Skip to content
ప్రపంచం › వార్తలు

Doomsday Prediction Explained: నవంబర్ 13న ప్రపంచం అంతం కానుందా? 1960 నాటి డూమ్స్‌డే అంచనాల వెనుక అసలు నిజం ఇదే..

jagan 10 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Doomsday Prediction Explained: నవంబర్ 13న ప్రపంచం అంతం కానుందా? 1960 నాటి డూమ్స్‌డే అంచనాల వెనుక అసలు నిజం ఇదే..

Doomsday Prediction Explained

Doomsday Prediction Explained: మూడు రోజుల్లో ప్రపంచం అంతం కాబోతున్నదా? 1960 నాటి జోస్యం నిజమవుతుందా? అనే అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, చర్చా వేదికల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు జనాభా విస్ఫోటనం, మరోవైపు అంతరిక్షం నుంచి ముప్పు ఉందంటూ వస్తున్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఈ జోస్యం వెనుక ఉన్న నేపథ్యం ఏమిటనేది పరిశీలిస్తే స్పష్టత వస్తుంది.

1960వ దశకంలో జనాభా విపరీతంగా పెరిగిపోతే ప్రజలకు తగినంత ఆహారాన్ని అందించే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగవని, ఆకలి చావులు భారీగా పెరుగుతాయని కొందరు శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ‘సైన్స్’ జర్నల్‌లో “డూమ్స్‌డే : ఫ్రైడే 13 నవంబర్‌ 2026” అనే శీర్షికతో ఒక సంచలనాత్మక వ్యాసం ప్రచురితమైంది. ప్రొఫెసర్‌ హీంజ్‌ వోన్‌ ఫోర్‌స్టెర్‌ బృందం ఆ కాలంలో రూపొందించిన గణిత సూత్రాల ఆధారంగా.. సరిగ్గా 2026 నవంబర్‌ 13 నాటికి మానవ జనాభా అంతులేని స్థాయికి చేరి భూమిపై మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అంచనా వేశారు. అయితే జనాభా ఎంత వేగంగా పెరిగినప్పటికీ, దానికి సమాంతరంగా ఫుడ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సైన్స్ కూడా అదే వేగంతో అభివృద్ధి చెందుతాయని ఫోర్‌స్టెర్‌ వాదించారు.

మరోవైపు, గణిత శాస్త్రవేత్తల అంచనాలకు భిన్నంగా జియాలజిస్ట్ డాక్టర్‌ మైఖేల్‌ టెక్లా మరో భయానక వాదనను తెరపైకి తెచ్చారు. 2026 నవంబర్ 13న సూర్యుడి నుంచి మునుపెన్నడూ లేనంత తీవ్రమైన శక్తి విడుదలవుతుందని, దీనివల్ల భూమి అయస్కాంత క్షేత్రంలో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన విధ్వంసం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ రెండు భిన్న వాదనలు ప్రస్తుతం నవంబర్ 13 మునుపు మరోసారి వైరల్ కావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

భయపడాల్సిన అవసరం లేదెందుకు? (3 ప్రధాన కారణాలు):

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ ‘డూమ్స్‌డే’ తేదీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆధునిక శాస్త్రవేత్తలు, ఖగోళ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు ఉన్నాయి.

మొదటిది, ప్రొఫెసర్‌ హీంజ్‌ వోన్‌ ఫోర్‌స్టెర్‌ చేసిన అంచనా కేవలం ఒక సైద్ధాంతిక గణిత సూత్రంపై ఆధారపడిందే తప్ప, భౌతిక వాస్తవాలకు అద్దం పట్టదు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో ఆహార ఉత్పత్తిలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఆకలి చావులు ప్రపంచాన్ని ముంచెత్తుతాయనే భయాలు నిరాధారమని తేలింది.

రెండోది, డాక్టర్‌ మైఖేల్‌ చెప్పిన సౌర విస్ఫోటనాల సిద్ధాంతంలో శాస్త్రీయ లోపాలు చాలా ఉన్నాయి. సూర్యుడిలో తరచూ సోలార్ ఫ్ేర్లు, అసాధారణ కార్యకలాపాలు జరగడం సహజమే అయినప్పటికీ, కేవలం ఒక్క రోజులో మొత్తం భూగోళాన్ని సర్వనాశనం చేసే స్థాయిలో అవి ప్రమాదకరంగా మారడం అసాధ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు.

మూడోది, ఆధునిక సాంకేతిక యుగంలో అంతరిక్షాన్ని, సూర్యుడి కదలికలను వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఉపగ్రహాల (Satellites) ద్వారా నిరంతరం అత్యంత నిశితంగా పర్యవేసిస్తూనే ఉన్నారు. భూమికి పెను ముప్పు వాటిల్లేలా ఏదైనా అసాధారణ ఖగోళ సంఘటన జరగబోతుంటే దానిని చాలా ముందే గుర్తించే అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఇలాంటి వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.