Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి బిగ్ బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు వైసీపీదేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధీమా..

jagan 21 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి బిగ్ బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు వైసీపీదేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధీమా..

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వివాదంపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు తమ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని.. పార్టీకి ఎంతో పెద్ద బూస్ట్‌గా నిలిచాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో, హింస చోటుచేసుకున్న 19 మున్సిపాలిటీలలో తమ పార్టీ అభ్యర్థులు పూర్తిస్థాయిలో పోటీ చేసి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో వైసీపీ అభ్యర్థులు అధికార పార్టీ , పోలీసుల నుంచి తీవ్రమైన ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించకుండా భౌతికంగా అడ్డుకోవడం, కేంద్రాల వద్ద తీవ్ర గందరగోళం సృష్టించడం, అభ్యర్థుల వాహనాలను ధ్వంసం చేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అదే సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు అత్యంత సులభంగా నామినేషన్లు వేసేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బాధితులైన వైసీపీ నేతలు, కార్యకర్తలపైనే రివర్స్ కేసులు నమోదు చేస్తూ, నోటీసులు జారీ చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని ఏకంగా ఐదు కేసుల్లో ఏ-1గా చేర్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తమ పార్టీ విజయపరంపరను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కల్పించిన జోక్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇకనైనా కన్నులు తెరిచి సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియను అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోటీ చేసే అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.