YS Jagan: షర్మిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ.. అంజలి పెళ్లి వేదికపై అన్నగా నా ఆవేదన అర్థం చేసుకో…
YS Jagan Press Meet
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేదిక విషయంలో ఇరువురి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. తన కుమార్తె పెళ్లిని బెంగళూరులోని సోదరుడు వైఎస్ జగన్ నివాసంలో నిర్వహించాలని షర్మిల భావిస్తుండగా, భద్రతా కారణాలతో అందుకు జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాలను వివరిస్తూ సోదరి షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నవంబర్ 25న అంజలి రెడ్డి వివాహం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం 2026 నవంబర్ 25న జరగనుంది. ఈ వివాహ వేడుకను ఎక్కడ నిర్వహించాలనే అంశం ఇప్పుడు వివాదానికి కారణమైంది. బెంగళూరులోని తన సోదరుడు వైఎస్ జగన్ నివాసంలో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, తన నివాస ప్రాంగణంలో వివాహం నిర్వహించడం వల్ల భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా షర్మిలకు తెలియజేసినట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
అక్టోబర్ 9నే షర్మిలకు లేఖ రాసిన జగన్
తన నివాసంలో మేనకోడలి వివాహాన్ని నిర్వహించేందుకు ఎందుకు అంగీకరించడం లేదో వివరిస్తూ వైఎస్ జగన్ 2026 అక్టోబర్ 9న షర్మిలకు లేఖ రాశారు. అయితే, ఈ లేఖను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 24, శనివారం విడుదల చేసింది.
సోదరి కుమార్తె వివాహానికి జగన్ అడ్డుపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపించిన నేపథ్యంలో ఈ లేఖను బయటపెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ జగన్ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
భద్రత, గోప్యతే ప్రధాన కారణమన్న జగన్
వివాహం వంటి పెద్ద కార్యక్రమాన్ని తన నివాసంలో నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో వ్యక్తులు ప్రాంగణంలోకి రావాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు. క్యాటరింగ్ సిబ్బంది, పూల అలంకరణ బృందాలు, డెకరేషన్ సిబ్బంది, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా అనేక మంది రాకపోకలు సాగిస్తారని వివరించారు.
వారిలో చాలామంది తమకు పరిచయం లేని వ్యక్తులేనని, ఇంతమంది రాకపోకల వల్ల నివాస ప్రాంగణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తన కుటుంబ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందులు తలెత్తవచ్చని తెలిపారు.
అంజలి తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఆమె జీవితంలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు. అయితే, కుటుంబ భద్రత విషయంలో రాజీ పడలేనని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ వేదికను సూచించిన జగన్
బెంగళూరులోని తన నివాసంలో వివాహం నిర్వహించడానికి అంగీకరించకపోయినప్పటికీ, పెళ్లి కార్యక్రమానికి సహకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించినట్లు జగన్ తన లేఖలో తెలిపారు.
రాజా వివాహం నిర్వహించిన తరహాలో కన్వెన్షన్ సెంటర్‌లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో పెళ్లి జరిపించుకోవచ్చని సూచించారు. ఆ ప్రతిపాదనలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని తన లోటస్ పాండ్ ఆస్తిని ఉపయోగించుకోవచ్చని కూడా తెలిపారు.
అంజలి వివాహం ఆమె జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగలాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూనే, తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు.
షర్మిలకు జగన్ రాసిన లేఖ యథాతథంగా..
‘‘అంజిలి పెళ్లి గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ ఆమె జీవితాంతం సంతోషంగా ప్రేమానురాగాలతో జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నా అభ్యంతరాలను పట్టించుకోకుండా, బెంగళూరులోని నా నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని నువ్వు ఇప్పటికీ భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశాను.
పెళ్లి వంటి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంగణంలోకి వస్తారనే విషయాన్ని దయచేసి అర్ధం చేసుకో. వివిధ రకాల సేవలు అందించేవారు. క్యాటరింగ్ సిబ్బంది. పూల అలంకరణలు చేసే బృందాలు, డెకరేషన్ సిబ్బంది, ఈవెంట్ మేనేజ్ మెంట్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు. అతిథులు ఇలా ఎంతోమంది ఆ ప్రాంగణంలోకి వస్తారు.
వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే. ఇంతమంది వ్యక్తులు ఆ ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం నివాస ప్రాంగణానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వెళ్లి ప్రచారంలోకి రావడం తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది.
దయచేసి ఒక విషయం తెలుసుకో. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాలేదు. జిలీ చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని నేను చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ, భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను. హర్ష లేదా వర్ష పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని.
ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది. దానితోపాటు భద్రతాపరమైన ఆందోళనలు కూడా తలెత్తుతాయి. చివరకు ఇది నా ఇల్లు, ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను.
వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు సంబంధించిన వాస్తవమైన ముప్పులను వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేసినప్పటికీ నా అభ్యంతరాలను ఆందోళనలను పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్లడం నన్ను బాధించింది. అందువల్ల ఈ విషయంలో నా పరిస్థితిని, నా అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని, పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను.
రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ పెళ్లి నిర్వహించడం నీకు ఇష్టం లేకపోతే, హైదరాబాద్ లోని నా లోటస్ పాండ్ ఆస్తిని ఉపయోగించుకోవడానికి కూడా నేను అవకాశం ఇచ్చాను. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది. జిలీ పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని, భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అయితే ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’’ అని లేఖలో జగన్ పేర్కొన్నారు.
మరోసారి చర్చనీయాంశంగా జగన్, షర్మిల విభేదాలు
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అంజలి రెడ్డి వివాహ వేదిక అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు తన నివాసంలో వివాహం నిర్వహించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు వస్తాయని జగన్ చెబుతుండగా, మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.
అయితే, వివాహ వేదికపై తుది నిర్ణయం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అంజలి రెడ్డి వివాహం నవంబర్ 25న జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం ఎలా ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.