Skip to content
జాతీయం › వార్తలు

ICC World Cup 2027: 14 జట్లతో మహా సమరం.. భారత్-పాకిస్తాన్ హైవోల్టేజీ మ్యాచ్ ఎప్పుడంటే.. వరల్డ్ కప్ 2027 పూర్తి వివరాలు ఇవిగో..

jagan 02 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ICC World Cup 2027: 14 జట్లతో మహా సమరం.. భారత్-పాకిస్తాన్ హైవోల్టేజీ మ్యాచ్ ఎప్పుడంటే.. వరల్డ్ కప్ 2027 పూర్తి వివరాలు ఇవిగో..

ICC Cricket World Cup 2027

ICC Cricket World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న టోర్నమెంట్ ప్రారంభం కానుండగా.. నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఫైనల్‌తో ముగియనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో గత టోర్నమెంట్లకు భిన్నంగా మూడు దశల పోటీ విధానాన్ని ప్రవేశపెట్టారు.

2027 ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించాయి. అలాగే 2026 సెప్టెంబర్ 30 నాటి ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు కూడా నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. మిగిలిన నాలుగు స్థానాలను క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు.

క్వాలిఫయర్‌లో అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ప్రపంచకప్ గ్రూప్ దశకు చేరుతుంది. రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన మూడు జట్లకు మరో అవకాశం ఉంటుంది. ఈ మూడు జట్లు నమీబియాలో జరిగే సూపర్ సిరీస్‌లో ఒక్కోసారి పరస్పరం తలపడతాయి. మూడు మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు చివరి గ్రూప్-స్టేజ్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఈ సూపర్ సిరీస్ అక్టోబర్ 2, 4, 6 తేదీల్లో జరగనుంది.

12 జట్లతో గ్రూప్ స్టేజ్

క్వాలిఫయర్ విజేత, సూపర్ సిరీస్ విజేతలతో కలిపి మొత్తం 12 జట్లు గ్రూప్ దశలో ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి.

ప్రతి గ్రూప్‌లో టాప్-3లో నిలిచిన జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన ప్రదర్శన చేసిన మరో జట్టుకు కూడా అవకాశం లభిస్తుంది. దీంతో మొత్తం ఏడు జట్లు ‘సూపర్ 7’ దశలోకి ప్రవేశిస్తాయి.

సూపర్ 7లో కొత్త సమీకరణాలు

2027 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మార్పుల్లో ‘సూపర్ 7’ ఫార్మాట్ ఒకటి. గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ 7కు క్యారీ ఫార్వర్డ్ కావు. ఈ దశలో అర్హత సాధించిన ఏడు జట్లు ఒక్కొక్కటి మిగిలిన ఆరు జట్లతో మ్యాచ్ ఆడతాయి. అంటే సూపర్ 7లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ దశ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. సూపర్ 7లో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో తలపడుతుంది. రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో మరో సెమీఫైనల్ ఆడుతుంది.

సూపర్ 7 దశ నవంబర్ 14తో ముగుస్తుంది. అనంతరం నవంబర్ 17, 18 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ నిర్వహిస్తారు. సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన రెండు జట్లు నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఫైనల్‌లో ప్రపంచకప్ టైటిల్ కోసం తలపడతాయి. సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు కూడా రిజర్వ్ డేలను కేటాయించారు.

ప్రపంచకప్‌లో టీమిండియా తన ప్రయాణాన్ని డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ప్రారంభించనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఈ రెండు జట్లు మరోసారి ప్రపంచకప్‌లో తొలి దశలోనే ఢీకొనడం ఆసక్తిని పెంచుతోంది.

ఆ తర్వాత అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ అక్టోబర్ 24న జింబాబ్వేతో ఉంటుంది. విక్టోరియా ఫాల్స్ సమీపంలోని కొత్త మోసి-ఓ-తున్యా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ వేదికలో ప్రపంచకప్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.

2027 ప్రపంచకప్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు 12 వేదికల్లో జరుగుతాయి. నమీబియాలోని విండ్‌హోక్‌లో సూపర్ సిరీస్‌తో పాటు గ్రూప్ దశ మ్యాచ్‌లు కూడా నిర్వహించనున్నారు. జింబాబ్వేలో హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్ వేదికలు ఉండగా.. దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్, జొహన్నెస్‌బర్గ్, డర్బన్, పార్ల్, గ్కెబెర్హా తదితర నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.