ఆదర్శ కుటుంబం’త్రివిక్రమ్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది: చిట్ చాట్ లో కథానాయిక శ్రీనిధి శెట్టి
Sri Nidhi Setti
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. దీపావళి వెలుగులను కాస్త ముందుగానే తీసుకొస్తూ అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక శ్రీనిధి శెట్టి, మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక నాకు ముందు నుంచి ఉంది. అలాంటిది ఆయన నుంచి పిలుపు రావడం సంతోషంగా అనిపించింది. పైగా ఇది త్రివిక్రమ్ కి, వెంకటేష్ కి కూడా కొత్త జానర్. త్రివిక్రమ్ గారి ఫిల్మోగ్రఫీని గమనిస్తే, ఆయన సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ఆదర్శ కుటుంబం’ ఉంటుంది. అందుకే కథ వినగానే ఈ చిత్రంలో ఖచ్చితంగా భాగం కావాలి అనుకున్నాను.నాది అమ్మ పాత్ర అయినప్పటికీ, సినిమాకి నో చెబుదామనే ఆలోచన ఒక్క క్షణం కూడా కలగలేదు. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి. అసలు త్రివిక్రమ్ , వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ఎంతో స్పెషల్. అలాంటిది వారి కాంబినేషన్ లో ఇంత మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం.
త్రివిక్రమ్ చెప్పినట్లు ఇది క్రైమ్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ ఉంటుంది. నేను మొదటిసారి కామెడీ పాత్ర చేశాను. నేను చిట్ ఫండ్ లో డబ్బులు పోగొడతాను. మొత్తం అప్పులు చేసేస్తాను. ఇప్పటిదాకా ఈ తరహా పాత్రలు చేయకపోవడంతో ఎలా చేస్తాననే సందేహం మొదట కాస్త కలిగినా.. అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది.
త్రివిక్రమ్ డైలాగుల్లో ఎంతో భావం ఉంటుంది. అందుకే ప్రతి డైలాగ్ నేను చెప్పేముందు దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశాను. సినిమాలో ఎన్నో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. రైటింగ్ లో ఆయన మ్యాజిక్ కనిపిస్తుంది. ట్రైలర్ లోని “చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?” అనే డైలాగ్ అయితే నాకు మాత్రమే కాదు, అందరికీ ఎంతగానో నచ్చింది.
ఒక సినిమాపై ఏడాదిన్నర కష్టపడి, అవుట్ పుట్ ను ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు, కంగారుపడి విడుదల చేసే కంటే కాస్త ఆలస్యంగా రావడంలో తప్పులేదు. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ గారు కూడా చెప్పారు. మెరుగైన అవుట్ పుట్ కోసమే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30 కి విడుదల తేదీ మార్చడం జరిగింది. ఈ మూడు వారాల సమయం వల్ల ఆదర్శ కుటుంబం మరింత అందంగా మారింది.కంటెంట్ పరంగా నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ‘ఆదర్శ కుటుంబం’ కూడా నా మనసుకి నచ్చి ఎంపిక చేసుకున్న సినిమానే. అయితే నేను చేస్తున్న పెద్ద సినిమాలు ఏడాది రెండేళ్లు సమయం తీసుకుంటున్నాయి. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నాను అనిపిస్తుంది. ‘ఆదర్శ కుటుంబం’ కూడా 2025 జూలైలో జాయిన్ అయ్యాను. సంవత్సరం దాటి పోయింది.
వెంకటేష్ అద్భుతమైన నటుడు. కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ కానీ గొప్పగా ఉంటుంది. ఆయనను మ్యాచ్ చేయడం అనేది సాధ్యం కాదు. కానీ, నా వంతుగా ప్రయత్నించాను. ముఖ్యంగా త్రివిక్రమ్ సూచనలతో కామెడీ సన్నివేశాల్లో సహజంగా నటించడానికి ట్రై చేశాను. త్రివిక్రమ్ రైటింగ్, వెంకటేష్ యాక్టింగ్ కలిస్తే కామెడీ ఎంతో సహజంగా ఉంటుంది. ఆ సహజత్వంలో నేను ఇమిడిపోయే ప్రయత్నం చేశాను. ఆదర్శ కుటుంబం సినిమా ఎలా ఉంటుంది అనేది నాకు ముందే తెలుసు. షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా చూసినప్పుడు అంతకుమించిన ఆనందం కలిగింది.ఎక్కువగా కామెడీ ఉంటుంది. యాక్షన్ ఎంత మోతాదులో ఉందనేది మీకు చూశాక తెలుస్తుంది. కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తారో, యాక్షన్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది.
త్రివిక్రమ్ ఎంత గొప్ప దర్శకుడు, ఆయన ఎన్ని గొప్ప సినిమాలు ఇచ్చారనేది నాకు ముందే తెలుసు. అయితే త్రివిక్రమ్ ని కలిసిన తర్వాత ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి తెలిసింది. త్రివిక్రమ్ మాట్లాడుతుంటే అందరూ ఎందుకు అలా వింటూ ఉండిపోతారో అర్థమైంది. అంత సీనియర్ దర్శకుడైనా సరే సినిమా కోసం చర్చించడానికి ఎప్పుడూ ముందుంటారు. సెట్ లో మంచి వాతావరణం ఉండేలా చూస్తారు. నటీనటులకు కంఫర్ట్ ఇస్తారు.ఈ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటీనటులకు ఎంతో సపోర్టుగా నిలుస్తారు. ఏడాదికి పైగా సాగిన ఈ మూవీ ప్రయాణం ఎంతో బాగుంది. ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.