Skip to content
తెలంగాణ వార్తలు

Indiramma Houses Update: ఇందిరమ్మ ఇళ్ల సాయం పెంచాలి.. రూ. 5 లక్షల ఆర్థిక సహాయం సరిపోవడం లేదు..కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్..

jagan 10 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Indiramma Houses Update: ఇందిరమ్మ ఇళ్ల సాయం పెంచాలి.. రూ. 5 లక్షల ఆర్థిక సహాయం సరిపోవడం లేదు..కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్..

Congress MLA Raj Gopal Reddy

Indiramma Houses Update: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయం పెరిగిన ధరల దృష్ట్యా ఎంతమాత్రం సరిపోవడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి ధరలతో పాటు కార్మికుల కూలీలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే మంజూరు చేసే ఇళ్ల సంఖ్యను కొంత తగ్గించినప్పటికీ, ఒక్కో ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని తప్పనిసరిగా పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలతో నిర్మాణం పూర్తికాక పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు తమ భార్యల బంగారు ఆభరణాలను సయితం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఇంటి నిర్మాణానికే లేబర్ కాస్ట్ (కూలీల ఖర్చు) దాదాపు రూ. 3 లక్షల వరకు అవుతోందని, గతంలో రూ. 5 లక్షలతో పూర్తయ్యే ఇల్లు ప్రస్తుతం రూ. 12 లక్షల వరకు ఖర్చవుతోందని గణాంకాలతో వివరించారు. కాబట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

కాగా, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ఎంఐఎం శసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తారు. వైఎస్సార్ హయాంలో మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయిస్తూ జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 2 లక్షల ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ఎంత శాతం చొప్పున ఇళ్లను కేటాయిస్తున్నారో స్పష్టమైన కేటాయింపులను వెంటనే వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.