Skip to content
బిజినెస్ › వార్తలు

తగ్గిపోతున్న పొదుపు కుటుంబాలలో సంక్షోభానికి సంకేతాలు

Prajapaksham 06 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
తగ్గిపోతున్న పొదుపు కుటుంబాలలో సంక్షోభానికి సంకేతాలు

Saving

– సంజయ్ రాయ్

దాదాపు 81.3 కోట్ల మంది భారతీయులు ఆహార సహాయం పొందుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే వస్తు లేదా నగదు రూపంలోని వివిధ బదిలీ పథకాల ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. అయినప్పటికీ ప్రధానంగా ఇంటి ఖర్చుల కోసం తీసుకునే కుటుంబ (హౌజ్‌ హోల్డ్‌) అప్పులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో దశాబ్ద కాలంగా వాస్తవ వేతనాలు దాదాపు స్తంభించిపోవడం, స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు వాస్తవ ఆదాయాలు తక్కువగా ఉండటంతో కుటుంబ అవసరాల ఖర్చులపై ఒత్తిడి పెరుగుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే నిరుద్యోగ రేటు అధికంగానే కొనసాగుతోంది. నిత్యావసర ఖర్చుల కోసం కుటుంబాలు బ్యాంకులు, బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు అందించే రుణాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.
నయా ఉదారవాద పాలనలో, అసమానతలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకోవడంతో మొత్తం డిమాండ్‌లో పరిమితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవస్థలో ఆర్థికీకరణ (ద్రవ్యీకరణ) పెరగడంతో, రుణ ఆధారిత వినియోగం ద్వారా డిమాండ్‌లోని ఈ పరిమితిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక లేదా వ్యవసా య కార్యకలాపాల వంటి ఉత్పాదక రంగాల వైపు ప్రవహించే రుణాలతో పోలిస్తే, వినియోగదారుల రుణాల నిష్పత్తి పెరగడంతో బ్యాంకు రుణాల తీరు కూడా మార్పునకు లోనవుతోంది. పెరుగుతున్న అనిశ్చితి, సగటు కుటుంబాల దుర్బలత్వం కారణంగా స్థూల పొదుపు పెరిగినప్పటికీ, రుణాలతో కూడిన వినియోగం పై ఆధారపడటం కూడా పెరుగుతోందనేది గమనార్హం. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య వంటి నిత్యావసర సేవల ప్రైవేటీకరణ పెరగడం, ఆహారం, ఇంధన ధరల పెరుగుదలతో పాటు గృహ వినియోగ వ్యయం పెరిగింది. వివిధ ఏజెన్సీల ద్వారా వినియోగదారుల రుణాల లభ్యత, ప్రారంభ దశలో అధిక వినియోగ స్వభావం కలిగిన ప్రజలకు రుణ లభ్యతను పెంచి, డిమాండ్‌ను పెంచడం లో సహాయపడుతుంది. కానీ, తిరిగి చెల్లించాల్సిన బాధ్యతలు పెరిగేకొద్దీ, ఇది సాధారణంగా తక్కువ వినియోగ ప్రవృత్తిని కలిగి ఉండే రుణదాతల వైపు కొనుగోలు శక్తి తిరోగమన ప్రవాహానికి దారితీస్తుంది. ఫలితంగా, చౌక రుణాల ద్వారా డిమాండ్‌ను పెంచడం, చివరికి కొనుగో లు శక్తి సంకోచానికి దారితీస్తుంది, తద్వారా రుణభారం పెరగవచ్చు.
స్థూల గృహ పొదుపుల వృద్ధికి, స్థూల బాధ్యతల వృద్ధికి మధ్య వ్యత్యాసం తగ్గుతోందని, ఇది ఆర్థిక వ్యవస్థలో నికర గృహ పొదుపుల వృద్ధిలో క్షీణతకు కారణమవుతోందని ఆర్‌బిఐ తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తుంది. జిడిపిలో కుటుంబ (హౌజ్‌హోల్డ్‌) రుణాల శాతం క్రమంగా పెరుగుతూ, 2025 సెప్టెంబర్‌ చివరి నాటికి 45.5 శాతానికి చేరుకుంది. ఇది గత 5 ఏళ్ల సగటు అయిన 42.9 శాతం కంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా, 2022 జూన్‌ నుండి 2026 మార్చి మధ్య గృహ రంగ ఆస్తులు జిడిపిలో 7.4 శాతం పాయింట్ల మేర పెరగగా, అదే కాలంలో వారి అప్పులు 9.4 శాతం పాయింట్ల వేగంతో పెరిగాయి. దీనిని బట్టి, కుటుంబాల ఆస్తులు, అప్పుల మధ్య ఉన్న వ్యత్యాసం ఇటీవలి కాలంలో తగ్గుతోందని అర్థమవుతోంది.
అలాగే, కుటుంబ రుణాల వినియోగంలో కూడా మార్పు కనిపిస్తోంది. ఇందులో 58.4 శాతం రుణాలు ఆస్తుల సృష్టి లేదా ఉత్పాదక అవసరాల కోసం కాకుం డా, వినియోగ అవసరాల కోసం తీసుకున్న ‘గృహేతర రిటైల్‌ రుణాలు’గా ఉన్నాయి. గృహ రుణాలు, వ్యవసా య లేదా వ్యాపార రుణాలతో పోలిస్తే గృహేతర రిటైల్‌ రుణాలు చాలా వేగంగా పెరిగాయి. వినియోగదారుల రుణాలలో గృహ రుణాలు, వాహన రుణాల వాటా తగ్గుముఖం పట్టగా, ఇదే కాలంలో బంగారు రుణాలు భారీ గా పెరిగాయి. 2024 మార్చి నుండి బంగారు రుణాలు 23 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సిఎజిఆర్‌) వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా గృహేతర రిటైల్‌ విభాగం లో అత్యధిక వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బంగారు రుణాల ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఇప్పటికే రుణాలు కలిగి ఉన్నవారే. వీరు బంగారం ధరలు పెరగడాన్ని ఉపయోగించుకుని, తమ పాత అప్పులను తీర్చడానికి లేదా కొనసాగించడానికి అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అంటే, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న వర్గం నుండే ఈ బంగారు రుణాల ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) రుణాలలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
కుటుంబ రుణాల విభాగంలో, ఇటీవలి కాలంలో అధిక విలువ కలిగిన కుటుంబ రుణాల వాటా పెరగడం గమనార్హం. 2014 మార్చిలో రూ. 25లక్షల లోపు ఉన్న గృహ రుణాల వాటా 60.6 శాతంగా ఉండేది. ప్రస్తుతం, రూ. 50లక్షల కంటే ఎక్కువ విలువైన రుణాలు మొత్తం బకాయి రుణాలలో 44.7 శాతంగా ఉన్నాయి. తక్కువ ధరలో లభించే గృహాల కోసం తీసుకునే రుణాల స్థానంలో, అధిక విలువ కలిగిన ఆస్తుల కొనుగోలు కోసం రుణాలు తీసుకోవడం ప్రధాన ధోరణిగా మారుతోందని ఇది సూచిస్తోంది. కుటుంబ అప్పుల విషయంలోనూ మార్పు కనిపిస్తోంది. ఇవి క్రమంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్‌బిఎఫ్‌సి) వైపు మళ్లుతున్నాయి. కుటుంబ ఆర్థిక అప్పులలో నాలుగింట మూడు వంతులు బ్యాంక్‌ రుణాలే అయినప్పటికీ, మొత్తం అప్పులలో ఎన్‌బిఎఫ్‌సిల వాటా పెరుగుతోంది.
మొత్తం బకాయి రుణాలలో కుటుంబ రుణాల వాటా మార్చి 2019 నాటి 34 శాతం నుండి మార్చి 2026 నాటికి 26.3 శాతానికి తగ్గిందని, అదే కాలంలో వ్యవసాయ రుణాల వాటా 18 శాతం నుండి 15.3 శాతానికి తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. మార్చి 2026 నాటికి, కుటుంబ రుణాలలో దాదాపు సగం (49.7 శాతం) వినియోగ అవసరాలకు, 33.5 శాతం ఆస్తుల సృష్టికి, 16.8 శాతం ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించబడ్డాయి. దీనినిబట్టి చూస్తే, భారతీయ కుటుంబాలు అధికంగా ఆస్తుల సృష్టి లేదా ఉత్పాదక కార్యకలాపాల కోసం కాకుండా, కేవలం వినియోగ అవసరాల కోసమే రుణాలు తీసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. 1970ల ప్రారంభంలో దేశీయ పొదుపులో కుటుంబ పొదుపు వాటా సుమారు 20 శాతంగా ఉండేది. ఇది 1990ల మధ్యకాలానికి దాదాపు 50 శాతానికి పెరిగి, ఆ తర్వాత తగ్గింది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, 2024- నాటికి మళ్లీ 20 శాతానికి పడిపోయింది. అంటే ఐదు దశాబ్దాల క్రితం ఉన్న స్థాయికి చేరింది. నికర కుటుంబ పొదుపు తగ్గడం వల్ల సహజంగానే పెట్టుబడులకు అందుబాటులో ఉండే వనరులు తగ్గుతాయి. కార్పొరేట్‌ రంగంలో ఉత్పాదక సామర్థ్యాల కోసం చేసే పెట్టుబడు ల వృద్ధి దీర్ఘకాలికంగా క్షీణింపు ధోరణిని ప్రదర్శిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఉపాధి కల్పన, సమర్థవంతమైన డిమాండ్‌ దెబ్బతింటాయి. తద్వారా అత్యవసర వినియోగ అవసరాలకు ఆదాయం తగ్గి, కుటుంబ అవసరాల కోసం మరింతగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుంది.