SBI Data Breach: ఎస్బీఐ కస్టమర్ల డేటా లీక్.. డార్క్ వెబ్‌లో 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు.. అధికారికంగా ధ్రువీకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
Banking Giant SBI Agrees to Shift to Alternative Location
SBI Data Breach: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సైబర్ దాడికి గురైంది. తమ బ్యాంక్‌కు చెందిన కొంతమంది వినియోగదారుల వ్యక్తిగత ముఖ్యాంశాలు , సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైనట్లు ఎస్బీఐ అధికారికంగా ధ్రువీకరించింది. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ (DCyA), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)లతో పాటు త్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి అందిన సమాచారం ఆధారంగా బ్యాంక్ అంతర్గత తనిఖీలు చేపట్టింది. ప్రాథమిక విచారణలో డార్క్ వెబ్‌లో ప్రచారంలో ఉన్న డేటా సమాచారంలో సుమారు 3,897 మంది కస్టమర్లకు సంబంధించిన పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ (PII) ఉన్నట్లు గుర్తించామని స్టాక్ ఎక్స్ఛేంజీల దాఖలు చేసిన నివేదికలో ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఈ లీకైన సమాచారంలో వినియోగదారుల పేర్లు, నమోదిత మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ చిరునామాలు, నివాస చిరునామాలు, జెండర్ వివరాలతో పాటు బ్యాంక్ బ్రాంచ్ వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (CIF) ఐడీలు, లీడ్ ఐడీలు , రుణ నమోదుకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు తేలింది. కాగా, గతంలో డార్క్ వెబ్‌లోని ‘బ్రీచ్ఫోరమ్స్’ అనే వేదికపై ‘సిరియస్సిమ్’ అనే హ్యాకర్ గ్రూప్ సుమారు 3.75 లక్షల మంది ఎస్బీఐ కస్టమర్ల సమాచారం తమ వద్ద ఉందంటూ దావా వేసింది. అయితే ఈ రికార్డులను క్షుణ్ణంగా విశ్లేషించిన పిమ్మట 3,897 మంది సమాచారం మాత్రమే వ్యక్తిగతంగా బహిర్గతమైనట్లు బ్యాంక్ ప్రాథమికంగా గుర్తించింది.
డేటా చోరీ ఘటనపై ఎస్బీఐ తక్షణమే స్పందించి ప్రత్యేక సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను పునరుద్ధరించింది. CERT-In ఎంప్యానెల్ చేసిన ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సేవలను వినియోగించుకుని ఈ డేటా అసలు మూలం ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ నుంచి లీకైంది , వినియోగదారులపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండనుందనే అంశాలపై లోతైన దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటన తమ ప్రధాన బ్యాంకింగ్ సేవలపై, ఆర్థిక స్థితిగతులపై లేదా రోజువారీ లావాదేవీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని, కస్టమర్ల కోర్ బ్యాంకింగ్ డేటా సురక్షితంగా ఉంటూ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో సైబర్ దాడులు రోజురోజుకూ పెరుగుతుండటం, గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 1 TB డేటా లీక్ కావడం వంటి సంఘటనలు చోటుచేసుకోవడం కస్టమర్ల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కస్టమర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిళ్లు లేదా లింక్‌లపై స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. మీ బ్యాంకింగ్ ఓటీపీ, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని, మోసపూరిత కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.