Skip to content
తెలంగాణ › వార్తలు

Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్‌డ్ ప్లాట్లు..?

jagan 06 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్‌డ్ ప్లాట్లు..?

టీ క్యూర్‌ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం

Land Pooling Policy: తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భూసేకరణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల కోసం భూములు సేకరించి నేరుగా నగదు పరిహారం చెల్లించే పాత విధానానికి స్వస్తి పలికి, భూయజమానులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను భాగస్వామ్యంగా ఇచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా నూతన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.

ప్రస్తుతం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ పరిధిలోని కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఈ విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. అక్కడ వస్తున్న ఫలితాల ఆధారంగా సాగునీరు, రహదారులు, భవనాల శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ ప్రాజెక్టులన్నింటికీ దీనిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ వినూత్న విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు ‘తెలంగాణ సమగ్ర ప్రాంత అభివృద్ధి, ప్రణాళిక బిల్లు-2026’ పేరుతో కొత్త ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థలు (UDAs), జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించే ప్రాధికార సంస్థలు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపడతాయి. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR), గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు , ప్రతిపాదిత బుల్లెట్ రైలు టెర్మినల్ వంటి బృహత్తర ప్రాజెక్టులకు వేల ఎకరాల భూమి అవసరం కానుంది. అందునా రంగారెడ్డి , పరిసర జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూనే అభివృద్ధిలో భూయజమానులను భాగస్వాములను చేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

నూతన ల్యాండ్ పూలింగ్ విధానంలో పట్టా భూముల యజమానులతో పాటు అసైన్డ్ భూములు, సీలింగ్ మిగులు భూములు, భూదాన్ భూములు , కొన్ని రకాల ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. అయితే తిరిగి కేటాయించే ప్లాట్ల విస్తీర్ణం, సదరు భూమిపై ఉన్న హక్కులు , ప్రాంతీయ విలువను బట్టి మారనుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల మార్గాలను ప్రతిపాదించారు. భూయజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమిని ఇస్తే దానిని ‘కన్సెంట్ బేస్డ్ ల్యాండ్ పూలింగ్’ అని, అలా కాకుండా ప్రాధాన్యతా ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం స్వయంగా పూలింగ్‌కు పిలుపునిస్తే దానిని ‘గైడెడ్ ల్యాండ్ పూలింగ్’ అని వ్యవహరిస్తారు.

ఇప్పటికే మూసీ ప్రాజెక్టు , హెచ్‌ఎండీఏ పరిధికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 240, జీవో 243 మార్గదర్శకాల ప్రకారం పట్టా భూములకు ఎకరానికి గరిష్ఠంగా 1,400 చదరపు గజాలు లేదా అభివృద్ధి చేసిన భూమిలో 50 శాతం వాటా (ఏది తక్కువైతే అది) లభిస్తుంది. అదేవిధంగా చెరువులు, నదుల బఫర్ జోన్ పరిధిలోని భూములకు ఎకరానికి 800 చదరపు గజాలు, ఎఫ్‌టీఎల్ (FTL) ప్రాంతాల్లోని భూములకు 400 చదరపు గజాల వరకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించనున్నారు. అయితే ఈ నూతన విధానం నిర్బంధ భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టడానికి ఉద్దేశించినది కాదని, ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, పునరావాసం కల్పించడం వంటి పారదర్శక నిబంధనలన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.