Skip to content
జాతీయం › వార్తలు

Election Commission row: ఎన్నికల సంఘంపైనే విశ్వాసం సన్నగిల్లితే…

Prajapaksham 30 Sep 2026 0 నిమిషాల పఠనం జాతీయం
Election Commission row: ఎన్నికల సంఘంపైనే విశ్వాసం సన్నగిల్లితే…

cec gyanesh kumar

రచయిత: తుంగా లక్ష్మీనారాయణ

ప్రజాస్వామ్యం ఎన్నికలతో మాత్రమే కాదు ఎన్నికల విశ్వసనీయతతో బతుకుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగా, క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.అధికార మార్పిడులు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంచే రీతిలో నిర్వహించడానికి, 18 ఏళ్ళు నిండిన పౌరులను ఓటర్లుగా నమోదు చేయడాని కి, నిష్పాక్షికంగా ఓటర్ల జాబితాను తయారు చేయడానికి, భారత రాజ్యాంగం భారత ఎన్నికల సంఘానికి అత్యంత కీలకమైన బాధ్యతను అప్పగించింది.

అందుకే, ఎన్నికల సంఘంపై ప్రజలకు ఉండే విశ్వాసం సాధారణ పరిపాలనా అంశం కాదు. అది ప్రజాస్వామ్యానికి పునాది.

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్నికల సంఘం తీవ్రమైన రాజకీయ ఆరోపణలు, అంతర్గత విభేదాలపై వచ్చిన వార్తలు, సిఇసి రాజీనామాను కోరుతూ దేశ వ్యాపితంగా ప్రజా నిరసనలు, అలాగే ఎన్నికల కమీషనర్ల నియామకానికి సంబంధించిన చట్ట సవరణపైన మరియు ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ‘ పేరుతో కొట్లాది మంది ఓట్ల తొలగింపు వివాదంపై సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన న్యాయపోరాటం జరుగుతున్నది. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు, ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం భవిష్యత్తు పట్ల ప్రజల్లో రోజు రోజుకు ఆందోళన అధికమవుతున్నది. దీన్ని ఒక ప్రమాద హెచ్చరికగా పరిగణించాలి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల పనితీరు మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం యొక్క తీవ్రతను తెలియ జేస్తున్నది.

ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర సంస్థ. కానీ, నేడు దేశం ముందున్న ప్రశ్న చాలా లోతైనది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నదా? అన్నదే కాకుండా, అది స్వతంత్రంగా పనిచేస్తోందని ప్రజలు కూడా విశ్వసించాలి. ఇది ఒక వ్యక్తిపై తీర్పు కాదు. ఇది ఒక ప్రజాస్వామ్య సూత్రం. ఎన్నికల నిర్వహణ మాత్రమే సరిపోదు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించబడ్డాయన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించేలా ఎన్నికల ప్రక్రియ ఉండాలి. ఆ పరిస్థితి నేడు లేదు. ఇటీవల సుప్రీంకోర్టులో సిఇసి మరి యు ఇసిల నియామక సవరణ చట్టంపై జరిగిన విచారణ ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది. 2023 చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నామినేట్‌ చేసే కేంద్ర మంత్రిని చేర్చారు. దాంతో ముగ్గురు సభ్యుల కమిటీలో ప్రభుత్వం తరఫున ఇద్దరు సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. అత్యంత లోపభూయిష్టమైన ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సెప్టెంబర్‌ 23న సుప్రీంకోర్టు పెద్ద ధర్మాసనం పరిశీలించేందుకు మార్గం సుగమం చేసింది. క్రికెట్‌ క్రీడలో అంపైర్‌ ఎంపిక ఒక జట్టు ఆధిపత్యంలో, వారికి అనుకూలుడైన వ్యక్తిని ఎంపిక చేస్తే, ఆ అంపైర్‌ నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఊహించుకోగలరు కదా! అంపైర్‌ పై అనుమానం ఉంటే మ్యాచ్‌పై విశ్వాసం దెబ్బతింటుంది. ఎన్నికల విషయంలో ఈ సూత్రం మరింత కీలకమైనది. ప్రధా న ఎన్నికల కమిషనర్‌ గా జ్ఞానేశ్‌ కుమార్‌ ను నియమించిన నాటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల షెడ్యూల్స్‌ ప్రకటించడంలో, ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు.

ఓటు హక్కు చుట్టూ పెరుగుతున్న ఆందోళన: ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడం ప్రజాస్వామ్యానికి అవసరమే. మరణించినవారు, డూప్లికేట్‌ నమోదు లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారినవారి పేర్లు తొలగించడం ఎన్నికల జాబితాల విశ్వసనీయతను పెంచుతుంది. అయితే అదే ప్రక్రియలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదు.

పశ్చిమ బెంగాల్‌ ‘సర్‌” సందర్భంగా 27.16 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిలో 22.21 లక్షల మంది తిరిగి తమను ఓటర్ల జాబితాలో చేర్చాలని అప్పీల్‌ చేశారు. ఎన్నికలకు ముందు కేవలం 1,607 మంది మాత్రమే తిరిగి చేర్చబడ్డారని ఎన్నికల సంఘం తెలిపింది. తొలగింపులు, గైర్హాజరు, మారిపోయిన, మరణించిన లేదా డూప్లికేట్‌ నమోదులను గుర్తించే ప్రక్రియలో భాగమని ఎన్నికల సంఘం వివరించింది. అందువల్ల ఇక్కడ అసలు ప్రశ్న ఎంత మంది పేర్లు తొలగించబడ్డాయి? అన్నదొక్కటే కాదు. ఎంత మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా రక్షించబడ్డారు? అన్నదే ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన ప్రశ్న.

పార్లమెంట్‌ బలహీనపడితే జవాబుదారీతనం ఎక్కడ? ఒక వైపు ఎన్నికల సంఘంపై విశ్వాసం తగ్గింది. మరొకవైపు, ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే పార్లమెంటు పనితీరు అత్యంత జుగుప్సాకారంగా ఉన్న ది.

17వ లోక్‌సభ ఐదేళ్లలో 274 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. పూర్తి కాలం పనిచేసిన అన్ని లోక్‌సభలతో పోలిస్తే ఇది అత్యల్ప సమావేశాల సంఖ్య. సగటున సంవత్సరానికి 55 రోజులు మాత్రమే సమావేశమైంది. 15 సమావేశాల్లో 11 ముందుగానే ముగిశాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ, ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా ఉంచాలాంటే పార్లమెంటు జవాబుదారీతనంతో నిర్వహించబడాలి. చట్ట సభల్లో దేశం మరియు ప్రజల సమస్యలపై చర్చించకపోతే, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రశ్నించకపోతే, నిశితంగా పరిశీలించకపోతే ఎన్నికల మధ్య కాలంలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలి? చట్ట సభలు మెరుగైన చట్టాలను ఎలా చేస్తాయి?

న్యాయవ్యవస్థ చివరి రాజ్యాంగ భరోసా: ఇక్కడ న్యాయవ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘం నియామక విధానంపై సుప్రీంకోర్టులోనే రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవనెత్తబడటం, ‘సర్‌”కు సంబంధించిన వివాదాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ తనిఖీలు ఇంకా పనిచేస్తున్నాయనే ఆశకు సంకేతాలు. అయితే, కొన్ని అత్యంత కీలకమైన కేసుల్లో ఇచ్చిన తీర్పులు, న్యాయం అందడంలో ఆలస్యం, పేరుకుపోతున్న కేసుల సంఖ్య, న్యాయమూర్తుల ఖాళీలు, న్యాయమూర్తుల్లో కొందరు రిటైర్‌ అయిన వెనువెంటనే నామినేటె్‌డ పదవులను స్వీకరించడం, ‘క్విడ్‌ ప్రోకో’ వంటి ఆరోపణలను ఎదుర్కోవడం, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లెలా చేశాయి. అందువల్ల న్యాయవ్యవస్థపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. 2026 మార్చి 16 నాటికి సుప్రీంకోర్టులో 92,876 కేసులు, హైకోర్టుల్లో 63,98,686 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ లోక్‌సభకు తెలిపింది. అంతకుముందు ఫిబ్రవరి 10 నాటికి జిల్లా, దిగువ కోర్టులతో కలిపి దేశవ్యాప్తంగా పెండింగ్‌ కేసుల సంఖ్య 5.46 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రభుత్వమే వెల్లడించింది. 2026 మార్చి 6 నాటికి దేశంలోని హైకోర్టుల్లో 1,122 మంజూరైన న్యాయమూర్తుల పోస్టులకు గాను 810 మంది మాత్రమే పనిచేస్తుండగా, 312 పోస్టులు ఖాళీగా ఉన్నాయని న్యాయశాఖ తెలిపింది. ఇవి న్యాయవ్యవస్థను మొత్తం విఫలమైంది అని నిర్ధారించే గణాంకాలు కావు. కేసుల సంక్లిష్టత, మౌలిక సదుపాయాలు, న్యాయవాదులు, దర్యాప్తు సంస్థలు, సాక్షులు వంటి అనేక కారణాలు కేసులు పేరుకుపోవడానికి కారణం కావచ్చు. కానీ, సాధారణ పౌరుడి ప్రశ్న, న్యాయం ఎప్పుడు లభిస్తుంది?

న్యాయం ఆలస్యమైతే, రాజ్యాంగ హక్కులు కాగితంపై ఉన్న హామీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

అసలు సంక్షోభం సంస్థల వైఫల్యమా? విశ్వాసం కోల్పోవడమా? ఎన్నికల సంఘం, పార్లమెంట్‌, న్యాయ వ్యవస్థ ఈ మూడు సంస్థలను విడివిడిగా కాకుండా రాజ్యాంగ పరస్పర నియంత్రణ వ్యవస్థలోని మూడు కీలక భాగాలుగా చూడాలి. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కూలిపోదు. ముందుగా ప్రజలు సంస్థలను ప్రశ్నించడం ప్రారంభిస్తారు. తరువాత సంస్థల నిర్ణయాలపై అనుమానాలు పెరుగుతాయి. వ్యవస్థలు తమను తాము సమర్థించుకునే పని చేస్తాయి. ఏది నిజం? అన్న ప్రశ్నకంటే ఎవరిని నమ్మాలి? అన్న ప్రశ్న గంభీరంగా దేశం ముందుకొస్తుంది. అదే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన దశ. ఎన్నికల సంఘంపై విశ్వాసం తగ్గితే ఓటరు తన ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని నమ్మలేడు. పార్లమెంటుపై విశ్వాసం తగ్గితే తన ప్రతినిధి తన గొంతును వినిపిస్తున్నాడని నమ్మలేడు. న్యాయవ్యవస్థపై విశ్వాసం తగ్గితే రాజ్యాంగం చివరికి తన హక్కులను కాపాడుతుందని నమ్మలేడు. ఈ మూడు నమ్మకాలూ బలహీనపడితే, ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రజాస్వామ్యం క్రమేపీ బలహీనపడే ప్రమాదం ఉంది.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం: భారత ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయిందని చెప్పడం అతిశయోక్తి. కానీ, వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనించాలి. ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఓటు వేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. పార్లమెంట్‌ పనిచేస్తోంది. న్యాయస్థానాలు రాజ్యాంగ ప్రశ్నలను పరిశీలిస్తున్నాయి. పౌర సమాజం, మీడియా, రాజకీయ పార్టీలు వ్యవస్థలను మరియు సంస్థలను ప్రశ్నిస్తున్నాయన్న భ్రమల్లో ప్రజలు ఉండకూడదు. ఆ వ్యవస్థలు మరియు సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదు, కాబట్టే ప్రజాస్వామ్యంపై విశ్వాసం దెబ్బతింటున్న సంకేతాలు విస్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని చూడ నిరాకరిస్తే భవిష్యత్తు అంధకారమే.

ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉండాలి. దాని నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాలి. ఓటర్ల జాబితా లో అర్హుడైన ఒక్క పౌరుడి పేరు కూడా తొలగించబడకూడదు. పొరపాట్లు జరిగితే వాటిని సకాలంలో సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం, ప్రక్రియ సందేహాలకు తావులేకుండా ఉండాలి. ఎన్నికలు నిర్వహించే సంస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా వ్యవహరిస్తుందని ప్రజలకు విశ్వాసం కలిగించాలి. పార్లమెంటు ఎక్కువ సమయం సమావేశమై దేశం మరి యు ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరపాలి, ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. న్యాయవ్యవస్థ, ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవాలి. ఎన్నికల సంఘం మీద విశ్వాసం పటిష్టంగా ఉంటేనే ఎన్నికల ఫలితాలపై ప్రజల విశ్వాసం బలపడుతుంది. పార్లమెంటు సమర్థవంతగా పనిచేస్తేనే ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, సమర్థంగా పనిచేస్తేనే భారత రాజ్యాంగం అమలుకు, పౌరుల హక్కులకు భరోసా ఉంటుంది.

ప్రజలు తమ ఓటుకు విలువ ఉందని, తమ గొంతుకు స్థానం ఉందని, తమ హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉందని విశ్వసించే స్థితి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉన్నట్లు.