Kondapochamma Sagar Water Row: కొండపోచమ్మ సాగర్ అంశంపై కాంగ్రెస్ నేతలకు BRS లీగల్ నోటీసులు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై తప్పుడు ప్రచారం ఆపాలని హెచ్చరిక..
Mahesh Kumar Goud Says Congress Will Win 100 Seats in Next Elections
Kondapochamma Sagar Water Row: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ జలాశయం నీటిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు అక్రమంగా మళ్లించారంటూ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణపై ముగ్గురు కీలక కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు ఈ లీగల్ నోటీసులు పంపినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులను జారీ చేశారు.
ఈ సందర్భంగా సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించిన కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసే లక్ష్యంతోనే కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే అంశంపై కొద్దిరోజుల క్రితం నిజాలను పక్కనబెట్టి నిరాధార వార్తలను ప్రచురించిన ‘వెలుగు’ దినపత్రిక యాజమాన్యానికి , ఎడిటర్‌కు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లు గుర్తుచేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు అదే అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో , బహిరంగ వేదికలపై కొనసాగిస్తుండటంతో చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపునకు సంబంధించి తమ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన అన్ని పోస్టులు, వీడియోలు , వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా తొలగించాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసుల్లో స్పష్టంగా డిమాండ్ చేసింది. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల పనితీరుపై ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలను ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించింది.
తమ నోటీసులకు తక్షణమే స్పందించి తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావాతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) , సమాచార సాంకేతిక (IT) చట్టాల ప్రకారం తదుపరి కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్ సెల్ ప్రతినిధులు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.