Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Power Row: 8వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు: భట్టి విక్రమార్క

jagan 07 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Power Row: 8వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు: భట్టి విక్రమార్క

Mallu Bhatti vikramarka

Telangana Power Row: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ జల విద్యుత్ ఉత్పత్తి తగ్గినాప్పటికీ ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం దాదాపు 20వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. దీంతో మొత్తంగా 8వేల మెగావాట్ల అదనపు భారం పడ్డప్పటికీ జెన్కో, ట్రాన్స్కో, ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు.

మంగళవారం మండలంలోని పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటి వరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులు యంత్రాలు, యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. అవసరమైన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం వల్లే జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ గృహ వినియోగదారులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెరిగే విద్యుత్ డిమాండ్ను థర్మల్ పవర్ ద్వారా అధిగమిస్తున్నామని తెలిపారు. ప్రజలు విద్యుత్ సరఫరా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మనకంటే పెద్దదైన కర్ణాటకలో పీక్ విద్యుత్ డిమాండ్ సుమారు 20వేల మెగావాట్లు ఉండగా తెలంగాణలోనూ ప్రస్తుతం అదేస్థాయికి చేరిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పీక్ డిమాండ్ సుమారు 12వేల మెగావాట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినప్పటికీ ప్రజలకు నిరంతర సరఫరా అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు.

తదుపరి వర్ష కాలం వరకు అందుబాటులో ఉన్న నీటిని మనుషులు, పశువులు, పంటల తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తాగునీటిని భవిష్యత్ కోసం నిల్వ చేసుకోవడం సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. విద్యుత్ రంగంలో నిరంతరం శ్రమిస్తున్న జెన్కో సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పి కె. నర్సింహా, జెన్కో ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.