US Pharma Tariff: నేటి నుంచే అమల్లోకి ట్రంప్ 100% ఫార్మా టారిఫ్.. భారత ఫార్మా కంపెనీలకు గుడ్ న్యూస్..
US Pharma Tariff
US Pharma Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాలను అమలు చేస్తున్న వేళ.. భారత ఫార్మా రంగానికి కీలక ఊరట లభించింది. భారత్‌తో పాటు మరో 19 దేశాలు, ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ప్రత్యేక ఔషధాలు, వాటికి సంబంధించిన ముడి పదార్థాలపై అమెరికా సున్నా శాతం అదనపు సుంకాన్ని వర్తింపజేయనుంది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ (BIS) ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసు జారీ చేసింది.
ఈ మినహాయింపు అన్ని రకాల మందులకు వర్తించదు. అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ప్రత్యేక ఔషధాలు, కొన్ని న్యూక్లియర్ మెడిసిన్స్, ప్లాస్మా ఆధారిత చికిత్సలు, ఫెర్టిలిటీ మందులు, సెల్ థెరపీ, జన్యు చికిత్స, యాంటీబాడీ-డ్రగ్ కంజుగేట్స్ (ADCs), కొన్ని వైద్య అత్యవసర చికిత్సా ఉత్పత్తులు, పశువైద్య ఔషధాలు ఈ సున్నా శాతం సుంకం కేటగిరీలోకి వస్తాయి. వీటికి సంబంధించిన అర్హత కలిగిన పదార్థాలు, భాగాలకు కూడా ఈ రేటు వర్తిస్తుంది.
భారత్‌తో పాటు ఏ దేశాలకు మినహాయింపు?
భారత్‌తో పాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, కంబోడియా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, యూరోపియన్ యూనియన్, గ్వాటెమాలా, ఇండోనేషియా, జపాన్, జోర్డాన్, మలేషియా, నార్త్ మాసిడోనియా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, లీచెన్‌స్టెయిన్, తైవాన్, థాయ్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, వియత్నాం ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాతో ప్రస్తుత లేదా భవిష్యత్ వాణిజ్య, భద్రతా ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలు ఉన్న దేశాల నుంచి వచ్చే అర్హత కలిగిన ఉత్పత్తులకు సున్నా శాతం సుంకం వర్తించే అవకాశం ఉంది. అత్యవసర అమెరికా ఆరోగ్య అవసరాలను తీర్చే కొన్ని ఉత్పత్తులకు కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా సున్నా రేటు వర్తించవచ్చు.
100 శాతం సుంకం ఎందుకు?
అమెరికా ప్రభుత్వం దేశీయంగా ఔషధాల తయారీని పెంచే లక్ష్యంతో ఈ సుంకాల విధానాన్ని తీసుకొచ్చింది. ట్రంప్ ఏప్రిల్ 2, 2026న పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్స్, బయోలాజిక్స్, వాటికి సంబంధించిన కొన్ని ఔషధ పదార్థాల దిగుమతులపై Section 232 కింద చర్యలకు సంబంధించిన ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన ప్రకారం నిర్దిష్ట ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకం విధించే నిబంధనను తీసుకొచ్చారు.
ఈ సుంకం కొన్ని కంపెనీలకు జూలై 31 నుంచే అమల్లోకి వచ్చింది. ఇతర కవరైన కంపెనీలకు సెప్టెంబర్ 29, 2026 నుంచి ఈ సుంకం వర్తించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే సున్నా సుంకానికి అర్హత పొందే ప్రత్యేక ఔషధాల విషయంలో తాజా వాణిజ్య శాఖ నోటీసు ప్రత్యేక మినహాయింపులను నిర్దేశించింది.
జెనరిక్ మందులకు 100 శాతం సుంకం ఉండదా?
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అమెరికా వాణిజ్య శాఖ నోటీసు ప్రకారం జెనరిక్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, వాటికి సంబంధించిన పదార్థాలు ప్రస్తుతం Section 232 ఫార్మా సుంకాల పరిధిలో లేవు. అంటే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి మందుపైనా 100 శాతం సుంకం విధిస్తున్నారనే అర్థం కాదు. ఈ సుంకాల ప్రధాన ప్రభావం నిర్దిష్ట పేటెంట్ పొందిన ఔషధాలు, బయోలాజిక్స్, వాటికి సంబంధించిన కవరైన పదార్థాలపై ఉంటుంది.
అమెరికా నోటీసు ఫార్మాస్యూటికల్ ఆర్టికల్స్ పరిధిని కూడా స్పష్టం చేసింది. పూర్తిస్థాయి ఔషధాలు, వాటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (APIలు), ఆ APIల తయారీకి అవసరమైన కీలక ప్రారంభ పదార్థాలు ఇందులోకి వస్తాయని పేర్కొంది. అలాగే జెనరిక్ ఫార్మాస్యూటికల్ ఆర్టికల్స్ నిర్వచనంలో పేటెంట్ లేని జంతు ఆరోగ్య ఉత్పత్తులను కూడా ప్రత్యేకంగా చేర్చింది.
మొత్తంగా చూస్తే అమెరికా కొత్త ఫార్మా టారిఫ్ విధానంలో భారత ఔషధ రంగానికి మిశ్రమ పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కొన్ని పేటెంట్ పొందిన మందులపై 100 శాతం సుంకం అమల్లోకి వస్తుండగా.. మరోవైపు అరుదైన వ్యాధులు, ఫెర్టిలిటీ, సెల్-జీన్ థెరపీలు వంటి ప్రత్యేక చికిత్సలకు సంబంధించిన అర్హత కలిగిన ఔషధాలపై భారత్‌కు సున్నా శాతం సుంకం ఉపశమనం లభించింది. జెనరిక్ మందులు మాత్రం ప్రస్తుతం ఈ Section 232 సుంకాల పరిధికి వెలుపల ఉన్నాయి.
- SIR వివాదంతో వేడెక్కిన రాజకీయం.. రేపు INDIA కూటమి కీలక భేటీ
- Dhruv Rathee on CEC: సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ధృవ్ రాఠీ సంచలన వీడియో…అసలు ఓట్ చోరీ కుంభకోణం ఎలా జరిగింది…
- TGSPDCL Power Demand: తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం.. TGSPDCL చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు, 12,044 మెగావాట్ల డిమాండ్
- Kavitha comments on KTR: గుంటనక్క మైండ్ గేమ్ లో పడ్డావు…కేటీఆర్ కు కల్వకుంట్ల కవిత వార్నింగ్…
- Khairatabad by election: ఖైరతాబాద్ బైపోల్.. హీటెక్కుతున్న రాజకీయం! కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?