Skip to content
జాతీయం › వార్తలు

ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి

Krishna Rao 06 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి

ఇండియా బ్లాక్ మార్చ్

ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన పాదయాత్రకు అనుమతి లేకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు ఈ నిరసన చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తమ భద్రతా సిబ్బందితో కలిసి ఈసీ కార్యాలయం ఎదురుగా ఉణ్న ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కొద్దిసేపు పోలీసు బస్సు ఎక్కారు. అనంతరం బస్సు నుంచి దిగి ఆకాశవాణి భవన్ వైపు నడిచారు.

ఇదిలా ఉండగా, పోలీసు బస్సు సుమారు 50 మీటర్లు కదిలిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ప్రతిపక్ష ఎంపీలు అందులో నుంచి దిగుతూ కనిపించారు. అయితే, ఎంపీలను అధికారికంగా అదుపులోకి తీసుకున్నారా లేదా విడుదల చేశారా అనే విషయంపై కొంతసేపు స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ఇతర ప్రతిపక్ష నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్లమెంట్ మార్గంలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్న తర్వాత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు డెరెక్ ఓ’బ్రియన్, అభిషేక్ బెనర్జీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.

జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయనను “దేశద్రోహి”గా అభివర్ణించిన కాంగ్రెస్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టులో జ్ఞానేష్ కుమార్ “ఓట్ల దొంగతనానికి ఏజెంట్” అంటూ ఆరోపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేసినప్పటికీ ఆయన అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.

ఆకాశవాణి భవన్ వైపు వెళ్లేందుకు రాహుల్, ప్రియాంక ప్రయత్నం
SIR వివాదంపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు పాదయాత్రగా వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.అంతకుముందు నీతి ఆయోగ్ సమీపంలో ప్రతిపక్ష నేతలు ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసన ప్రదేశంలో కొందరు ఆందోళనకారులు బారికేడ్లపైకి ఎక్కగా, “ఓటు దొంగ, బండిని వదిలేయ్” అంటూ నినాదాలు చేశారు.

SIRపై రాజకీయ వివాదం
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియపై రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు. ఓటరు నమోదు ఫారాల్లో అనధికారిక మార్పులు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గత నెలలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తమకు తెలియకుండా లేదా తమ సిఫార్సు లేకుండా SIRకు సంబంధించిన ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ 10 నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే, ఈ వాదనలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ముగ్గురు సభ్యుల కమిషన్‌లో విభేదాలు ఉన్నాయన్న సూచనలను ఖండించింది. SIRకు సంబంధించిన నిర్ణయాలను ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.