Skip to content
తెలంగాణ › వార్తలు

El Niño Effect: 20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్.. కరెంట్, నీటిని పొదుపుగా వాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
El Niño Effect: 20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్.. కరెంట్, నీటిని పొదుపుగా వాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

bhatti-vikramarka

El Niño Effect: తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో (El Niño) తీవ్ర ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలందరూ విద్యుత్తు , నీటిని అత్యంత బాధ్యతాయుతంగా, పొదుపుగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మారుతున్న భూతాపం , శీతోష్ణస్థితి సవాళ్లకు అనుగుణంగా మన సహజ వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌ మేకర్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు, నగదు బహుమతులను అందజేశారు.

ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పండుగల వేళ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత శీతోష్ణస్థితి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో చలి తీవ్రత అధికంగా ఉండి ప్రజలు వెచ్చదనం కోసం వెతుక్కునే వారని, కానీ ఎల్ నినో మార్పుల వల్ల ప్రస్తుతం అక్టోబర్‌లోనే ఎండల తీవ్రత పెరిగిపోతోందని వివరించారు. ఒకప్పుడు చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించేవాళ్లమని, కానీ నేడు అక్టోబర్ మాసంలో కూడా భానుడి భగభగలు, వేడి గాలుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన విచిత్రమైన వాతావరణ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

వాతావరణంలో సంభవిస్తున్న ఈ అనూహ్య మార్పుల వల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఊహించని రీతిలో పెరిగి డిమాండ్ ఏకంగా 20,000 మెగావాట్లకు చేరుకుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీల వినియోగంతో పాటు వ్యవసాయ రంగంలో బోరుబావులు, ఎత్తిపోతల పథకాల మోటార్లు నిరంతరం నడవడమే ఈ భారీ డిమాండ్‌కు కారణమని విశ్లేషించారు. వర్షాభావ పరిస్థితులు నీటి కొరతకు , విద్యుత్ గ్రిడ్‌పై అదనపు భారాన్ని మోపడానికి దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో పౌరులందరూ విచక్షణతో వ్యవహరించి విద్యుత్, తాగునీరు వృథా కాకుండా సహజ వనరుల సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.