‘సర్’ సిత్రాలు చూడర నరుడో నరుడ!
SIR: రాష్ట్రంలో 78.14 శాతం ఎస్ఐఆర్ డిజిటైజేషన్ పూర్తి
ఓటర్ల జాబితాల ‘శుద్ధి’ పేరుతో భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) నిర్వహిస్తున్న ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ కేంద్రంలోని పాలకపార్టీపట్ల పక్షపాతంతో సాగుతోందన్న రాజకీయ ఆరోపణలతోపాటు, వివిధ పేర్లతో పెద్దసంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించటం, ‘వ్యత్యాసాల’ పేరుతో నోటీసులిస్తున్న ఓటర్లలో అత్యంత ప్రముఖులు ఎందరో ఉండటం ప్రహసనంగా తయారైంది. 2002 లో గత ప్రత్యేక సవరణ జరిగింది. అప్పటినుంచి ప్రతిఏటా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో చేర్పులు తొలగింపులు జరుగుతున్నాయి. అర్హులైన వయోజనులందర్నీ (18సంవత్సరాలు వయస్సు నిండినవారు) ఓటర్లుగా చేర్చుకోవటం ఇసిఐ విధి. అదే సమయంలో అర్హులైన ఓటరులెవ్వరూ తొలగించబడకుండా చూడటం కూడా దాని విధి. అయితే ఆచరణాత్మక దృష్టితో కాకుండా, యాంత్రికంగా ముమ్మర రివిజన్ నిర్వహిస్తున్న తీరుతో ఓటర్లను తొలగించటం దీని ప్రయోజనంగా ఆరోపణలు ముసురుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ల నియామకం తీరు, ప్రధాన కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు పక్షపాతం ఆరోపణలకు హేతువైంది. ఓటర్ల జాబితాల ప్రక్షాళనను తీరుబడిగా ఎప్పుడైనా చేబట్టవచ్చు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఉత్తర్వు చేయటంలోనే ఇసిఐ పక్షపాత దృష్టి ప్రశ్నార్థకమైంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల చేర్పులు తొలగింపులు బిజెపికి అనుకూలంగా జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధి ఆధారాలతో ఎండగట్టినా ఇసిఐనుంచి సమర్ధవంతమైన స్పందనలేదు. ఆ వ్యవహారం నడిపిన తీరును బయటకు తీసేందుకు దర్యాప్తు ఆదేశించలేదు. ఇక పశ్చిమ బెంగాల్, అసోంలలో ఓటరు జాబితాల సవరణ దానికదే పెద్ద ప్రహసనం. అక్రమ వలసదారులనే అనుమానంతో సరిహద్దు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీల ఓట్లు తొలగించటమే పనిగా రివిజన్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని ఒక రకంగా పౌరసత్వం తనిఖీలాగా నిర్వహించారు. ముఖ్యంగా ప.బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రమైన న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది సుప్రీంకోర్టు ఆదేశించిన జ్యుడీషియల్ ట్రిబ్యునళ్ల ముందు దాఖలైన 38 లక్షలకుపైగా ‘సర్’ అప్పీళ్లలో ఒక లక్ష చిల్లర మాత్రమే ఇప్పటికి పరష్కారమైనట్లు ఇసిఐ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇందులో మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. తమ ఓటు పునరుద్ధరించాలని అప్పీలు చేసుకున్నవారు 7లక్షలు మాత్రమే. మిగతా 31లక్షలు ఓటర్ల జాబితానుంచి పేర్లు తొలగించాలని ఎన్నికల సంఘం, ఇతరులు దాఖలు చేసిన విజ్ఞప్తులు. తమ ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ‘తొలగింపు ఫారాలు’ గుండుగుత్తగా సమర్పించే కార్యక్రమం ‘సర్’ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న దాఖలాలున్నాయి. మరణాలు, శాశ్వతంగా నివాసం మార్పు వంటి కేటగిరీల కింద ఎన్నికల అధికారులు చేసే తొలగింపులు సరేసరి.
మొత్తం 16 రాష్ట్రాలు, 3కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేబట్టిన ‘సర్’లో అంతకుముందు 29.93 కోట్ల ఓటర్లుండగా, 6.15 కోట్లు (17.04 శాతం) తొలగింపునకు గురైనారు. అత్యధిక తొలగింపుల్లో ఢిల్లీ టాప్‌లో ఉంది 47.56 లక్షలమంది (32.78 శాతం) ఓటర్ల పేర్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తొలగించబడినాయి. తర్వాత స్థానం మహారాష్ట్రది. ఓటర్ల సంఖ్య 9.78 కోట్లనుంచి 7.71 కోట్లకు (21.1శాతం) తగ్గింది. కర్నాటకలో 1.07కోట్లు, తెలంగాణలో 73.40లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 44.89లక్షలు తొలగింపునకు గురైనారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మ్యాపింగ్ కాని, 2002 జాబితాతో సరిచూసినపుడు స్వల్ప వ్యత్యాసాలున్న ఓటర్లకు నోటీసులిచ్చి ఆధారాలతో తమ నిజాయితీని నిరూపించుకోవాలని పరీక్ష పెట్టారు. ముసాయిదా జాబితాల ప్రకటన, అభ్యంతరాలు ఫిర్యాదుల పరిశీలనకు గడువులు పెంచుకుంటూ పోతున్నారు. కోట్ల సంఖ్యలో ఉన్న తొలగింపుల పరిశీలనకు సంవత్సరాలు సరిపోవు. అందువల్ల కొత్త ఓటర్లుగా ఫారం 6 దాఖలు చేసుకోండని
అధికారులు సలహాయిస్తున్నారు.
ఆదివారం ప్రకటించిన ఢిల్లీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకారం పేర్లలో వ్యత్యాసాలు, వయోపరిమితుల వంటి కారణాలతో నోటీసులు జారీచేసే
33 లక్షల జాబితాలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, ఆయన భార్య, బిజెపి వృద్ధనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వానీ, ఆయన కూతురు, కోడలు ఎన్నికల కమిషనర్ ఎస్.ఎస్.సంధు, 2024 నవంబర్‌లో మరణించిన ఆర్థిక వేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ వివేక్ డెబ్రాయి, మాజీ ఉపరాష్ట్రపతి జగదీష్ థంకర్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబం, సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజన దేశాయ్, ఆమె కుటుంబ సభ్యులు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు ఎందరో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ తరహా ప్రహసనం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఇందుకు 2002 ఓటర్ల జాబితా ముద్రణలో తప్పులు, పాత నివాసాల్లో లేకపోవటం, అనేక నివాసాలకు ఎన్యూమరేటర్లు వెళ్లకపోవటం, సాఫ్ట్‌వేర్ లోపాలు వగైరా ఇలా ఏదో ఒకటి కారణం కావచ్చు.
ఒక ప్రశ్న ః ‘సర్’ పేరుతో వివిధ కారణాలతో తొలగించబడుతున్న కోట్లమంది ఓటర్లలో మరణాలు, డూప్లికేట్ ఓట్లను మినహాయిస్తే మ్యాపింగ్ కాని, శాశ్వతంగా నివాసం మారినట్లు చెప్పబడుతున్న కోట్లాదిమంది మరోచోట, మరో రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు కావాలి కదా? అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపులే భారీగా ఉండగా, వారేమైనట్లు? ఇసిఐ సమాధానం చెప్పాలి.