవానికి ‘ఘుస్పేటియా బచావో’ (చొరబాటుదారులను కాపాడండి) ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కోల్‌కతాలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి భారీ ర్యాలీకి నాయకత్వం వహించారు. ఎన్నికల పారదర్శకతపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను సవాలు చేస్తూ ఈ ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా నిరసనలు ఒక కీలకమైన భద్రతా కవచంగా, ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచే సాధనం గా పనిచేస్తాయనే విషయాన్ని ఎన్నికైన ప్రభుత్వాలు దురదృష్టవశాత్తూ మరచిపోతున్నాయి.
ప్రజలు నిర్వహిస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం స్వయంగా ఎదురుదాడి ర్యాలీలను నిర్వహించినప్పుడు లేదా వాటికి మద్దతు ఇచ్చినప్పుడు, అది తన అధికారాన్ని, ప్రతిష్ఠను పెంచుకోవడాని కి ప్రయత్నించడంగా, ప్రజాస్వామ్య విలువల నుంచి వెనక్కి తగ్గడంగా, అసమ్మతిని అణచివేయడంగా పరిగణించాల్సి ఉంటుంది.