Skip to content
జాతీయం › వార్తలు

Karnataka SIR Row: కర్ణాటకలో ‘ఫారం-7’ వివాదం.. ఓటర్ల తొలగింపుపై ఈసీ కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్ ధర్నా..

jagan 02 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Karnataka SIR Row: కర్ణాటకలో ‘ఫారం-7’ వివాదం.. ఓటర్ల తొలగింపుపై ఈసీ కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్ ధర్నా..

DK Shivkumar

Karnataka SIR Row: కర్ణాటక ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున అర్హులైన ఓటర్లను తొలగించేందుకు ‘ఫారం-7’ అభ్యంతరాలను అక్రమంగా ఉపయోగిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్ణయించిన మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు. అనంతరం మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి బెంగళూరులోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వి. అన్బుకుమార్ కార్యాలయం ఎదుట ఐదు గంటల పాటు ధర్నా చేపట్టారు.

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) ముగింపు దశలో—ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య—ఫారం-7 అభ్యంతరాలు అసాధారణంగా నమోదైనట్లు సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెళగావి నార్త్‌లో సుమారు 3,000, ముడిగెరెలో 6,259, బాబలేశ్వర్‌లో 1,373, నరసింహరాజాలో 1,200, భాల్కి నియోజకవర్గంలో 2,285 చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయని నివేదికల ద్వారా తెలిసిందన్నారు. ప్రధానంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించేందుకు ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ముందుగానే వివరాలు నింపిన (Pre-filled) ఫారమ్‌లను సమర్పించారని, ఈ ఓటర్ల హక్కులను కాపాడడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ ‘ఫారం-7’ దుర్వినియోగాన్ని ఒక పెద్ద ఓటర్ల దొంగతనం (Vote Theft) అని అభివర్ణించిన డీకే శివకుమార్, దీనిపై సమగ్రమైన , కాలపరిమితితో కూడిన విచారణ జరిపించాలని కోరుతూ సీఈఓ అన్బుకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. తప్పుడు దరఖాస్తులు దాఖలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి , మంత్రుల ధర్నాకు స్పందించిన సీఈఓ.. అక్రమ లేదా తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి ఫారం-7 దాఖలు చేసిన దరఖాస్తుదారులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 కింద చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (EROs) వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల అనంతరం సీఎం డీకే శివకుమార్ తన ఆందోళనను విరమించారు.