Skip to content
తెలంగాణ › వార్తలు

22A Lands: 22ఎ భూముల యజమానులకు గుడ్‌న్యూస్.. నాలా రుసుములు చెల్లిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి

Krishna Rao 04 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
22A Lands: 22ఎ భూముల యజమానులకు గుడ్‌న్యూస్.. నాలా రుసుములు చెల్లిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి

Indiramma Towers

22A Lands: తెలంగాణలో 22A జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తి యజమానులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హత కలిగిన కొన్ని భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తూ రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

22A Lands: 22A పరిధిలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన నాలా పూర్తికాని నివాస పట్టా భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం మరో పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చింది. వ్యవసాయ భూములుగా నమోదై అనంతరం నివాస వినియోగంలోకి వచ్చినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన అర్హత ఉన్న భూములకు నాలా, ఇతర ప్రభుత్వ రుసుములు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్లు చేపట్టేలా జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా నమోదై ఉన్నప్పటికీ, వాస్తవంగా నివాస అవసరాలకు వినియోగిస్తున్న కొన్ని పట్టా భూములకు నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి అర్హత కలిగిన భూముల దరఖాస్తులను పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉన్న భూములకు వర్తించే నాలా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు సంబంధిత ఇతర ప్రభుత్వ ఫీజులను కూడా చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియపై తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

నాలా ప్రక్రియ పూర్తికాక రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే కొనసాగుతున్న కారణంగా 22ఎ జాబితాలో నమోదైన నివాస పట్టా భూముల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూమి హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా పరిశీలించి నిబంధనల మేరకు నాలా, ఇతర రుసుములు వసూలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.

అర్హత ఉన్న దరఖాస్తులను పారదర్శకంగా, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. అమలు పురోగతిపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో ఏళ్లుగా తమ ప్లాట్లను విక్రయించుకోలేక, రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు.

శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో 22ఎ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు.

గత నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు 22ఎకు సంబంధించిన సమస్యలను ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే జి.ఓ.118, జి.ఓ.76లకు అనుగుణంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, డిటిసిపి, మున్సిపల్ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు.

అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టామని, తాజాగా నాలా పూర్తికాని పట్టా భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపేలా తాజా మెమో జారీ చేశామన్నారు.

ట్యాగ్‌లు: 22A Lands