Skip to content
బిజినెస్ › వార్తలు

Amazon Layoffs: అమెజాన్ ఉద్యోగులకు షాక్.. 1000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న దిగ్గజం..

jagan 08 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Amazon Layoffs: అమెజాన్ ఉద్యోగులకు షాక్.. 1000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న దిగ్గజం..

Amazon Layoffs

Amazon Layoffs: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) అంతర్జాతీయంగా మరోసారి ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది. ఈ దఫా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది కంటే తక్కువ మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం చూపినట్లు నివేదికలు ధృవీకరించాయి. భారతదేశం (India), అమెరికా (US), బ్రిటన్ (UK) తో సహా పలు దేశాల్లోని కస్టమర్ సర్వీస్, మార్కెట్ ప్లేస్ సపోర్ట్, ఇంజనీరింగ్ , రీటైల్ విభాగాలకు చెందిన ఉద్యోగులను కంపెనీ తొలగించింది. గత ఏడాది నుంచి మొదలై దాదాపు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపుల వరకు విస్తరించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగానే ఈ ఉద్యోగాల కోతలు చోటుచేసుకుంటున్నాయని సమాచారం.

ఈ-కామర్స్ ప్రధాన ప్లాట్‌ఫారమ్‌ను పర్యవేక్షించే ‘స్టోర్స్’ (Stores) వ్యాపార విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్, బిజినెస్ ఇన్‌సైడర్ నివేదికలు స్పష్టం చేశాయి. కంపెనీ ప్రాధాన్యతలను సమర్థవంతంగా నెరవేర్చడానికి, కార్పొరేట్ నిర్వహణలో అనవసరపు పొరలను (Bureaucracy) తగ్గించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేసేందుకే ఈ సర్దుబాట్లు చేశామని అమెజాన్ అధికార ప్రతినిధి రాయిటర్స్‌కు వివరణ ఇచ్చారు. అయితే, దేశాల వారీగా ఎంతమందిపై ఈ వేటు పడిందనే కచ్చితమైన సంఖ్యను వెల్లడించేందుకు యాజమాన్యం నిరాకరించింది.

మరోవైపు కొవిడ్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ ఆర్డర్లు విపరీతంగా పెరగడంతో అనూహ్య ఒత్తిడి నెలకొందని, ఆ సమయంలో అవసరానికి మించి సిబ్బందిని నియమించుకోవడమే ప్రస్తుత రీస్ట్రక్చరింగ్‌కు ప్రాథమిక కారణమని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారతదేశంలో కీలకమైన ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్, అంతర్జాతీయంగా ‘ప్రైమ్ బిగ్ డీల్ డేస్’ సేల్స్ కొనసాగుతున్న తరుణంలోనే ఈ లేఆఫ్‌లు రావడం గమనార్హం. మంగళవారం అధికారిక ఇ-మెయిళ్ల ద్వారా సమాచారం అందడంతో, ప్రభావిత ఉద్యోగులు కంపెనీ అంతర్గత స్లాక్ (Slack) ఛానళ్లలో సెవరెన్స్ ప్యాకేజీలు, నోటీస్ పీరియడ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్ విభాగాన్ని కుదించి ఖర్చులను తగ్గించుకుంటున్న అమెజాన్, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు , ప్రాసెసింగ్ చిప్‌ల మౌలిక వసతులకై శతాధిక కోట్లలో రికార్డు స్థాయి పెట్టుబడులను వేగవంతం చేస్తోంది.

ట్యాగ్‌లు: amazon business news layoffs news