Skip to content
క్రైమ్ వార్తలు

IIT Bombay ChatGPT Controversy: పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆత్మహత్య.. క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత..

jagan 19 Sep 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
IIT Bombay ChatGPT Controversy: పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆత్మహత్య.. క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత..

IIT Bombay ChatGPT Controversy

IIT Bombay ChatGPT Controversy: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి పవాయి క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ దొరికిపోయిన ద్వితీయ సంవత్సరం బి.టెక్ విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఐఐటీ క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగడమే కాకుండా విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మృతుడిని మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన సాహిల్ రవీంద్ర వాకోడే (22)గా అధికారులు గుర్తించారు. అతను ఐఐటీ బొంబాయిలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం జరిగిన పరీక్ష సందర్భంగా సాహిల్ తన మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘చాట్‌జీపీటీ’ (ChatGPT)కి అప్‌లోడ్ చేసి జవాబులు పొందేందుకు ప్రయత్నించినట్లు యాజమాన్యం, పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.

సమాధానాలు కాపీ చేస్తుండగా గమనించిన పరీక్షాధికారులు సదరు విద్యార్థిని పట్టుకున్నారు. అనంతరం విద్యార్థి పవాయి క్యాంపస్‌లోని హాస్టల్ నంబర్ 4లోని తన గదికి వెళ్లిపోయాడు. సాయంత్రం ఎంతకీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు హాస్టల్ అధికారులకు సమాచారం అందించగా.. సాహిల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవుడిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పవాయి పోలీసులు తెలిపారు.

సాహిల్ మృతిపై ఐఐటీ బొంబాయి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఘటనపై స్పందించిన సంస్థ యాజమాన్యం, పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినప్పటికీ సదరు విద్యార్థిపై ఎలాంటి అధికారిక క్రమశిక్షణా చర్యలు (Disciplinary Action) తీసుకోలేదని స్పష్టం చేసింది. విభాగాధిపతి (HOD), కోర్సు ఇన్‌స్ట్రక్టర్ సదరు విద్యార్థితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారని, ఈ ఉదంతం అతని అకడమిక్ కెరీర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని భరోసా ఇచ్చి పంపినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, యాజమాన్యం వాదనను తోటి విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. సంస్థ నిజాలను దాచిపెడుతోందని ఆరోపిస్తూ క్యాంపస్‌లో విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినందుకు ఒక సంవత్సరం పాటు సస్పెన్షన్ విధిస్తామని అధికారులు బెదిరించారని.. దీనివల్ల హాస్టల్ ఖాళీ చేసి బయట ఉండాల్సి వస్తుందని, కోర్సు కాలపరిమితి కూడా పెరుగుతుందని భయపెట్టారని ఆరోపించారు. ఈ తీవ్ర ఒత్తిడి, భయం వల్లే సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి యాజమాన్యమే జవాబుదారీతనం వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఐఐటీ బొంబాయి పవాయి క్యాంపస్‌లో గత ఏడు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఆత్మహత్య జరగడం ఇది మూడోసారి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఫిబ్రవరిలో ఒక ద్వితీయ సంవత్సరం విద్యార్థి, అదేవిధంగా జూలైలో మరొక బి.టెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. నిరంతరం పెరుగుతున్న అకడమిక్ ఒత్తిడి, మానసిక ఆందోళనలపై యాజమాన్యం సరైన దృష్టి సారించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు.

క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ముంబై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసిపి దత్తాత్రేయ నలవాడే ఆధ్వర్యంలో పవాయి పోలీసులు ప్రమాదవశాత్తు మృతి కేసు (ADR)గా నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, మరణానికి గల అసలు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు.