Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఆసక్తిదాయకంగా అమెరికా మధ్యంతర ఎన్నికలు

Prajapaksham 28 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఆసక్తిదాయకంగా అమెరికా మధ్యంతర ఎన్నికలు

Editorial: విశిష్ట సాహిత్య ధోరణి ‘మేజిక్‌ రియలిజం’

నవంబర్‌ 3. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌కు మధ్యంతర ఎన్నికలు. సర్వసాధారణంగా పాలకపార్టీకి అనుకూలంగా ఉండే ఈ ఎన్నికలు ఈ పర్యాయం డోనాల్డ్‌ ట్రంప్‌ పాలన పుణ్యమా అని అనేక అనిశ్చితులతో మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఈ చివరివారం ప్రచారం ఉధృతస్థాయికి చేరుతోంది. ఒకవైపు రిపబ్లికన్‌ల తరఫున అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నగర యాత్రలతో పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేస్తుండగా, రెండోవైపున ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ నేతలు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తీరుపట్ల ముఖ్యంగా నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం పట్ల ప్రజల్లోని అసంతృప్తిని కాంగ్రెస్‌పై అజమాయిషీ సాధించే నిమిత్తం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల నవంబర్‌ 3ఎన్నికలు ప్రతినిధుల సభపై నియంత్రణతోపాటు సెనేట్‌ (ఎగువసభ మూడవ వంతు సీట్లకు ఎన్నికలు)లో ఆశ్చర్యకరమైన మార్పుకు దారితీయవచ్చు. సెనేట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్‌లకు 53 మెజారిటీ ఉంది. అధ్యక్ష పదవి, రెండు కాంగ్రెస్‌ ఛాంబర్లు రిపబ్లికన్‌ల చేతిలో ఉన్నందున పరిపాలనపై వారిదే ఆధిపత్యం. ప్రభుత్వంపై ఇతోధిక నియంత్రణకు మధ్యంతర ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయని, దాన్ని ఓటర్లు ఉపయోగించుకుంటే ట్రంప్‌ మిగతా రెండేళ్ల పదవీకాలాన్ని కొంత నియంత్రణలో ఉంచ వచ్చని డెమొక్రాట్లు ప్రచారం చేస్తున్నారు.
ఆర్థికంగా ఉన్న అసంతృప్తి డెమొక్రాట్లకు అనుకూల ఓటుగా మారుతుందా? లేక రిపబ్లికన్‌ల అజమాయిషీని నిలుపుకునేందుకై ట్రంప్‌ తన మద్దతుదారులను తగినంతగా సమీకరించగలరా? అన్నది ప్రధానమైన ప్రశ్న. ట్రంప్‌గాని, పూర్వాధ్యక్షుడు బరాక్‌ ఒబామా గాని బ్యాలెట్‌ పేపర్‌లో లేరు. అయినా తమ రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ అభ్యర్థుల విజయం కోసం దేశం నాల్గు చెరగులా సంచారం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో ఎన్నికల నిర్ణీత తేదీకన్నా చాలారోజుల ముందునుంచే నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు చేసే వెసులుబాటు ఉంది. అసోసియేటెడ్‌ ప్రెస్‌ రిపోర్టు ప్రకారం అక్టోబర్‌ 26వ తేదీనాటికి 3కోట్లమందికి పైగా తమ బ్యాలెట్లు వేశారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో దాదాపు అదే సమయానికి 90 లక్షల ఓట్లు మాత్రమే పోలైనాయంటే, ట్రంప్‌ దుందుడుకు విధానాల కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో పెరిగిన ఆసక్తిని ప్రస్తుత ముందస్తు ఓటింగ్‌ ప్రతిబింబిస్తున్నది. టెక్సస్‌, కన్సాస్‌, ఓహియో, మయానె, నార్త్‌ కరోలినా తదితర రాష్ట్రాల్లో సెనేట్‌ పోటీలు పోటాపోటీగా ఉండటం కూడా ముందస్తు ఓటు పెరుగుదలకు హేతువవుతున్నది.
2024లో అధ్యక్ష ఎన్నికల్లో 155 మిలియన్‌ ఓటర్లు ఓటు చేశారు. ప్రస్తుత మధ్యంతర ఎన్నికల్లో 2022లో వలె 100మిలియన్‌లకుపైగా ఓటు చేయవచ్చని అంచనా. ఎన్నికల తేదీ సమీపించే కొలది జీవన వ్యయం పెరుగుదల ప్రధాన సమస్యగా ముందుకు వస్తున్నది. వంటింటి సరుకులు, ఇంటి అద్దెలు, ఇంధనం, హీటింగ్‌ (చలిని తట్టుకునేందుకు ఇళ్లలోపల వేడి పెంపుదల) ఖర్చులు ఇక రోజువారీ ఖర్చులు, సామాన్యులు భరించలేనివిగా తయారైనాయి. ఈ పరిస్థితులకు ట్రంప్‌ సుంకాల విధింపులు, ఇరాన్‌తో యుద్ధం ప్రధాన కారణాలు. డీజిలు భారం తగ్గించేందుకే ట్రంప్‌ రష్యాపై ఆంక్షలు సడలించి దిగుమతికి సిద్ధపడ్డాడు. కాగా తన చర్యలన్నీ అమెరికన్‌లకు మెరుగైన భవిష్యత్‌ కోసమేనని, కొంతకాలం ప్రజలు ఓర్మి వహించాలని ట్రంప్‌
విజ్ఞప్తులు చేస్తున్నాడు.
అమెరికన్‌ కాంగ్రెస్‌ ఎన్నికల్లో ధన వ్యయం అపారం. అభ్యర్థులు, పార్టీ కమిటీలు, సూపర్‌ పిఎసిలు, ఇతర రాజకీయ సంస్థలు టెలివిజన్‌ అడ్వర్టయిజింగ్‌, డిజిటల్‌ ప్రచారం, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, ఓటర్ల సమీకరణకు ఖర్చు పెట్టటంలో పోటీపడతాయి. ముఖ్యంగా సెనేట్‌ పోటీలు పోటాపోటీగా ఉన్నచోట్ల ధనం వెచ్చింపు మరీ ఎక్కువ. కొద్దిపాటి నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేయటానికి అభ్యర్థుల ప్రత్యక్ష ప్రచారం, టెలివిజన్‌ చర్చలు, భారీగా అడ్వర్టయిజ్‌మెంట్‌ ప్రచారానికి విరివిగా వెచ్చిస్తారు.
ఎన్నికల చివరి రోజులు మరీ కీలకం. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయటానికి ఓటర్లలో ఆసక్తిని రేకిత్తించటానికే ఎన్నికల ప్రచారాలు, విధానాలపై వాదోపవాదాల ప్రయోజనం. ఈసారి ఓటింగ్‌ శాతం పెరుగుతుందేమో వేచిచూడాలి. ద్రవ్యోల్బణం ఆందోళనలు, సుంకాలు, ఇంధన వ్యయం, కాంగ్రెస్‌పై కంట్రోలు సమస్యలుగా ముందుకు వచ్చిన పరిస్థితుల్లో ఈ ఎన్నికల పర్యవసానాలు వ్యక్తిగత అభ్యర్థులను మించి ఉంటాయి. ఈ ఫలితాలు శాసన ప్రాధాన్యతలు, పరిపాలనపై పర్యవేక్షణ, ధరలపై అదుపు వంటి ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే అంశాలతోపాటు, 2028 అధ్యక్ష ఎన్నికలకు రాజకీయ బలాబలాలపై కూడా ప్రభావం చూపుతాయి. అందువల్లనే రెండు పార్టీలు ఎన్నికల ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అమెరికాలో రాష్ట్రాలు రిపబ్లికన్‌(రెడ్‌), డెమొక్రాట్లు(బ్లూ) ప్లేట్స్‌గా రాజకీయంగా విడివడి ఉంటాయి. ఐదారు రాష్ట్రాలే స్వింగ్‌ స్టేట్స్‌గా అటు ఇటు మారుతూ ఎన్నికల అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తుంటాయి. రెండు పార్టీల కేంద్రీకరణ వాటిపైనే.