Skip to content
బిజినెస్ › వార్తలు

Ration Card Alert: ఆరు నెలలుగా రేషన్ వాడని వారికి షాక్.. అక్టోబర్ నుంచి 1.58 కోట్ల రేషన్ కార్డులు డిసేబుల్..

jagan 29 Sep 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Ration Card Alert: ఆరు నెలలుగా రేషన్ వాడని వారికి షాక్.. అక్టోబర్ నుంచి 1.58 కోట్ల రేషన్ కార్డులు డిసేబుల్..

Ration Card Alert

Ration Card Alert: దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల డేటాను ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు సిద్ధమవుతోంది. గత ఆరు నెలలుగా తమ రేషన్ కార్డులపై ఆహార ధాన్యాల కోటాను వినియోగించుకోని సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ ప్రయోజనాలను అక్టోబర్‌ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)లో నిష్క్రియంగా ఉన్న, డూప్లికేట్ లేదా అనర్హమైన లబ్ధిదారులను గుర్తించి డేటాబేస్‌ను మరింత ప్రక్షాళన చేయడమే ఈ చర్య ఉద్దేశంగా తెలుస్తోంది.

అయితే ఆ లబ్ధిదారుల పేర్లను వెంటనే రేషన్ డేటాబేస్‌ నుంచి తొలగించరు. ముందుగా వారి కార్డులను తాత్కాలికంగా డిసేబుల్ చేసి, అర్హతను నిరూపించుకునేందుకు మూడు నెలల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి తమ అర్హతను ధృవీకరించుకుంటే రేషన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. సవరించిన టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంట్రోల్ ఆర్డర్‌లో ఇలాంటి నిష్క్రియ కార్డుల తాత్కాలిక నిలిపివేత, అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ద్వారా ధృవీకరణకు అవకాశం కల్పించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే ఎందుకు?

గత ఆరు నెలలుగా రేషన్ కోటాను వినియోగించుకోని కార్డులను ‘సైలెంట్ రేషన్ కార్డులు’గా పరిగణిస్తున్నారు. ఇలాంటి కార్డుల వెనుక డూప్లికేట్ ఎంట్రీలు, లబ్ధిదారుల మరణం, వలస వెళ్లడం లేదా అర్హత కోల్పోవడం వంటి కారణాలు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల పీడీఎస్ డేటాబేస్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు ధృవీకరించడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ ఆహార ధాన్యాలు చేరేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే ఆధార్ అనుసంధానం, డిజిటలైజేషన్, ఈ-కేవైసీ వంటి సాంకేతిక విధానాల ద్వారా రేషన్ కార్డుల డేటాను శుద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 2024 నవంబర్‌లో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇలాంటి డీ-డూప్లికేషన్ చర్యల ద్వారా సుమారు 5.8 కోట్ల రేషన్ కార్డులను పీడీఎస్ వ్యవస్థ నుంచి తొలగించారు. జూలై 30 నాటికి ఈ-కేవైసీ కవరేజ్ 90.64 శాతానికి చేరినట్లు ఆహార శాఖ గణాంకాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొన్నాయి.

నిజమైన లబ్ధిదారులకు ఇబ్బందులు వస్తాయా?

రేషన్ తీసుకోకపోవడానికి ప్రతి సందర్భంలోనూ లబ్ధిదారుడు అనర్హుడు కావాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలు, రేషన్ డీలర్‌తో ఇబ్బందులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి కారణాల వల్ల కూడా కొంతకాలం రేషన్ తీసుకోకపోవచ్చు. అందువల్ల కార్డును ముందుగా నిలిపివేసి, ఆ తర్వాత లబ్ధిదారుడే తన అర్హతను నిరూపించుకోవాల్సిన విధానంపై అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజేంద్రన్ నారాయణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. రేషన్ తీసుకోకపోవడానికి అసలు కారణాన్ని ముందుగా గుర్తించే విధానం అవసరం.

మొత్తంగా చూస పీడీఎస్ వ్యవస్థలో నిష్క్రియ, డూప్లికేట్, మరణించిన వ్యక్తుల పేర్లతో ఉన్న లేదా ఇతర కారణాలతో అనర్హంగా మారిన లబ్ధిదారులను గుర్తించి వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపడుతోంది. అయితే నిజమైన అర్హులైన కుటుంబాలు సాంకేతిక లేదా ఇతర కారణాలతో రేషన్ ప్రయోజనాలను కోల్పోకుండా ఉండేందుకు మూడు నెలల ధృవీకరణ గడువు కీలకంగా మారనుంది. ఈ వ్యవధిలో ఈ-కేవైసీ పూర్తి చేసి అర్హతను నిర్ధారించుకున్న లబ్ధిదారులకు కార్డులను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.